ఒకప్పుడు గ్రామాల్లో వీధిబడి ఓ విడదీయలేని భాగం. వీధిబడిలో అక్షరాలు దిద్దుకుని అసాధారణ ప్రతిభ కనబరిచిన వారు చరిత్రలో చాలామందే కనిపిస్తారు. సాధారణంగా వీధిబడి అంటే ఏకోపాధ్యాయ పాఠశాల. ఒక్క అయ్యవారే (ఉపాధ్యాయుడు) ఆయనకు సాధ్యమైనన్ని తరగతులకు అన్ని అంశాల పాఠాలు బోధించేవారు. పాఠాలకు తోడు క్రమశిక్షణకు మారుపేరాయన. అందుకే చాలామందికి చదువు బాగా వంటబట్టేది.
ఒకప్పుడు బడి పంతుళ్ల ఆదాయం అంతంత మాత్రంగా ఉండేది. ఈ నేపథ్యంలో దసరానాడు అయ్యవారు వెం టరాగా ఊరిలో దక్షిణల కోసం ఇంటింటికివెళ్లేవారు. పిల్లలచేత పాటలు పాడి స్తూ తన దగ్గర చదువుకునే పిల్లల ఇండ్ల కు వెళ్లి దక్షిణ అడిగేవారు అయ్యవార్లు. అలా వారికి పండుగ భత్యం ముట్టేది. పాటలు ముందుగా విఘ్నేశ్వరుడి పాట తో ప్రారంభమయ్యేవి.శ్రీగణాధీశాయ శివకుమారాయ/ నాగముఖ తొండాయ నాగభూషాయ/ లోకజన వంద్యాయ లోలనేత్రాయ/ శ్రీకంఠ తనయాయ సృష్టికర్తాయ/ బాగుగా విద్యలకు ప్రోదిగా దేవ/ జయా విజయీభవ దిగ్విజయీభవ… అంటూ పిల్లలు ఆలపించేవాళ్లు. అలా వినాయకుడిని వేడుకున్న తర్వాత తమ రాక కారణాన్ని వివరిస్తూ మరో పాట అందుకునేవాళ్లు.
శ్రీరస్తు మీకెల్ల దిగ్విజయమస్తు/ఆయురభ్యుదయోస్తు ఐశ్వర్యమస్తు/ బహుమానములనిచ్చి పంపండి వేగ-అయ్యవారికి చాలు పది వరహాలు/ పిల్లవాండ్లకు చాలు పప్పుబెల్లాలు-బాలకుల దీవెనలు బ్రహ్మ దీవెనలు/ జయా విజయీభవ దిగ్విజయీభవ… తాము వెళ్లిన ఇంటివాళ్లకు అన్నిట్లో శుభం చేకూరాల ని, అన్ని పనుల్లో విజయం కలగాలని పిల్లలు దీవించేవాళ్లు. వారు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యంతో తులతూగాలని కోరుకునేవాళ్లు. తాము వచ్చింది దసరా ‘బహుమానము’ల కోసమని, వాటిని ఇచ్చి తమను వేగంగా పంపించాలని కో రేవాళ్లు. ఇక బహుమతులంటే వేల రూ పాయల ధనమో, ఇంకేటో కాదని చెప్తూ ‘అయ్యవారికి పది వరహాలు’ ఇవ్వాలని, తమకు పప్పుబెల్లాలు మాత్రం చాలనేవాళ్లు.‘బాలవాక్కు బ్రహ్మవాక్కు’ కదా! పిల్లలంతా ‘బాలకుల దీవెనలు బ్రహ్మదీవెనలు’ అని జన వ్యవహారాన్నీ తమ నోట పలికేవారు.
పావలా బేడయితే…
వెళ్లిన ఇంటివారికి మంచి జరగాలని దీవించిన తర్వాత పిల్లలను ఉత్తచేతులతో పంపడానికి ఎవ్వరికీ మనసొప్ప దు. అయితే పెద్దమొత్తంలో అడగలేదని ఏ పావలానో, అర్ధ రూపాయో అయితే అయ్యవారికి అవమానం. కాబట్టి తమ కు విద్యాబుద్ధులు చెప్పి, మంచి జీవితానికి బాటలు వేసే గురువును తగిన రీతిలో గౌరవించాలని చెబుతూ మరోపాట అందుకునేవారు.
పావలా బేడయితే పట్టేది లేదు-అర్ధ రూపాయయితే అంటేది లేదు
మూడు పావలాలయితే ముట్టేది లేదు-ఒక్క రూపాయకు విలువనే లేదు
పది రూపాయల కట్నంబు మాకు-పరగ చెల్లించండి పోయెదము మేము
జయా విజయీభవ దిగ్విజయీ భవ
పావలానో, రూపాయో కాకుండా ఏడాదికి ఒకసారి వచ్చారు కాబట్టి, కనీ సం పది రూపాయలైనా గురుదక్షిణ సమర్పించండి అని అడిగేవాళ్లు. అన్ని ఇండ్లూ తిరిగాక విజయ దశమి రోజున ఉపాధ్యాయుడు పిల్లలందరినీ కూర్చోబెట్టి వారికి దేవుడికి నివేదించిన ‘పప్పుబెల్లాలు’ ప్రసాదంగా పంచిపెట్టేవారు.
– చింతలపల్లి హర్షవర్ధన్