మారుతాడు మనిషి ఎటువంటి కోరికలు కొండెక్కనపుడు
ఉత్తమ జన్మ ఉచిత వరమైనా దాని సార్థకతలో విఫలం వైపే
అడుగులు పడుతుంటాయి
ఎందుకో మరి? తెరచాటున
వెలుగు చీకట్ల నడుమ నింగి, నేల గొడుగు నీడలలో
గాలి, నీటి, అగ్ని భూతాల జాడలలో
రెండు భిన్న దేహాల సంపర్కంతో
జీవం పోసుకున్న జీవులన్నీ
మనుగడ సాగించే మట్టి మనుషులనీ!
మనుషులు ఆడుతున్న నాటకంలో
అనాలోచిత స్వార్థ బుద్ధి చింతనతో
తమ తమ అవసరాల కోసం మనసులు మాలిన్యమై
సుఖ శాంతుల ఆటల పోటీలో ఒకరినొకరు నెట్టి వేసుకుంటూ
బతుకు బాటలో విషం చిమ్ముకుంటున్నారని..!
ఆశలను, ఆశయాలను అట్టడుగున తోలు బొమ్మలుగా చేసి
ఎడారి ఎముకల గూడుల్లో పురుడు పోసుకున్న మట్టి పిండం
మొండితనపు అహంకారంతో శత్రు వినాశన మోపున
కారణ భూతమై నిలుస్తున్నరనీ..!
ఆత్మ వంచన చేసుకోలేక కఠిన నిర్ణయాల
తెర వెనుక పాత్రల్లో నటిస్తూ
నిత్యం సంఘర్షణల బతుకు కావడిలో
కాలం వాలిపోతున్న వైపున
మట్టి మనుషులై జీవనం చేస్తున్నరనీ..!
నేనే బతకాలని స్వార్థం
నాకే చెందాలని ఆశల కొలనులో
మునుగుతూ తేలుతున్న
మనుషుల మనస్తత్వాలు
ఎప్పటికీ మారేవి కావని తెలుసుకున్నాను!
-డాక్టర్ పగిడిపల్లి సురేందర్
80748 46063