అతడు ధర్మం కోసం
దేశం కోసం అంటూ..
ఎక్కడైనా విద్వేషం విరజిమ్ముతాడు..
విద్వేషం చాటున
జాతి సంపదను
అదానీ, అంబానీలకు
దోచిపెడతాడు
అయినా అతడు దేశభక్తుడే…
లౌకికతత్వం పరిఢవిల్లే నేలపై
జాతీయోద్యమ పరిమళం తెలియనివాడు
దేశభక్త అవతారమెత్తి
విద్వేష బీజాలు వెదజల్లుతూ
విచ్ఛిన్నకారుడై…
విధ్వంసకారుడై..
మతాన్ని విద్వేషంగా మార్చి
రక్తం పారిస్తూ..
శవాల దిబ్బలపై
కరాళ నృత్యం చేస్తున్నాడు.
దేశభక్తుడు దేశద్రోహిగా
దేశద్రోహి దేశభక్తునిగా
చలామణి అవుతున్న కాలం
కత్తుల వంతెనపై నడుస్తున్నది
ఇది
ఫాసిజం,
నిరంకుశత్వం
రాజ్యమేలుతున్న కాలం
న్యాయస్థానం గతి తప్పి
వివక్ష చూపుతూ..
రాజ్యాంగాన్ని పాతరేస్తున్న కాలం..
అతడు
ప్రశ్నను చిదిమేస్తూ
చంపుతూ
బంధిస్తూ..
కాలనాగులా బుసకొడుతూ
కుప్పిగంతులు వేస్తున్నాడు
ఔను ప్రశ్నే చరిత్ర..
ప్రశ్నే జ్ఞానం
ఎద లోతుల్లోంచి
పొంగివచ్చిన ప్రశ్న
బండబారిన
ఈ సమాజపు అంధకారాన్ని చీల్చాలి.
మండే గుండెల సంకేతమై,
కోట్లాది పిడికిళ్ల ఆయుధమై..
రేపటి ఉదయం కోసం
చరిత్ర విసిరిన సవాలును స్వీకరించి,
నవ చరిత్రను లిఖించాలి.
-షేక్ కరీముల్లా
97054 50705