తెలంగాణ ప్రాంతంలో సపాద లక్షదేశాన్ని పాలించిన రాజవంశీయులు వేములవాడ చాళుక్యులు. వీరు రాష్ట్రకూటులకు సామంతులుగా బోధన్, గంగాధర, వేములవాడ పట్టణాలను రాజధానులుగా చేసుకొని పాలించారు. వీరి మూల పురుషుడు సత్యాశ్రయ రణవిక్రముడు. ఈ వంశంలో చాలా ప్రసిద్ధి చెందినవాడు రెండవ అరికేసరి.
సుమారు 225 ఏండ్లు పాలించిన చాళుక్యులు జైన, శైవ మతాలను సమానంగా ఆదరించారు. తెలుగు, కన్నడ భాషలు ముఖ్యంగా వీరికాలం కన్నడ భాషకు స్వర్ణయుగం. వేములవాడలో రెండవ అరికేసరి పాలనా కాలంలో వేయించిన శాసనం వేములవాడ చాళుక్యుల వంశక్రమాన్ని వారు సాధించిన విజయాలను వివరిస్తుంది. శాసనం మొత్తం నాలుగు వైపులా 109 పంక్తులలో సంస్కృతంలో ఉన్నది.
శాసన ప్రారంభం వినయాదిత్య యుద్ధమల్లుని ప్రస్తావనతో ప్రారంభమవుతుంది. ఇతడు పోదన (బోధన్) రాజధానిగా సపాద లక్షదేశాన్ని పాలిస్తున్నట్లు, ఇతని రాజ్యంలోని ఏనుగులు నూనెతో కూడిన బావులందు స్నానం చేసేవట. ఇతడు చిత్రకూట దుర్గాన్ని జయించి, శత్రువులను ఓడించినట్లు వర్ణించబడినాడు. ఇతని తనయుడు మొదటి అరికేసరి. రాష్ట్రకూట ధ్రువరాజు సామంతునిగా ఉన్న ఇతడు వేంగిదేశంపై దండెత్తి నాలుగవ విష్ణువర్ధనరాజును ఓడించాడు. ఇతని కొడుకు మొదటి నరసింహ వర్మ. ఇతని కొడుకు రెండవ యుద్ధమల్లుడు.యుద్ధమల్లుని కొడుకు బద్దెగుడు, అతని కుమారుడు మూడవ యుద్ధమల్లుడు. ఇతని కొడుకు రెండవ నరసింహవర్మ. ఇతడు లాటదేశపు రాజును, ఏడుగురు మాళవరాజులను ఓడించి వారివద్ద నుంచి కప్పం వసూలు చేశాడు. గూర్జర రాజైన మహీపాలుడిని, గంగాతీరం వరకు సైన్యం నడిపించి చాలామందిరాజులను ఓడించాడు. కాళప్రియం లో తన కత్తిని కడిగి, విజయ శాసనాన్ని వేయించాడు.
ప్రస్తుత శాసనం వేయించిన రెండవ అరికేసరి ఈ రెండో నృసింహవర్మ కుమారుడు. ఇతడు రాష్ట్రకూట మూడవ ఇంద్రవల్లభుని మేనల్లుడు. అతని కుమార్తె రేవక నిర్మాడిని పెండ్లి చేసుకున్నాడు. రాష్ట్రకూట గోవిందరాజు బారినుంచి బిజ్జని కాపాడి, సేనాని అయిన పన్నయార్యుడిని, అతని అనుచరులను చంపివేశాడు. ఇతనికి పంబరాంకుశ, అమ్మన గంధవారణ, గందేభ విద్యాధర, ఆరూఢ సర్వజ్ఞ గుణనిధి, గుణార్ణవ, త్రిభువనమల్ల వంటి అనేక బిరుదులున్నాయి.
ఈ రెండవ అరికేసరి తన తంత్రపాలుడైన పెద్దనార్యు ని కోరిక మీద భక్తులకు అన్నదానం నిర్వహించే సత్రానికి వేములవాడలో ఈశాన్యదిక్కులో ఉన్న వంద నివర్తనాల విస్తారమైన భూమిని, 8 నివర్తనాల నీరు నేలను దానమిచ్చాడు. ఈ దాన సమర్పణ సమయంలో రాజేశ్వర, ఆదిత్య, బద్ద్దెగేశ్వర, నగరేశ్వరాలయాల స్థానాపతులైన మల్లికార్జున వ్యక్తలింగి, విద్యారాసి వాఖ్యాని, భట్టారకుడు, చంద్రశ్రేష్ఠి తదితరులు సాక్షులుగా ఉన్నారు. దానం చేసిన ఈ క్షేత్రం సిద్ధాయం 12 ద్రమ్మలుగా నిర్ణయించబడింది (నిష్కంలో 16వ వంతు ద్రమ్మము). వేములవాడ చాళుక్యులకు సంబంధించిన అతి ముఖ్యమైన ఆధారాల్లో ఈ శాసనం ఒకటి.
– భిన్నూరి మనోహరి