ఏనాడు బాలశిక్షతో బంధించావో గానీ…
నీ భావ బాహువులు నా మనో
తనువును వదిలి వెళ్లడం లేదు!
ఏనాడు చందమామతో గోరు ముద్దలు పెట్టావో గానీ
ఆ తీపితనపు అక్షరాలను నా మది ఇంకా మరువనే లేదు!
ఏనాడు పాఠ్య పుస్తక పరిమళాలు గుబాళించావో గానీ..
ఆ విషయ సుగంధం ఇంకా తాజాదనాన్ని కోల్పోనే లేదు!
ఏనాడు జ్ఞాన జగములో ఓలలాడించావో గానీ..
ఆ పరిజ్ఞాన సంపదంతా
నా మది ఖజానాను దాటి వెళ్లనే లేదు!
ఏనాడు సుగ్రంథాల గరిమను అంకితమిచ్చావో గానీ..
మెదడుకు మేతై నాలో లీనమయ్యావో గానీ..
నా జీవన గూటిలో ప్రాణమై నిలిచావు!
నా వ్యక్తిత్వ దేహానికి గుండెకాయగా మారావు!!
-అయిత అనిత