నీకు నాకు మధ్యన ఏమున్నది
పెంచుకుంటే అనుబంధం
తుంచుకుంటే జడత్వం, ఏకాకితనం
గిరి గీసుకుంటే మధ్యలో గెట్టు పెట్టినట్లే
మనిషికి మనిషికి మధ్య ఏముంటుంది
జీవితం పుటల వలపోత
ఏడ్పులు, నవ్వుల కలబోత
నీకు నాకు మధ్య
చూపులను తలకెత్తుకుంటది మౌనం
చినుకుల్లా సంభాషణ రాలకపోతే
పిల్లగాలికి వరి కంకులూగినట్లుంటది
ఆలోచనల చేపలు ఈదితే
మాట బద్దలయ్యే ముందు
మనసు కొంచెం వణుకుతది
నాలుగు మాటల చిలుకలు పలికితే
నోటితూము నుంచి కాలువపారుతది
నీకు నాకు మధ్య సోపతి పెనవేసుకుంటది
నీకు నాకు మధ్య ఏమున్నది
మనిషికి మనిషికి మధ్య అనుబంధం
మనిషికి ప్రకృతికి మధ్య ఏముంటది
మోతాదు మించని ఉప్పు కారంలా
కొనసాగించాల్సిన జీవన విధానం
రోడ్డు కిరువైపులా రెండు చెట్లలా మనం
మధ్యలో నల్ల తాచుపాము
ప్రమాదాల యమపాశం విసురుతుంది
ఎందరివో రెక్కలు విరిచేస్తుంది
మనదాకా రాదులే అన్న ధీమా మనది
ప్రమాదాల లెక్కలు రోడ్డు విస్తరిస్తే ఖతం
మనమిద్దరం కలిస్తే నాలుగు చేతుల ధైర్యం
సమూహం ఏకమైతే సర్కారు దిగి రావాల్సిందే
ఒకటెనుక ఒకటి పారే చీమల్లాగానో
గుంపులా కదిలే గొర్రెల మందల్లాగానో
అందరి తెలివి కూడగట్టి కదిలితే
ప్రశ్నలు ప్రశ్నలుగా మిగులవు
-కొమురవెల్లి అంజయ్య ,98480 05676