తమకు ఎన్నో వనరులను ఇచ్చి, సుఖజీవనాన్ని అనుగ్రహించిన దైవానికి కృతజ్ఞతలు తెలుపుకోవడం పండుగల ఉద్దేశ్యం. పండుగలు ప్రజల ఆలోచనా దృక్పథాన్ని, వికాసనశీలాన్ని ప్రతిబింబిస్తాయి. బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రాంతంలో జానపదులు జరుపుకునే పండుగలలో అత్యంత విశిష్టమైనది. భాద్రపద అమావాస్య నుంచి ప్రారంభమయ్యే ఈ పండుగ దేవీ నవరాత్రులతో సమాంతరంగా సాగుతుంది. పార్వతీదేవిని వివిధ రూపాలలో ప్రతిష్ఠించి జనులు వారి వారి సంప్రదాయానుసారంగా నిర్వహించు కోవడం మనకు తెలుసు. స్త్రీలలో వివిధ మనోకోణాలను, శక్తియుక్తులను ప్రతిబింబించే దేవీ ఆరాధన లోక క్షేమకారకం. దేవీ ఆరాధనను శాస్త్రాలలో రెండు విధాలుగా చెప్తారు. ఒకటి సమయాచారం, రెండు వామాచారం లేదా కౌలాచారం. బతుకమ్మ బతుకునిచ్చే అమ్మ. మాతృస్వరూపిణి. ప్రేమైకమూర్తి. ఆమె ఆరాధన అత్యంత సాత్వికమైనది. భక్తి సుమభరితమైంది.
జానపదులు అత్యంత ప్రీతిపాత్రం గా ఈ నవరాత్రి వేళలలో బతుకమ్మ గా దేవిని ఆరాధిస్తారు. పసుపు గౌరమ్మను బతుకమ్మపై నిలిపి ఆరోగ్య, సౌభాగ్యాలను ఇవ్వాలని ప్రార్థిస్తారు. పొలాలలో నాట్లు వేసి న తరువాత భూమాత గర్భిణియై ఉంటుం ది. ఈ భావన బతుకమ్మ పండుగ ఆచరణ లో అంతర్లీనంగా కనబడుతుంది. ఆడకూతు రు గర్భవతి అయినప్పుడు ఆమెకు ఏవిధం గా పోషకాహారం ఇస్తారో అట్లా పంట తల్లి ప్రతిరూపంగా బతుకమ్మకు సీమంతోత్సవం గా అటుకులు, ముద్దపప్పు, పెరుగు, బెల్లం, చక్కిలాలు, కరియలు వంటి వాటిని సమర్పిస్తారు. తొమ్మిది నెలలకు, తొమ్మిది రోజులు ప్రతిగా ఈ ఉత్సవం సాగుతుంది. దుర్గాష్టమి నాడు జరుపుకునే చద్దుల బతుకమ్మనాడు చద్దుల నివేదన జరుగుతుంది.చద్దులు అంటే రకరకాల ఫలహారాలు. కనుల పండుగగా జరిగే ఈ పండుగ మనసులను, సమాజాన్ని ఆత్మీయ పరిమళభరితం చేస్తుంది.
భూప్రస్తారంగా ఉండే శ్రీచక్రం పళ్లెం వలె ఉండి, దానికి శ్రీచక్ర యంత్ర రేఖలు గీయబడి ఉంటుంది. బంగారం, పంచలోహాలు, రాగి మొదలైన లోహాలు ఈ యంత్ర నిర్మాణంలో ఉపయోగిస్తారు. వీటిని తయారుచేసే కంచలి కులస్థులకు శ్రీచక్ర యంత్రం, బీజాక్షరాల పరిజ్ఞానముంటుంది.ఈ యం త్రం మధ్యలో దేవిని ప్రతిష్ఠించి పూజిస్తారు. భాద్రపద బహుళ దశమి నుంచి ఐదురోజుల పాటు జరుపుకునే బొడ్డెమ్మ పండుగ భూప్రస్తారమైన శ్రీచక్రాన్ని గుర్తుచేస్తుంది. ఇంటి ముంగిట పీట నుంచి దానిపై ముగ్గులువేసి బొడ్డెమ్మను నిలుపుతారు. ముగ్గులు వేసిన పీటపై పుట్టమన్నుతో చేసిన ఐదుగిన్నెల దొంతరలను ఉంచి, పంచభూతాలకు గుర్తు గా బీర, రుద్రాక్ష, చక్రం, శంఖ, చామంతి పుష్పాల నుంచి పూజిస్తారు. పుట్టమన్ను గిన్నె లు ఆహారాన్ని కోరుతూ నిలిపినవి. బొడ్డెమ్మ అనుగ్రహించి చక్కని పంటలు పండించి, ప్రజల ఆకలి తీరుస్తుందని స్త్రీమూర్తుల భావం. పాటలు పాడుతూ బొడ్డెమ్మ చుట్టూ చప్పట్లు చరుస్తూ తిరుగుతారు. ఆడిపాడిన తరువాత ఆ పూలను ఏరి ఐదేండ్ల వయసున్న అమ్మాయి ఒడిలో పోస్తారు. ఇక్కడ దేవీపూజలో భాగమైన కుమారీపూజ జరుగుతుందన్నమాట. తీపి పదార్థాలు, పుట్నాలు, బెల్లం ప్రసాదంగా పంచుకుని తింటారు.
భాద్రపద అమావాస్య నుంచి ప్రారంభమయ్యే బతుకమ్మ పండుగ దుర్గాష్టమి వర కు సాగుతుంది. రమణీయ ప్రకృతిలో అత్యంత సుందరమైన, కోమలమైన ఔషధీయగుణాలు కలిగిన పుష్పాలతో పేర్చబడే బతుకమ్మ శ్రీచక్ర మేరు ప్రస్తారాన్ని పోలి ఉంటుంది. పువ్వుల మధ్యలో పొట్ట నింపడానికి ఆకులను, పూలకాడలను, తొడిమెలను వాడుతారు. బతుకమ్మపై పసుపు గౌరమ్మను నిలుపుతారు. దీనికి వాడే వస్తువులు, పువ్వు లు శ్రీచక్రంలోని షట్చక్రాలను సూచిస్తాయి. మూలాధారచక్రం భూతత్త్వానికి గుర్తు. బతుకమ్మను పేర్చే తాంబాళం, గుమ్మడి ఆకు మూలాధార చక్రం అన్నమాట. దానిపైనది స్వాధిష్ఠానచక్రం నీటికి గుర్తు. గడ్డిపూలతో పేర్చబడే ఈ వరుస స్వాధిష్ఠానమే. మణిపూరక చక్రం అగ్నితత్త్వానికి ప్రతిరూపం. తంగేడుపూల వరుస మణిపూరకమే. తరువాతది అనాహత చక్రం. ఇది వాయుతత్త్వం, హృదయస్థానం. ఈ చోట గునుగుపూలు ప్రకాశిస్తా యి. ఇకపైన విశుద్ధిచక్రం ఇది ఆకాశతత్త్వం, వ్యోమస్థానం. బంతులు ఈ వరుసలో రంజింప చేస్తాయి. ఆజ్ఞాచక్రం మనస్తత్త్వం, చంద్రస్థానం. పచ్చని, తెల్లని గుమ్మడిపూవులు మనసును చల్లగా, తెల్లగా ఉంచుకోవాలని సూచిస్తాయి. ఇక ఊర్ధ్వస్థానంలో సహస్రారచక్రం. ఇక్కడ శతపత్రాలున్న పద్మాన్ని ఉంచుతారు. ఇది మేధస్సుకు, మనో నిగ్రహానికి గుర్తు. దాని పై పసుపు గౌరమ్మ. ఆమె శక్తికి, నిర్మలతకు ప్రతీక. అనేక యోగసాధనల ద్వారా మని షి కుండలినీశక్తిని ప్రేరణచేసి, షట్చక్రాలను దాటి సాధించవలసింది శక్తిని, నైర్మల్యాన్ని మాత్రమే. పసుపు గౌరీదేవి బిందుస్థానం లో ఉండి భక్తులను అనుగ్రహిస్తుంది.
బతుకమ్మను పార్వతీదేవిగా భావిస్తూ స్త్రీలు పాడే పాటలు ఆత్మీయభావనతో నిండి ఉంటాయి.
శ్రీగౌరి నీ పూజ ఉయ్యాలో
చేయబూనితినమ్మ ఉయ్యాలో
శ్రీ లలితవు నీవు ఉయ్యాలో
సిరులనిచ్చే తల్లివీ ఉయ్యాలో
చదువుల నిత్తువూ ఉయ్యాలో
శ్రీ సరస్వతివి నీవు ఉయ్యాలో
అంటూ ప్రార్థిస్తారు.
బతుకమ్మను జలనిమజ్జనం చేస్తూ …
ఇసుకలో పుట్టే గౌరమ్మ ఇసుకలోపెరిగే గౌరమ్మ ఇసుకలో వసంతమాడగా పోయిరావమ్మా గౌరమ్మ పసుపులో పుట్టె గౌరమ్మ పసుపులో పెరిగే గౌరమ్మ పసుపులో వసంతమాడగా పోయిరావమ్మా గౌరమ్మ.. అంటూ
నిదురపో బతుకమ్మ నిదురపోవమ్మా –
నిదురకూ నూరేళ్లు నీకు వెయ్యేళ్లూ
నినుగన్న తల్లికీ నిండ నూరేళ్లూ –
అనే పాటలతో బతుకమ్మను సాక్షాత్తు శ్రీచక్ర సింహాసనారూఢ అయిన గౌరీదేవిగా రూపొందిస్తూ ఆరాధించడం సమయాచార పద్ధతిలో మమేకమైన జానపద సంస్కృతి. బతుకమ్మను చీకట్లు ముసురుకునే సాయంవేళ జలాశయాలలో నిమజ్జనం చేస్తారు. ఈవిధంగా జానపదులు జరుపు కొనే బతుకమ్మ ఉత్సవం శక్తిపూజకు, శ్రీచక్రార్చనకు ప్రతిరూపమై నిలుస్తున్నది. బొడ్డెమ్మ, బతుకమ్మల మనోహరమైన సుందరరూపాలు భూప్రస్తార, మేరుప్రస్తార శ్రీచక్రాలను జనులకు అందుబాటులోకి తెస్తా యి. జనుల హృదయాలు ఆత్మీ య, భక్తిభావంతోనూ, ప్రేమామృత స్పర్శనూ కలిగి ‘అహం బ్రహ్మాస్మి’ అనే సమొన్నత భావాన్ని పెంచుతాయి.
(అక్షరయాన్ సౌజన్యంతో)
-తిగుళ్ల అరుణకుమారి , 83329 09557