దివారాత్రులందు భేదం లేని చీకటి
ఏకాంతంలోను సమూహంలోను
వెల్లువెత్తి ముంచుతోంది
మాటలై రాలుతూ కన్నీరై తొణుకుతూ
పండు వెన్నెల వీధులలోను
అడుగు పడనీయక
పాదాలనల్లుకునే ఉండేది
లోలోపటంతా చీకటి
సూర్యచంద్రులకు సాధ్యం కాని చోట
నీటి దీపాలు చమురు దీపాల మాటే లేదు
ద ఈస్ట్ కేఫ్ వద్ద మునివేళ్లపై
నిలబడి మరీ ఎదురుచూశాను
అంతా భ్రమ
ఉదయాలన్నీ ఛాయలకు మూలాలే
మదిసంద్రపు లోతుల్లో
జెల్లీఫిష్లతో చెలిమి ద్వారాలు తెరిచి చూశాను
కీకారణ్యపు మేధోమథనంలో
మిణుగురులను సైతం చెదరనివ్వకూడదని
ఎన్నాళ్లుగానో ప్రయత్నించాను
ఇప్పుడు కదూ నేను
విరిసిన వెలుగు తామరను
నిన్ను నాలో నిలుపుకొన్నాక పుటలు పుటలుగా..
– డాక్టర్ కాచాపురం దుర్గాదేవి