అక్షరాలతో అగ్గిని ముట్టించి,
అసుర బుద్ధికి నిప్పంటించేది అతడి కలం..
రాజ్యం కన్నెరుపెక్కి విరుచుకుపడ్డప్పుడల్లా,
పిడికిలెత్తి, ప్రశ్నై గర్జించేది అతడి గళం..
నిశ్శబ్దాన్ని ధ్వంసం చేసి,
పెను విధ్వంసాన్ని సృష్టించేది అతడి సృజన,
గగన కాన్వాసుపై రంగుల్ని చల్లి,
హరివిల్లుల్ని చిత్రించేది అతడి కుంచె,
అతడి అంతర్దేహంలో వేల అగ్నిపర్వతాలు బద్దలై
ఉబికిన లావాను కలంలోకి ఒంపుకొని..
బురద మెదళ్లపై నిప్పుల వర్షాన్ని కురిపించేవాడు..
కష్టాలను ప్రేమించడం మొదలయ్యాక
సుఖాలపై మోజుండదు….
ఈ నిజం అతడిని చూస్తే ఇట్టే అర్థమయ్యేది..
అలతి పదాల్లో అనంత భావం,
అనతి కాలంలో అశేష ఖ్యాతి..
పడతి కష్టాన్ని పరిమిత వాక్యాల్లో చెప్పి,
అపరిమిత వేదనను లోకానికి చూపి,
కలం కొరడాతో వీపుపై చరుస్తూ,
గాఢ నిద్రలో గురకలేస్తున్న
సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసాడు..
మరణం తన చివరి చరణం కాదంటూనే,
బీదల బాధల్ని పల్లవై పలికించాడు..
మట్టి మనుషుల గోసల్ని నెత్తిన మోస్తూ,
తన కలంతో వేల గుండెల్ని పెకిలించాడు..
అతడివి..
కడుపు నిండిన అక్షరాలు కావు,
ఎండిన డొక్కల ఆర్తనాదాలు….
అతడు…
శీతాకాలపు చలి కాచుకునే ర(క)వి కాడు…
మండు వేసవిలో భగభగ రగిలిన ప్రభాకరుడు…