ఒకప్పుడు తెలుగుభాషలో ఎన్నో మంచి మంచి పదాలు వాడుకలో ఉండేవి. కానీ రానురాను వాటిలోంచి చాలా పదాలు కనుమరుగవుతూ వచ్చాయి. ఆరేడు దశాబ్దాల క్రితం తెలుగు సాహిత్యంలో కనిపించిన కొన్ని పదాలను గుర్తు చేసుకుంటే అవెందుకు మాయమయ్యాయా అని ఆశ్చర్యం, ఆవేదన కలుగుతాయి.
1957లో వచ్చిన సువర్ణసుందరి సినిమాలో సముద్రాల సీనియర్ రాసిన పిలువకురా అలుగకురా అనే పాటలో మనసున బాళి మరువను లేరా, చలమున మోడి సలుపకు రాజా అనే పంక్తులున్నాయి. బాళి, చలము, మోడి మొదలైన ఎన్నో పదాలుఈ కాలపు వచన కవిత్వంలోగాని, సినిమా పాటలలోగాని ఎక్కడైనా కనిపిస్తాయా, వినిపిస్తాయా?
ఛందోబద్ధ పద్యాల పుణ్యమా అని అట్లాంటి కొన్ని పదాలు ఇంకా పూర్తిగా కనుమరుగవలేదు. కానీ ఏం లాభం! ఈ రోజుల్లో పద్యాలను చదివేవారికంటె వచనకవిత్వాన్ని చదివేవారే ఎక్కువగా ఉన్నారు. ఆరేడు దశాబ్దాల కింద వచనకవిత్వం ఇంత ఉధృతిలో లేదు. పద్యాల ప్రాబల్యమే ఎక్కువగా ఉండేది. పద్యాలు రాయనివారు సైతం పద్యాలను చదివేవారు. ఇప్పుడు అది చాలా అరుదు. తెలుగులోంచి సంస్కృత పదాలు మాత్రమే కనుమరుగయ్యాయనుకుంటే పప్పులో కాలేసినట్టే. బాళి, చలము, మోడి, బింకము ఇవన్నీ అచ్చతెలుగు పదాలే అని తెలుసుకున్నప్పుడు అచ్చెరువొందుతాం. శాలీనత, ఊహాశాలిత నయగారం, మెరమెచ్చులు, రికామీ, ఉగ్గడింపు, మాలిమి, జమిలి, కాపాయం, పరాస్తం, లోనారసి, నివ్వెర, ఉరామరిక, ఉజ్జాయింపు, తావలం, కాణాచి, చెవికమ్మ, బులపాటం, పాసంగం, తెంపరితనం, ఏతావాతా, మట్టసం.. మొదలైన లెక్కలేనన్ని పదాల వాడకం మెల్లమెల్లగా తగ్గుతూ పోతున్నది. ఇంకా, పూర్తి గ్రాంథిక ప్రౌఢ పదాలను, మాండలిక పదాలను కాకుండా మధ్యస్థం గా ఉండే మాటలనే సూచించడం జరిగిందిక్కడ.
వీటిలో పెద్దగా డాంబికత లేదు. పైగా వీటిలో సంస్కృత పదాలకన్న తెలుగు పదాలే ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇవ న్నీ ఈ కాలపు భాషాపరమైన రివాజు ప్రకారం ఉపయోగించ తగినవే అని ఉద్దేశం. ఇట్లాంటి వందలకొద్ది పదాలు అదృశ్యమైతే భాష చిక్కిపోయి, నీరసించి, నిస్సార మయ్యే అవకాశాలే ఎక్కువ. మొత్తం మీద చూస్తే, తెలుగు పదాలకన్న సంస్కృత పదాలే ఎక్కువ సంఖ్యలో తెలుగుభాష లోంచి నిష్క్రమించిన మాట వాస్తవం. ఛందోబద్ధ కవిత్వంలో దాదాపు అన్నీ సంస్కృత పదాలే ఉండేవి కదా.
ఛందోబద్ధ పద్యాల స్థానంలో వచనకవిత వచ్చి చేరడం వల్లనే సంస్కృత పదాలు మునుపటంత తరచుగా కనిపించడం లేదు. పూర్వం వచనకవిత్వంలో సైతం అవి ఎక్కువగానే దర్శనమిచ్చేవి. దీనికి కారణం ఈ తరపు వచనకవులు తత్సమశబ్దాలను పూర్తిగా మానుకోవడమే. ఒక తెలుగు కవితా సంపుటిలో cloudకు సమానమైన పదాన్ని వాడాల్సివస్తే, నేటి వచనకవి ప్రతిచోటా మేఘం అనే వాడుతాడు. మ హా అయితే కొన్నిసార్లు మ బ్బు అంటాడే మో. కానీ వలాహకం, జలదం, వా రిదం, నీరదం, తోయ దం, అంబుదం, జీమూ తం మొదలైన ఎన్నో పర్యాయపదాల్లోంచి ఒక్కదాన్ని కూడా స్వీకరించడు . ఎందుకంటే అది సంస్కృతపదం కనుక. ఈ సంగతిని ఒక ప్రసిద్ధ అవధాని గారు చెప్పారనుకోండి. కానీ ఈ పరిశీలన భూమి, నీరు వంటి మరెన్నో పదాలకు కూడా వర్తిస్తుంది. చెప్పదల్చుకున్నదేమంటే, భిన్నసందర్భాలలో భిన్నమైన పర్యాయపదాన్ని ఎంచుకోవచ్చుననే ఆలోచన కవులలో, రచయితలలో రోజురోజుకూ తగ్గు తూ వస్తున్నది. ఇది గో, ఈ అలవాటు వల్లనే భాషలోంచి పదాలు మాయమౌతాయి. పాఠశాలకు బదులు ప్రతిసారీ పాటశాల అని రాసేందుకైనా సిద్ధపడతాం కానీ, ఒకే రచనలో ఆ మాట ఎక్కువసార్లు వచ్చినప్పుడు కొన్నిసార్లు పాఠశాల అనీ, కొన్నిసార్లు బడి అనీ, మరికొన్ని సార్లు స్కూలు అనీ రాయవచ్చు. అదేవిధంగా కొన్నిసార్లు ‘హఠాత్తుగా’ అనే పదాన్ని, మరి కొన్ని సార్లు ‘ఎకాయెకిన’ అన్న మాటను రాసే వీలుంది. ఇప్పుడు జరు గుతున్న మార్పులలోని ప్రతిదీ ఘోరమైన విచక్షణా రాహిత్యం ఫలితంగా ఏర్పడిందని అనడం లేదు. కానీ నచ్చని పదాలను పూర్తిగా మానుకోకుండా, ఎక్కువసార్లు ఇతర పర్యాయ
పదాలను ఉపయోగించవచ్చు.
వ్యతిరేకత లేనివాళ్లు వాటిని ఉపయోగించవచ్చు. ప్రతి కవీ, రచయితా అందుబాటులో ఉన్న పర్యాయపదాలన్నిటినీ విస్తృతంగా పరిశీలించి ఒక్కోసారి ఒక్కోదాన్ని వాడటం ద్వారా, భాషలోంచి పదాల నిష్క్రమణను చాలావరకు తగ్గించవచ్చు.
‘రశ్మ్యుద్గారత’ పలికేందుకు చాలా జటిలంగా ఉన్న మాట వాస్తవమే. హర్మ్యము, అర్ఘ్యము మొదలైన పదాలలోని సంయుక్తాక్షరాలు కూడా కొంచెం జటిలంగా ఉన్నాయి కాబట్టి, అవి వచనకవితలో అంతగా ఒదగవనేది కూడా వాస్తవమే. కానీ వలాహకం, వారి దం లాంటి మాటలను సైతం పూర్తిగా తిరస్కరించడం జరుగుతున్నది. దీని వలన అట్లాంటి మాటలు భవిష్యత్తులో శాశ్వతంగా కాలగర్భం లో కలిసిపోతాయి. ఇంగ్లిష్‌లోని పదాలు తెలు గు భాష లోనికి దిగుమతి అవుతున్నాయని దిగులు పడతాం కాని, ఉన్న తెలుగు పదాలనన్నిటినీ వాడుతూ అవి కనుమరుగు కాకుండా జాగ్రత్త పడుతున్నామా అని ఆలోచించడం లేదు మనం. ఇటువంటి సంకట పరిస్థితి రావడానికి భాష లో మితిమీరిన సరళీకరణ లేదా అతి సరళీకరణ (oversimplifi cation of language) కూడా ఒక కారణం. మరి ఈ విషయం గురించి అందరూ ఆలోచించాల్సిన అవసరమున్నది.
-ఎలనాగ, 98669 45424