మనసు తోటలో పూలుగా పూచాం
అక్షరాల బాటలో మైత్రిని పెంచాం
మనలో ఉన్నది
గొప్ప స్నేహమని తలచాం
నిస్వార్థ సీమలో సృజన నింపాం
పొగడ్తకు పొంగకా కుంగకా నిలిచాం
ఏ కన్ను కుట్టిందో ఏమో గాని
కొలిమి అగడ్తలో కాలింది కలం
ఆపైన మనసు కరుకైంది
తెలియని అహం వచ్చింది పైగా
పూలతో కలిసిన స్నేహాల తోటకు
బహుశా ఇది వింత అనుభవమే
మనసు పొరనే కమ్మింది కీర్తిదాహం
ఆర్తిగీతం ఇంటి కన్నీరై పొగిలింది
ఏ భాషలో చెప్పినా బాధ బాధేగా
అమ్మ భాషలో నిజం చెప్పినా వృథా
తోటలో పూలు వాడి రాలెను గాలికి
కురిసిన వెన్నెల వాన ఎడారి పాలేలే
చెట్టు పక్షులు రోదిస్తూ వలస పాయే
మానవతే లేని మనిషి మాట తెలిసి
-డాక్టర్ టి.రాధాకృష్ణమాచార్యులు
98493 05871