దూడం నాంపల్లి లలిత కళల్లో కవిత్వానికి ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. కాలక్షేపానికి కవిత్వం రాసేవారు కొందరుంటే, జీవితాన్ని కవిత్వీకరించేవారు కొందరుంటారు. కష్టాలు, కన్నీళ్లను అక్షరాలుగా రాల్చి రాశిపోసేవారు కొందరైతే, బతుకు చిత్రాలను కవితా చిత్రాలుగా తీర్చిదిద్దేవారు మరికొందరు. అలాంటి కోవకు చెందిన అసలు సిసలైన విద్వత్కవి దూడం నాంపల్లి.
దూడం నాంపల్లి 1944 మే 20న నరసయ్య, లక్ష్మీ దంపతులకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా (ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా) ఇల్లంతకుంట సమీపంలోని పుత్తూరులో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీఓఎల్ పట్టా పొంది తెలుగు భాషోపాధ్యాయునిగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. చిన్నప్పటి నుంచి కవిత్వం పట్ల మిక్కిలి ఆసక్తి ఉన్న నాంపల్లి తెలుగు కావ్యాలు, వ్యాకరణ, అలంకార శాస్ర్తాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. తెలుగులోనే కాదు..సంస్కృతం, ఉర్దూ, ఆంగ్ల భాషల్లో కూడా చక్కని పాండిత్యం సంపాదించారు.
దూడం నాంపల్లికి హరికథలంటే చాలా ఇష్టం. హరికథలను రాసి స్వయంగా ఆయనే గానం చేసేవారు. ఆయన హరికథాగానం చేస్తుంటే సభాసదులంతా మురిసిపోయేవారు. పద్యాలు, పాటలు, గేయాలు, వచన కవితలు, నాటికలు, నాటకాలు, హరికథలు, కథలు, కథానికలు, గల్పికలు, చిరుతల నాటకాలు రాశారు.
ఆయన రాసిన కవితలు, హరికథలు ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి. ఆయనది అద్భుతమైన కంఠస్వరం. సభా వేదికపై ప్రసంగం చేసినా, కవితా గానం చేసినా, తరగతి గదిలో పాఠాలు చెప్పినా అందరినీ ఇట్టే ఆకర్షించేవారు. కావ్యగానం చేయడంలో ప్రత్యేకమైన శైలి. పండితుల్ని మెప్పించే విధంగా అత్యంత ప్రౌఢమైన పద్యాలను రాయగలరు. సామాన్యునికి సైతం అర్థమయ్యేలా అందమైన గేయాలూ రాయగలరు. అచ్చమైన తెలంగాణ యాసలో పండిత పామర జనరంజకమైన పాటల్ని మెరిపించగలరు. మచ్చుకు….
‘గౌను లేక మంకు పోరి గాయి గాయి జేసెరా
పోరడేమో లాగు లేక పొరు దండాల్ దీసెరా
ఏది చీరె గాజులని ఇంటిది శివమెత్తెరా
అన్న! వాయిదెల్లిందని అప్పులోడు మొత్తెరా’
జీమూత వాహనుడు, శకుంతల, పాండవ జననం, పంచామృతం, ద్వయీనాదం, పాటల పల్లకి, సాహితీ సమదర్శనం, భూమిక, మా ఊరు బడి, కవన కలశం, పరశురామప్రీతి, స్వర్ణముఖి, ప్రతాపసేన విజయం, ఉత్తరాయణం, కవితా కాదంబరి మొదలైన పుస్తకాలు 25కు పైగా రాశారు.
‘కుట్టులేని చొక్కాలు కూర్చి మంత్రికిచ్చినా అగ్గిపెట్టెలో చీరే అమరినట్టు నేసినా గురుతింపే రాదాయే ఉపాధియే లేదాయె బుగ్గి అయ్యే నీ ప్రతిభ బువ్వకు కరువాయెరా’ అంటూ చేనేత కార్మికుని ప్రతిభా నైపుణ్యాలను చెప్పడమే కాకుండా ఆ కార్మికుడు పడే కష్టాలు, కన్నీళ్లు, గడిపే దుర్భరమైన జీవితాన్ని కండ్లకు కట్టినట్లు ఆవిష్కరించారు నాంపల్లి. మాడుగుల నాగఫణిశర్మ, మేడసాని మోహన్, గరికపాటి నరసింహారావు, పార్వెళ్ళ గోపాలకృష్ణ, అష్టకాల నరసింహ రామశర్మ, రాళ్లబండి కవితా ప్రసాద్, తిగుళ్ల శ్రీహరిశర్మ, అందె వేంకటరాజం వంటి మహానుభావులు నిర్వహించిన అవధానాల్లో పృచ్ఛకునిగా పాల్గొని తన ప్రతిభను నిరూపించుకున్నారు నాంపల్లి.
‘లంచమ్మనునది ఇప్పుడు
లాంఛనమైపోయె నవుర లంపటులిందున్
లంచిని మరచిన మరతురు
లంచమ్మును మరువరేమి లాయఖో శిష్యా!‘
లంచం గురించి తన శిష్య ద్విశతి పుస్తకంలో రాసిన అద్భుతమైన ఈ పద్యం పలువురు కవి, పండితుల ప్రశంసలను అందుకున్నది. ప్రముఖ కవి, అష్టావధాని డాక్టర్ అందె వేంకటరాజం కోరుట్లలో స్థాపించిన భారతీ సాహిత్య సమితితో నాంపల్లి అత్యంత సన్నిహిత సంబంధం కలిగి ఉన్నారు.
తెలుగు విశ్వవిద్యాలయం నుంచి హరికథా సాహిత్య పురస్కారం, జాతీయ సాహిత్య పరిషత్ స్వర్ణ సాహితీ పురస్కారం, యువ ఉగాది సాహిత్య పురస్కారం, సినారె విశిష్ట సాహితీ పురస్కారం, వేములవాడ రాజరాజేశ్వరస్వామి కవి పండిత పురస్కారం, సాహితీ గౌతమి ఉగాది పురస్కారం, గ్రామీణ కళాజ్యోతి పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం గేయ కవితా పురస్కారం, శాతవాహన కళోత్సవాల పురస్కారం వంటి పురస్కారాలు, బిరుదులు, వివిధ సాహితీ సంస్థల నుంచి అనేక గౌరవ సత్కారాలు అందుకున్న దూడం నాంపల్లి 2013 సెప్టెంబర్ 5న పరమపదించారు.
తెలంగాణ సాహితీమూర్తులు
-తిరునగరి శ్రీనివాసస్వామి
9440369939