కాకతీయుల తరువాత ఆంధ్రదేశాన్ని పాలించిన రాజ వంశాలలో రెడ్డిరాజులు ఒకరు. వీరిలో కొండవీటి, రాజమహేంద్రవర, కందుకూరు రెడ్డిరాజులు ముఖ్యులు వీరితోపాటు సామంత మాండలిక రెడ్డి రాజులు పలు ప్రాంతాలను పాలించారు. వారిలో మనుమకుల, కాంతమధూక, విట్టి ,మోటవాడ వంశీయులు కూడా ఉన్నారు. వీరిలో నడిపట్ల గోత్రోద్భవుడైన నందిమల్లారెడ్డి వేయించిన శాసనం మహబూబ్నర్ జిల్లా అచ్చంపేట తాలుకాలోని మన్ననూరు గ్రామ సమీపంలో ఉన్నది. శాసన కాలం శ. సం. 1390 = క్రీ.శ. 1468.ఈ శాసన లేఖకుడు కారుపాముల అప్పయ్య.
నడిపిట్ల నంది తిమ్మారెడ్డి, సర్వమాంబ దంపతుల పుత్రుడైన మల్లారెడ్డి శ్రీశైల ఉపరి భాగంలోని మునిపుర(మున్ననూరు) రాజ్యాన్ని పాలిస్తున్న సమయంలో అక్కడ విజయగోపాలస్వామికి ఆలయము, గర్భ మందిరం, అంతరాళం, భోగమండపము, నృత్య మండపము, ధ్వజస్తంభము, పచనాలయం (వంటశాల) నిత్య కళ్యాణమంటపం, యాగ మంటపం, ద్వార గోపుర ప్రాకారం, గరుడ స్తంభము, ఆంజనేయ నివాస దృఢ ప్రస్తర నిర్మిత సోపానములు, పుణ్య పుష్కరిణి తటాకము, ఆరామము మొదలైన కైంకర్యములు సమర్పించాడు. ఈ సమాచారం వేదశాస్ర్తార్థ తత్త్వజ్ఞులైన వెంకట భట్టోపాధ్యాయులను శాసనంగా రచించమని కోరాడు. శాసనము సూర్యచంద్రులున్నంత వరకు రుక్మిణీ, సత్యభామల నాయకుడు, నంద నందనుడు శ్రీకృష్ణుడు రక్షించుగాక. శాసనంలో మల్లారెడ్డి తండ్రి తిమ్మారెడ్డి ‘శ్రీ మద్విజయ గోపాల దేవ ప్రసాద లబ్ద శశ్వదైశ్వర్యధుర్య హేమాద్రి దాన చింతామణి జగనొబ్బగండ, కంపిరాయ రాయ, మీసరగండ భుజబల భీమ నడిపిట్ల గోత్రోద్భవ నంది తిమ్మారెడ్డి’ అని పేర్కొనబడినాడు.
-భిన్నూరి మనోహరి