నగరేశ్వరాలయం అనేది వినడానికి కొత్తగా ఉన్నప్పటికీ ప్రాచీన కాలంలో నగరేశ్వరాలయాల పేరిట శివాలయాలెన్నో ఉన్నాయి. ప్రధానంగా మన రాష్ట్రంలో ఎక్కువగా కాకతీయుల ప్రభావంతో టెంపుల్, ట్యాంక్, టౌన్ విధానంలో అనేక ఆలయాల నిర్మాణాలుండటం సాధారణమే. దీనికి భిన్నంగా అప్పటి కొన్ని గ్రామాలు, నగరాల్లోనే నగరేశ్వరాలయాలుండటం ప్రత్యేకం. ఈ నగరేశ్వరాలయాలను నాగరాజ ఆలయం అనే పేరుతో కూడా జానపదులు పిలిచేవారు. ఈ ఆలయాలు వేములవాడ, రామాయంపేట, తాండూరు, రంగంపేట్, నిజామాబాద్, బిచ్కుంద వద్ద కౌలాస్ కోటలతో పాటు మరికొన్ని నగరాల్లో ఉన్నట్టు తెలుస్తున్నాయి. ఇవి కల్యాణి, పశ్చిమ చాళుక్యుల హయాంలో నిర్మితమయ్యాయి.
వీటిగురించి ‘సార్థవా’ అనే గ్రంథంలో మోతిచంద్ అనే హిందీ రచయిత, చరిత్రకారుడు విపులీకరించారు. పూర్వకాలంలో వ్యాపారులు ప్రత్యేకంగా తమ గ్రామంలో ఒక ఆలయాన్ని నిర్మించేవారు. ఆ ఆలయంలో పెద్ద ఎత్తున పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఇతర దేశాలకు వెళ్లేవారట. వ్యాపారస్థులు ఇతర దేశాలకు వెళ్లే సమయంలో తమ రక్షణ కోసం పెద్ద ఎత్తున ప్రైవేటు సైన్యాన్ని వెంట తీసుకెళ్లేవారు. అప్పట్లో దిశను సూచించే పరికరాలు లేకపోవడంతో దిక్కులను సూచించడానికి దిశా కాకులను తీసుకెళ్లేవారట. ఆ రోజుల్లో ఎక్కువగా పెరుక కులస్థులుగా చెప్పుకొంటున్నవారు విదేశీ వ్యాపారాలకై వెళ్లేవారట. తాము స్వదేశానికి తిరిగివచ్చేదాకా తమ కుటుంబం రక్షింపబడాలని నగరేశ్వరాలయాలను నిర్మించి నగరేశ్వరస్వామిని పూజించేవారట వ్యాపారస్థులు.
మనం చెప్పుకొంటున్న నగరేశ్వరాలయాలను ఉత్తరాదిలో నగరహార్లుగా వ్యవహరిస్తారు. ప్రస్తుత హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబల్‌లోయ నగరహార్కు సుప్రసిద్ధమైన రాజధాని నగరంగా ఉండేది. ఇది భారీ ధనరాశులకు నిల యంగా ఉండేదట. ఈ నగరహార్పై గజ నీ మహమ్మద్ దాడిచేసి అనేక ధన రాశులను కొల్లగొట్టాడని చరిత్రకారులు అం టున్నారు. ఈ విధంగా చరిత్రను ఎంత చదివినా ప్రతీ రోజు కొత్త కొత్త విషయా లు, జీవనవిధానాన్ని తెలియజేసే వినూ త్న అంశాలు బోధపడుతాయి.
-కన్నెకంటి వెంకటరమణ
(వ్యాసకర్త: జేడీ, సమాచార,పౌర సంబంధాల శాఖ, హైదరాబాద్)