ముళ్ళను మూలన కుప్పవేసి
అక్షరాల అలుకు చల్లి
ఆర్ద్రతను ఆరుతడి మడులతో నింపి
కలం హలంతో
ఆత్మీయ బంధానికి ఆర్తితో లేఖ రాస్తే
ఎంత పచ్చగా పండుతుందో ఎవరికి తెలుసు?
ఇన్ని బలమైన మాటల ధాన్యాల్ని
మోపు చుట్టి దారంతో సుతారంగా ముడివేసి
చటాలున అటుగా విసిరితే
గుప్పెడు పలకరింపుల గింజలతో
ఆ గుండెంత నిండునో ఎవరికి తెలుసు?
ప్రేమతో పొసగి ఒకటిగా అల్లుకున్న చాటలో
పదాల నూకల్ని చెరిగి మెరిగలు కొన్ని ఒలిపేసి
తెల్లనివి కొన్ని ఓరకు ఒంపుకొని
ఉడికినవో.. ఉగ్గినవో..
సమయానికి ఇన్ని గంజినీళ్లలా శ్వేతపత్రం అందితే
ఆకలికి ఎంత ఆయుష్షు పెరుగునో ఎవరికి తెలుసు?
ఆరాలు తీసి ఆత్రంగా చూసి
దిక్కులన్నీ కలియచుట్టి వెతికి వేసారి
తుదకు ఓ లేఖ వాకిట్లో వాలితే
మదిలో సంబుర కెరటాలు
ఎంత ఉప్పొంగునో ఎవరికి తెలుసు?
తాకే తెర అంటూ తనను
తాను దూరంగా పారేసుకుంటూ
నిత్యం అంతర్జాలంలో అరిగి కరిగిపోతున్న
ఇప్పటి (నిర్)జీవితాలకు మాత్రం అసలే తెలియవు!
-బొప్పెన వెంకటేష్ 98665 84062