ఇన్నాళ్లూ పరుగుల్ని
లంఘించుకొన్న జీవనం
పాత పాటపై ఊరేగింది
ఆశించిన స్వప్నం
ఆఘ మేఘమై కరిగి
కన్నీటి పర్యంతమైంది
చూపులన్నీ
ఎదురుబాటపై నిలిచాయి
కళ్లముందు ముల్లులు తప్ప
కలలు ఎదురుపడటం లేదు
ఊరించిన మనసు నదికి
కన్నీరు తప్ప కరిమబ్బులు వాలలేదు
నిత్యం ఘర్షణ, సంఘర్షణలే
ఇంకా ఎవరి నోటి నుంచో
ఉచిత వాగ్దానపు వర్షం కురుస్తూనే ఉన్నది
బతుకుకు అంటిన ఆకలి మరకలు
సమసిపోయి ఇక సొమ్మసిల్లి పడిపోయే జీవనానికి
చరమగీతం పాడేందుకు
కళ్ళపై కలలు కొన్ని ఆరాటపడి భంగపడ్డాయి
ఇప్పుడు మళ్లీ
కొత్తగా వింత రచనలు సాగుతున్నాయి
ఎర వేసి ఎర్రి జనాల్ని పట్టుకొని
కొత్త పాటని కోరస్గా మలచి
మందు, మార్బలంతో చిత్తుచేసి
ఐదేండ్లు రాజకీయ కుర్చీని అలంకరించే
ధ్వంస రచనలు సాగుతూనే ఉన్నాయి..!
మహబూబ్ బాషా చిల్లెం
95020 00415