పేదలు రాత్రి గుడిసెలో
పడుకునే ముందర దీపం ఒత్తిని తగ్గించి
పడుకుంటారు
పొద్దటికి వాళ్లముక్కులోకి పొగసూరిన పొగతోనే
పొద్దును నిద్రలేపే ఊరపిట్టలౌతారు.
ఇంటికి సుట్టపు సూపుతో ఎవరైన వస్తే
మాసారిపూట కల్లుగేరికిబోయి
కొంగుముడిలో దాసుకున్న పదిరూపాలతో
తలా ఓ సీస కల్లుతాగి గుగ్గిల్లు తింటూ
బత్కు యతలన్నింటిని కల్లంగడిలో ధారబోస్తారు.
పాత సుట్టిర్కం దూరంకాకుడదని
మేనరికం తప్పని తెలిసిన
మ్యానమామ బిడ్డను పెండ్లి జేసుకొని
మూడు తరాల కుటుంబ బంధాలకు
దుసిరే తీగల తీరుగా అల్లుకునే ఆనందగూటి పక్షులు.
ఆడబిడ్డ పుట్టింటికొస్తే
సంతలో అగ్వసగ్వకుదెచ్చిన
మోటు చీరబెట్టి
పరిగకంకుల్ని రాల్పిన బియ్యంతో ఒడినింపి
ఆడబిడ్డల ప్రేమను ఆరేడు తరాలదాకా
నిల్పుకునే నీలగిరి వనంలాంటి శిఖరాలు.
పల్లెన ఎవడైన తప్పుజేస్తే
రచ్చకట్టకు పిలిపించుకొని
తలా ఓ మాటని ఇద్దర్కీ సర్దిజెప్పి
రంకులాటలతో కాపురాలు ఆగమైతాయనీ గదిమి
కట్టెలు పట్టుకున్న చేతులను
కలిపే పెద్ద మనుషులు
ఊరును నిలబెట్టే తాటికమ్మల గుంజలు.
ఊర్లో ఎవరి గూటి దీపం ఆరిపోయినా
ఊరి జనమంత చూసి నాల్గు కన్నీటి బొట్లు రాల్చి
పిండకూడు వండి పాడెగట్టి భుజానికెత్తుకొని
పిడికెడు మట్టిదానం చేసి
మనిషికి మనిషి జతయిన తుమ్మకొమ్మల నీడలు.
-అవని శ్రీ , 9985419424