ఏం రాస్తున్నాం? ఎందుకు రాస్తున్నాం? అనే ప్రశ్నలు కవులు, రచయితలు వేసుకొని.. ఏది రాసినా స్పృహతో రాయాలి. సాహిత్య సృజన (రచన) ఒక సామాజిక బాధ్యత. అది గుర్తెరిగి చేసిన రచనలే నిలుస్తాయి. ఈ అర్థంలో తెలుగునేలపై గతంలో వచ్చిన సాహిత్యం తన ప్రయోజనాన్ని నెరవేర్చుకున్నది. మారిన కాలమాన పరిస్థితుల్లో అవసరమైన రీతిలో స్పందించటం సామాజిక అవసరం. ఇది గుర్తెరిగినప్పుడే.. సాహితీ సృజన ఓ నదీ ప్రవాహంగా, నిత్య నూతనంగా విరాజిల్లుతుంది.
ఆత్మకథకు, జీవిత చరిత్రకు కొంత వ్యత్యాసం ఉన్నది. ఆత్మకథ రాసుకోవడానికి జీవించి ఉండాలి. మరణం ప్రసక్తి అనేది అందులో ఉండదు, రాసుకోలేరు. తనకుతానై తన మరణాన్ని గురించి రాసుకోలేకున్నా, సందర్భాలను, ఉద్దేశాలను, కోరికలను రాసుకోవచ్చు. ఇవి సహజ సిద్ధంగా ఉంటే చదువడానికి ఇష్టపడతారు.
ఆత్మకథ’లో తమ జీవితంలోని ఎత్తు పల్లాలను, మంచిచెడులను నిజాయితీగా చూపాలి. వాస్తవాలను రాసేప్పుడు న్యాయం పక్షాన కలం నిలబడాలి, కులం పక్కన కాదు. జీవితానికి ఒక లక్ష్యమనేది ఎంత అవసరమో పాఠకులకు తెలిసేలా ఉండాలి. సమాజంలో ఎన్నో దౌర్భల్యాలు, అన్యాయాలున్నాయి. వీటన్నింటినీ ఏ ఒక్కరూ చేయరు. అందుకే రుద్దేయకూడదు. పూర్వాపరాలు ఆలోచించే అవకాశం పాఠకులకు ఇవ్వాలి.
తీయోద్యమ కాలం నుంచీ సామాజిక సంఘర్షణ, ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలిస్తూ తెలుగులో విస్తృత సాహిత్యం వచ్చింది. రైతాంగ పోరాటాల నేపథ్యంగా విప్లవ, స్త్రీ, దళితవాద సాహిత్యాలు ముందుకువచ్చాయి. ఎక్కడ అస్తిత్వ చిహ్నాలు కనబడలేదో అక్కడ ఉద్యమాల్లో తమ గొంతును వినిపించాయి. ఆ క్రమంలోనే రాష్ట్ర సాధనోద్యమంలో తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వ సాహిత్యం ఓ కెరటంలా పోటెత్తింది.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిర్వహించిన ‘ప్రపంచ తెలుగు మహాసభలు’ కొంత కొత్త ఉత్తేజాన్నిచ్చాయి. తర్వాతి కాలంలో ఏదో స్తబ్ధత ఏర్పడింది. దాన్ని ఛేదించాలంటే తీవ్రంగానే కృషి చేయాలి. ఈ కోణంలోనే జీవిత చరిత్ర, స్వీయ చరిత్ర అనే ప్రక్రియలపై సృజనకారులు దృష్టిపెట్టారు. ఇది మంచి పరిణామం. మనం చెప్పుకోకపోవడం వల్లనే తెలంగాణ సామాజిక, సాంస్కృతిక జీవన చిత్రం ఎక్కడా సంపూర్ణంగా నమోదు కాలేదు. కారణాలనేకం. రాసే అలవాటు తక్కువ, రాసుకుంటే ముద్రణ భారం ఎక్కువ! ఈ రెంటి మధ్య ఊగిసలాడింది స్వీయ చరిత్ర.
ఎవరిది వాళ్లు వాళ్లగురించి రాసే ప్రక్రియనే ‘స్వీయచరిత్ర’ లేదా ‘ఆత్మకథ’ అని అంటాం. తమ జీవితానుభవాలు లోకానికి తెలిస్తే కొంతైనా మేలు జరుగుతుందనిపించే వ్యక్తుల జీవిత చరిత్రలు సమాజానికి దిక్సూచిగా ఉంటాయి. సామాజిక, సాంస్కృతిక, చారిత్రక, విద్య, వైజ్ఞానికరంగాల్లో ప్రముఖ వ్యక్తులను తీసుకొని వారి జీవితాలను రాసిన జీవితం, చరిత్రలు మనకు చాలానే ఉన్నవి. ఒక వ్యక్తి జీవితాన్ని సంగ్రహంగా రచించే రచనను ‘జీవిత చరిత్ర’ అంటాం. ఇవేం కాల్పనిక రచనలు కావు. యదార్థ రచనలు.
రచయిత రాసేప్పుడు కాల్పనిక పద్ధతిని కూడా అనుసరిస్తూ రాయవచ్చు. ఆ వ్యక్తి పుట్టుక, బాల్యం, విద్య, ఉద్యోగం వంటి విషయాలతో పాటు ఏ రంగంలో ఆ వ్యక్తి నిష్ణాతులో ఆ సమాచారాన్ని వివరంగా రాసే జీవిత చరిత్రలు చాలా ప్రముఖమైనవి. ఆ వ్యక్తిని అడిగి తెలుసుకొని రాయడం ఒక పద్ధతి. వారు జీవించి లేకుంటే వారి కుటుంబీకులు, స్నేహితులు, దగ్గరివాళ్లను అడిగి తెలుసుకొని, వాళ్లు ప్రతిభ సాధించిన వివరాలు సాహిత్యరూపంలో ఉన్నదో, పత్రికల్లో వచ్చిన సమాచారంతోనో సమగ్రంగా రాసే జీవిత చరిత్ర పాఠకుల్లో బలీయమైన ప్రభావాన్ని కలిగించేలా ఉండాలి.
ఆత్మకథకు, జీవిత చరిత్రకు కొంత వ్యత్యాసం ఉన్నది. ఆత్మకథ రాసుకోవడా నికి జీవించి ఉండాలి. మరణం ప్రసక్తి అనేది అందులో ఉండదు, రాసుకోలేరు. తనకుతానై తన మరణాన్ని గురించి రాసుకోలేకున్నా, సందర్భాలను, ఉద్దేశాలను, కోరికలను రాసుకోవచ్చు. ఇవి తప్పకుండా కొన్ని జీవితాలకు సంబంధించినట్లో, ఆ జీవితాల కు దగ్గరగా ఉన్నట్లో రాస్తే సహజ సిద్ధంగా ఉండి చదువడానికి ఇష్టపడతారు పాఠకులు. మంచి శీర్షికలను పెడుతూ, రూపురేఖలను రూపొందించుకుంటూ ఆత్మాశ్రయంగా సాగే ఆత్మకథ ప్రక్రియ సాహిత్యరంగంలో ప్రముఖ ప్రక్రియగా పేరుపొందింది. జీవిత చరిత్రలు కూడా అంతే. ఇవి ఎన్నో వచ్చాయి. ఛత్రపతి శివాజీ, స్వామి వివేకానంద, నేతాజీ, అంబేద్కర్ వంటి ఎందరో ప్రముఖుల జీవిత చరిత్రలు… సాహితీవేత్తలు, కళాకారులు, రాజకీయవేత్తలు వంటి అన్నిరంగాల్లోని గొప్పవాళ్ల జీవిత చరిత్రలు మనకు దొరుకుతున్నాయి.
ఆత్మకథలో రాని విషయాలు జీవిత చరిత్రలో వస్తాయి. వారు రాసుకోలేని స్వమరణ స్థితిని ఆ వ్యక్తి జీవితం తర్వాత పుస్తకంగా బయటికి వచ్చేటప్పుడు రాయాల్సి ఉంటుంది. కొన్ని మంచివి స్వీకరించి, వారు సోత్కర్ష అని భావించి వదిలేసిన విషయాలను వివరి స్తూ సత్యసంధతతో రాయాలి. గతంలో ఎక్కడా చదవని ఒద్దిరాజు సోదరుల జీవిత చరిత్ర ఇప్పుడు వచ్చింది. సురవరం ప్రతాపరెడ్డి, దాశరథి, సదాలక్ష్మి, సరోజినీనాయుడు వంటి గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు ఆదర్శనీయాలు. స్వీయచరిత్రలు అని పిలిచే ఆత్మకథలు మనకు ఎన్నో ఉన్నాయి. గాంధీజీ ‘సత్యశోధన’, అబ్దుల్ కలాం ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ జీవితానికి ఒక లక్ష్యమనేది ఎంత ముఖ్యమో తెలిపేవి. విశ్వనాథ సత్యనారాయణ ఆత్మకథ, శ్రీశ్రీ ‘అనంతం’, చలం ‘ఆత్మకథ’, తిరుమల రామచంద్ర ‘హంపీ నుంచి హరప్పా దాక’ వంటివెన్నో దేనికదే ప్రత్యేకత కలిగినవి.
భారత జీవనశైలి, సరళి అనేది చాలా విశిష్టమైన, ప్రత్యేకమైనదని ప్రపంచమంతా ఎలుగెత్తి చెప్తున్నది. యోగానంద రాసుకున్న స్వీయచరిత్ర ‘ఒక యోగి ఆత్మకథ’ లోని విషయ విస్తృతి ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆత్మకథలో ‘ఆత్మ’, ‘కథ’ అనే రెండు పదాలున్నవి. ‘ఆత్మ’ అంటే ఒక శాశ్వతమైన భావన అనే అర్థంతో తీసుకోవాల్సింది.
దేన్ని ఆశించి రాస్తున్నాం ఆత్మకథ అని అంతర్మథనం చేసుకొని రాయాలి. కొందరు రాజకీయ నాయకులు ఆత్మకథలు రాసుకున్నారు. రావి నారాయణరెడ్డి ‘పోరాట చరిత్ర’ రాసుకున్నారు. పెండ్యాల రాఘవరావు ‘నా ప్రజా జీవితం’ అనేది రాశారు.
‘50 సంవత్సరాల హైదరాబాద్’ అని మందుముల నరసింగరావు రాస్తే, ‘50 సంవత్సరాల జ్ఞాపకాలు’ అని దేవులపల్లి రామానుజరావు రాశారు. ఆత్మకథలైనా, జీవిత చరిత్రలైనా ఆ కాలంనాటి పాలనావ్యవస్థను సగటు జీవి వెతలను విధిగా రాయాలి. ‘హైదరాబాద్ ఆత్మకథ’ భాస్కరభట్ల కృష్ణారావు రాసినది ఉన్నది.
వట్టికోట ఆళ్వారుస్వామి ‘జైలు కథలు’, నెల్లూరు కేశవదాసు ‘చార్మినార్ కథలు’, గ్రామీణ స్త్రీల జీవితాన్ని ప్రతిబింబించిన జాజుల గౌరి ‘మన్నుబువ్వ’, బేబీ కాంబ్లె ‘మా బతుకులు’ దళిత స్త్రీల ఆత్మకథలు, ‘నేను మలాలాను’ మొదలైనవి కొత్త గొంతుకను వినిపించాయి. ఇవన్నీ తమదైన అస్తిత్వాన్ని ప్రకటించుకున్న రచనలు, సామూహిక ఆత్మకథలు, సంఘం ఆత్మకథలు, జాతి ఆత్మకథలు.
ప్రాచీన కథనాలకు, ప్రాచీన చరిత్రకు-ప్రస్తుత సమాజానికి మధ్య ఘర్షణలో అందరూ బాధితులే. ఆ నేప థ్యాన్ని చెప్పేటప్పుడు త్రాసును పట్టుకున్న రచయిత సత్యనిష్ఠకే ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే భావి సమాజం వ్యత్యాసాల్లేని మంచి సమాజంగా తయారవుతుంది. ‘మై కౌన్ హూ’ రచయిత్రి జిలానీ బాను ఉర్దూలో రాసిన ఆత్మకథ సమతాభావాన్ని స్పష్టంగా తెలిపింది. ముదిగంటి సుజాతారెడ్డి ‘ముసురు’ తెలంగాణ విమోచన ఉద్యమ సంఘర్షణలతో కూడిన ఆత్మకథ. కొండపల్లి కోటేశ్వరమ్మ ‘నిర్జన వారధి’ గొప్ప రచన. వీరిది వందేండ్ల విలువల వంతెన అంటారు వరవరరావు.
‘తెలంగాణమున గడ్డిపోచయును సంధించెను కృపాణమ్ము’ అని చెప్పిన దాశరథి కృష్ణమాచార్యుల వాగ్బాణాన్ని గుర్తుచేసుకుంటూ మహావృక్షాలే కాదు గడ్డిపోచలనూ తక్కువ చేయకూడదన్న సోయి తెచ్చుకోవాలి. కాళోజీ ‘నా గొడవ’లో లోకపు పోకడల్లో కనిపించని అన్యాయాలను, కనిపించే అధిక ప్రేలాపనలను ఎట్లా అనుసంధించారో అర్థం చేసుకోవాలి. సామల సదాశివ ‘యాది’, గడియారం రామకృష్ణ శర్మ ‘శతపత్రము’, దాశరథి రంగాచార్య ‘జీవనయానం’, జి.వెంకటస్వామి ‘మేరా సఫర్’ వంటి ఆత్మకథలు మన ముందున్నాయి.
కళారంగంలో చూస్తే చాలా తక్కువ మంది జీవిత చరిత్రలున్నవి. చిందు ఎల్లమ్మ భాగవత కళాకారిణి. ఆమె జీవితం మొత్తం కళకే అం కితం. చిత్రకళారంగంలో కొండపల్లి శేషగిరిరావు జీవితచరిత్ర ఆయన గీసిన బొమ్మలతో వచ్చింది. చిత్రకారుడు, విమర్శకుడైన సంజీవ్ దేవ్ స్వీయచరిత్ర ‘తెగిన జ్ఞాపకాలు’ వచ్చింది.
తెలంగాణ ఆత్మకథగా దేవులపల్లి కృష్ణమూర్తి ‘ఊరు వాడ’ బతుకు రాశారు. జర్నలిజం దృక్కోణంలో తుర్లపాటి కుటుంబరావు ‘నా కలం నా గళం’ అనే ఆత్మకథను రాశారు. ‘పాలేరు నుంచి పద్మశ్రీ’ వరకు అని బోయి భీమన్న రాస్తే , ‘నా కథ’ అని గుర్రం జాషువా పద్యరూపంలో రాశారు. దాశరథి ‘యాత్రాస్మృతి’ జీవితాల్ని ప్రతిబింబించింది.
జీవిత చరిత్రలో పరాశ్రయం ఉన్నా, స్వీయచరిత్రలో ఆత్మాశ్రయం ఉన్నా… ఈ రెంటి మధ్య అవినాభావ సంబంధం ఉన్నది. స్వచ్ఛతకూ సహజత్వానికి విలువనిస్తూ వ్యక్తి జీవితాలు నలుగురికి ఉపయోగపడేలా రాయాలి. అయితే, ఇవి ఏవి ఎవరు రాసినా వాటి ని ముద్రణ రూపంలోకి తీసుకొచ్చి ఏకత్ర సంయోజనం చేసేందుకు, అంటే ఇంతటి ఆలోచనలకు తగిన చోటు కలిపించేలా విశ్వవిద్యాలయాలు, సాహిత్యసంస్థలు, అకాడమీలూ ముందుకు రావాలి. అప్పు డే ఆధునిక భారతదేశం ప్రపంచ సాహిత్య, మానవ వికాస ఆకాశంలో కీర్తి పతాకం ఎగరేస్తుంది.
– డాక్టర్ కొండపల్లి నీహారిణి
98663 60082