ఒక మెరుపు విచ్చుకొని
అమితంగా ప్రకాశించాలంటే
ఎన్నో రాపిడిలు జరిగి తీరాలి
ఒక గెలుపు వెనుక విజయం
మొలకెత్తి పుష్పించాలంటే
ఇంకెన్నో చేయూతలు కలగలిసి
జెండాలకు కర్రలై నిలబడాలి
ఒక మలుపునకు విరుపు లేకుండా
సజావుగా సాగిపోవాలంటే
మార్గాన్వేషణలో సమానత
మైలురాయిగా నిలబడాలి
విజయోత్సవ వేడుకలంటే
కష్టాలకు నష్టాలకు నడుమ
ఒక సహనం ఒక ఓదార్పు కలిసి
సమాజాన్ని శుద్ధిచేస్తూ కదలాలి
ఎన్నో అవకతవకలు ఎదురొచ్చినా
ఎదుర్కొనే స్వభావానికి ఊతమిచ్చి
నిర్భయంగా అడుగులు కదపాలి
విజయం వెనుక మరెన్నో ముళ్ళను
ఇంకెన్నో ఒడిదుడుకులను
భుజాలపై మోస్తూనే ముందుకు
అవలీలగా సాగిపోవాలి
విజయోత్సవ ఉత్సాహల మధ్య
గెలుపునకు పట్టాభిషేకం చేయాలి
ఆనందోత్సాహాల వెలుగులో
పాలన పటిష్టతకు ఆజ్యం పోస్తూనే
సమసమాజ నిర్మాతగా
అలుపెరుగని పోరాటం సలపాలి
విజయ సోపానం అధిరోహణలో
మునుముందుకు సాగిపోవాలి..
-నరెద్దుల రాజారెడ్డి
96660 16636