ఎనిమిదేండ్ల రాష్ట్రంపై దండయాత్ర మీది
నాలుగు కోట్ల ప్రజల ఆత్మగౌరవం మాది..
భవిష్యత్ ఆలోచన మాది
నాలుగేండ్లు కండ్లల్ల వత్తులేసుకుని
మొగులుకు మొక్కుతూ
ఈ ఏడాదైనా వానదేవుడు దయచూపకపోతడా?
నాలుగు చినుకులు రాలకపోతయా?
చెరువు నిండకపోతదా? అలుగు పారకపోతదా?
వాగు ఎల్లకపోతదా? దెమ్మనన్న సాగకపోతదా?
నాలుగు తిండిగింజలు పండకపోతయా?
అని ఎదురుచూసిన కాలం
కండ్ల ముంగట వాగు జీవనది అయింది.
నాలుగేండ్లకు ఒక్కసారి గాదు..
యాడాదికి నాలుగు నెలలు పారుతనే ఉన్నది.
చెరువు ఎప్పుడూ నిండు గర్భిణిలా
నీళ్లు నింపుకొనే ఉంటున్నది.
చేపలను నిత్యం కంటనే ఉన్నది.
సమైక్య పాలనలో ఆకలిచావులు చస్తే
దొంగచాటుగా ఇంట్ల కుండల బియ్యం పోసి
ఇది ఆకలిచావు కాదని ప్రకటించిన
పాలకులను జూసినం
నేడు ఎనిమిదేండ్లలో దేశానికి అన్నపూర్ణగ
నిలిచిన తెలంగాణను జూస్తున్నం.
తెలంగాణ రైతులు పండించిన ధాన్యం
కొనలేమని చేతులెత్తేసిన
కేంద్ర పాలకులను జూస్తున్నం.
పూటగడిసే దిక్కులేక పొట్ట శేతవట్టుకొని
చెట్టుకొకరు, పుట్టకొకరు చెల్లాచెదురైన కాలం
అవ్వ, తాతలను, అమ్మ, నాయినలను
గల్మల కావలివెట్టి ఊరిడిస్తే
సారెకో, చీరకో, సావుకో, పురుడుకో,
పెండ్లికో, పెత్తరమాసకో
బిడ్డలు రాకపోతరా అని ఎదురుచూసినకాలం
నాడు శ్మశాన నిశ్శబ్దం ఏలిన పల్లెలు
నేడు పిల్లాజెల్లలతో,
పాడి, పంటలతో కళకళలాడుతున్నయి.
నాడు సదువుకు మొకంవాసిన పరిస్థితి
నేడు సంక్షేమ పాఠశాలల్లో
అక్షర కిరణాలై మొలకెత్తుతున్నయి
నాడు పింఛన్‌కు మోకరిల్లిన జీవులు నేడు సర్కారు
ఆసరాతో తలెత్తుకొని ఆత్మవిశ్వాసంతో జీవిస్తున్నయి
సాగుకు పుస్తెలమ్మిన జీవితాలకు
రైతుబంధు భరోసా..
సస్తె ఎవ్వరూ మల్లిసూడని బతుకులకు
రైతుబీమా అండ
ఆడబిడ్డ పుడితే వడ్ల గింజలేసి
మా దుఃఖాన్ని దిగమింగుకున్న కాలం
నేడు కల్యాణలక్ష్మితో ఆడబిడ్డకు
అండగా నిలుస్తున్న కాలం
75 ఏండ్ల స్వతంత్ర భారతంలో
ఏ సర్కారు ఇచ్చింది ఈ భరోసా?
ఏ పాలకుడికి వచ్చింది ఈ ఆలోచన?
-సందీప్‌రెడ్డి కొత్తపల్లి 70139 72603