రంగులు మార్చుతూ ఊసరవెల్లులై
గునపాలు దిగినా స్పందించని ప్రాణులై
నులిమి సిగ్గు గొంతు నులిమి చంపేశారు
కాదు కాదు సిగ్గే సిగ్గుపడి ఆత్మహత్య జేసుకుంది!
మనస్సాక్షినీ నిరంతరం మోసం జేస్తూ
నమ్మినోళ్లనీ నిలువునా నట్టేటముంచేస్తూ
నులిమి సిగ్గు గొంతు నులిమి చంపేశారు
కాదు కాదు సిగ్గే సిగ్గుపడి ఆత్మహత్య జేసుకుంది!
కళ్లకు అయినోళ్ల కాకాల అద్దాలు పెట్టుకొని
కానోళ్లను కాకుల్లా అరుస్తూ రాబందుల్లా పొడుస్తూ
నులిమి సిగ్గు గొంతు నులిమి చంపేశారు
కాదు కాదు సిగ్గే సిగ్గుపడి ఆత్మహత్య జేసుకుంది!
నమ్మమని నమ్మబలికి నమ్మకాన్నే వంచించి
నిస్సిగ్గుగా సమాజంలో తలెత్తుకు తిరుగుతూ
నులిమి సిగ్గు గొంతు నులిమి చంపేశారు
కాదు కాదు సిగ్గే సిగ్గుపడి ఆత్మహత్య జేసుకుంది!
బంగారు దేవతా వస్ర్తాలు ధరించి
నిస్సంకోచంగా ఉత్తపిత్తల ఊరేగుతూ
నులిమి సిగ్గు గొంతు నులిమి చంపేశారు
కాదు కాదు సిగ్గే సిగ్గుపడి ఆత్మహత్యజేసుకుంది!
-రవి కిషోర్ పెంట్రాల
లాంగ్లీ, లండన్