దేవులపల్లి రామానుజరావు ఓ విలక్షణ సాహితీ స్రష్ట. అనేక ఉన్నత పదవులను అలంకరించినా భేషజాలు లేని నిరాడంబర వ్యక్తిత్వం. సారస్వత పరిషత్తును శ్వాసగా చేసుకొని జీవించిన సారస్వత మూర్తి. రామానుజరావు అనేక పుస్తకాలు రాశారు. వాటిలో ‘పచ్చ తోరణం’, ‘నవనీతము’, ‘నా సాహిత్యోపన్యాసాలు’, ‘ఉపన్యాస తోరణం’ పేరెన్నిక గన్నవి. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన రామానుజరావు మంచి వక్త గూడా.1979, 80, 81 సంవత్సరాలలో కొన్ని సాహిత్య సభల్లోనూ, ఆకాశవాణిలోనూ వివిధ సంస్థల తరఫున బొంబాయి, నెల్లూరు, విశాఖపట్టణం, కరీంనగర్, హైదరాబాద్ మున్నగు పట్టణాలలో వారు చేసిన ప్రసంగాల సమాహారమే ‘ఉపన్యాస తోరణం’ అనే పుస్తకం. ఈ పుస్తకంలో ‘భారత స్వాతంత్య్రానికి పూర్వం తెలుగులో పత్రికా రచన, ‘స్వర్గీయ చలం’, ‘నేను గుర్తించిన తిక్కన’, ‘నేను దర్శించిన పోతన’, ‘తెలుగులో తొలి సమాజ కవులు’, ‘అఖిల భారత తెలుగు రచయితల (ఏడవ) మహాసభలు’, ‘తెలుగులో వెలువడిన స్వీయ చరిత్రలు’, ‘ఆంధ్రప్రదేశ్‌లో స్వాతంత్య్రోద్యమము-కొన్ని జ్ఞాపకాలు’ అనే ప్రసంగ పాఠాలు పొందుపరచబడి ఉన్నాయి.
తెలుగు ప్రజల సామాజిక, సాంస్కృతిక, రాజకీయ జీవితాన్ని ప్రభావితం చేసిన తెలుగు పత్రికలకు, పత్రికా రచనకు వందేండ్ల పైబడిన చరిత్ర ఉంది. సమాజ, దేశ పురోగతిలో అవి నిర్వహించిన పాత్ర అనిర్వచనీయం.
స్వాతంత్య్రానికి పూర్వం తెలుగులో పత్రికా రచన గూర్చి బొంబాయిలో స్వర్గీయ దేశోద్ధారక, కళాప్రపూర్ణ కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు స్మారక సభలో ‘తెలుగు పత్రికా రచన- దాని వికాసము’ అనే అంశంపై మాట్లాడుతూ, తెలుగుదేశాన్ని మేలుకొల్పిన మహనీయులలో వీరేశలింగం ప్రక్కన నిలిచే వ్యక్తి నాగేశ్వరరావు అంటారు రామానుజరావు. సంపాదించినదంతా ప్రజోపయోగ కార్యక్రమాలకు వెచ్చించి, గాంధీ చేత ‘విశ్వదాత’ అని పేరొందినవాడు. తెలుగు భాషా సంస్కృతులకు ఆ రోజులలో వెన్నెముకగా ఉండి, భాషా సేవ చేసిన మహనీయుడు.
అయితే, దేశంలోని అన్ని భాషల్లో వలె తెలుగులో కూడా పత్రికలను స్థాపించి నిర్వహించిన ఘనత క్రైస్తవ మిషనరీలదేనంటారు రామానుజరావు. అందుకేనేమో తెలుగులో అచ్చయిన మొట్టమొదటి పుస్తకం ‘బైబిల్’. అయితే పత్రికల ద్వారా ఉత్తేజితులై ప్రజలలో జాతీయ భావాలు, స్వాతంత్య్ర కాంక్షలూ వ్యాప్తి చెందుతాయన్న భయంతో వలస ప్రభుత్వం పత్రికలను నిరుత్సాహపరిచి నీరుగార్చిందంటారు రామానుజరావు.
1902లో క్రిష్ణా డిస్ట్రిక్ట్ అసోసియేషన్ పక్షాన మచిలీపట్నంలో ప్రారంభమైన ‘కృష్ణా’ పత్రికతో తెలుగు పత్రికారంగంలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన నూతన అధ్యాయం ప్రారంభమైంది. దాసు నారాయణరావు అనే మిత్రునితో కలిసి న్యాయవాది అయిన దేశభక్త కొండా వెంకటప్పయ్య ఈ పత్రిక సంపాదకులు. ఈ పత్రిక వందేమాతరం ఉద్యమాన్ని బలపర్చడమే కాకుండా, రైతుల హక్కుల కోసం పోరాడటం, ప్రభుత్వ అవినీతిని ఎండగట్టడం వంటి చర్యలతో ప్రజాభిమానం చూరగొన్నది. తదనంతరం గొప్ప విద్వాంసుడు, సాహిత్య విమర్శకుడు కళోపాసకుడు అయిన ముట్నూరు కృష్ణారావు సంపాదకత్వంలో ఈ పత్రిక వెలువరించిన స్వాతంత్య్ర భావాలు ప్రజలను ఉత్తేజపరిచినవంటారు.
ఎందరో దేశ నాయకులను సృజిస్తూ వెలువడిన ఈ పత్రిక అనతికాలంలోనే యువకులకు, రచయితలకు, కళోపాసకులకు నూతనోత్సాహాన్నిచ్చింది. ఇకపోతే, నిజాం నిరంకుశ పదఘట్టనల కింద నలిగిపోతున్న తెలంగాణ ప్రాంతంలో 1920లో రెండు పత్రికలు వెలువడ్డాయి. ఒకటి వరంగల్ జిల్లా ఇనుగుర్తి గ్రామం నుంచి వెలువడిన ‘తెనుగు’ పత్రిక, రెండవది నల్లగొండ నుంచి వెలువడిన ‘నీలగిరి’ పత్రిక. ‘తెనుగు’ పత్రిక సంపాదకులు ఒద్దిరాజు సీతారామ చంద్రరావు, ఒద్దిరాజు రాఘవ రంగారావు సోదరులు. వీరిద్దరూ తమ బహుముఖ ప్రతిభతో, సంస్కృతాంధ్ర భాషలలోనే గాక, ఉర్దూ, ఇంగ్లీష్, పార్సీ భాషలలో ఆరితేరి ఇంకా ఆయుర్వేద, యునాని వైద్యంలోనూ, సాంకేతిక పరిజ్ఞానంలోనూ తమ ప్రావీణ్యం కనబరిచిన ప్రజ్ఞావంతులం. ఎన్నో ఒడిదుడుకులనెదుర్కొని, జాతీయ భావాలతో, సాహిత్యాభిలాషతో, స్వతంత్ర కాంక్షతో, దేశభక్తితో వీరు వెలువరించిన ‘తెనుగు’ పత్రికకు ప్రజల్లో మంచి ఆదరణ లభించిందంటారు.
‘నీలగిరి’ పత్రికకు షబ్నవీస్ నరసింహారావు సంపాదకులు. తెలంగాణను జాగృతం చేయడానికి వెలువడిన మొట్టమొదటి పత్రికలు ఈ రెండు కాగా, తదుపరి హైదరాబాద్ నుంచి సురవరం ప్రతాపరెడ్డి సంపాదకత్వంలో వెలువడిన ‘గోలకొండ’ పత్రిక విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. ఆ తర్వాత తెలంగాణలో సుజాత, దీనబంధు, దక్కన్ కేసరి, తెలుగు తల్లి, విభూతి, దివ్యవాణి, తరుణ వంటి అనేక పత్రికలు వెలువడ్డాయని చెప్తూ, ‘తెలుగుతల్లి’ పత్రికకు రాచమళ్ళ సరస్వతీదేవి అనే విదుషీమణి, దేశభక్తురాలు సంపాదకులుగా పనిచేశారని చెప్పినప్పుడు అప్పటి సామాజిక స్థితిలో స్త్రీలు కూడా ఈ పవిత్ర యజ్ఞంలో పాలు పంచుకున్నారని తెలిసి మనసు గర్వంతో ఉప్పొంగుతుంది.
ఇంకా ‘భాగ్యనగర్’ అనే వారపత్రిక, ‘తెలంగాణ’, ‘మీజాన్’ అనే దినపత్రికలు మాత్రమే గాక, ‘శోభ’ అనే సాహిత్య మాసపత్రిక తెలంగాణ ప్రాంత విద్య, వైజ్ఞానిక భాషా వికాసానికి తమ వంతు పాత్ర పోషించాయని రామానుజరావు మాటల ద్వారా తెలుస్తున్నది.
చలం మరణించిన సందర్భంలో ఆకాశవాణి హైదరాబాద్ నుంచి చేసిన ప్రసంగంలో, చలం గురించి రామానుజరావు మాట్లాడిన మాటలు చలాన్ని ఓ గొప్ప సాహితీవేత్తగా చూపడమే కాక చలం ఆదర్శ, విప్లవ, ఆలోచనా పంథాను సమర్థించడం ఇక్కడ గమనార్హం. ముఖ్యంగా, స్త్రీ పక్షపాతి అయిన చలం ‘మానవ సమాజంలో స్త్రీలు భాగమే అంటూ, స్త్రీకి మనసుంది; స్త్రీకి మేధ ఉంది; స్త్రీకి కోరికలున్నాయి, వాటిని పురుష సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంద’ం టూ తన రచనల ద్వారా సమాజాన్ని మేల్కొల్పిన చలంను గూర్చి సానుకూల దృక్పథంతో మాట్లాడిన రామానుజరావు మానవీయ కోణం ఈ ప్రసంగంలో సుస్పష్టం. అందుకే చలం సాహిత్యంలో రస సృష్టితో పాటు తాత్వికమైన హేతువాద దృష్టి గోచరిస్తుందని చలం సాహిత్య స్వరూపాన్ని పేర్కొన్న విమర్శకులతో ఏకీభవిస్తారు రామానుజరావు.
నెల్లూరులో తిక్కన తిరునాళ్లలో పాల్గొన్నప్పుడు ‘నేను గుర్తించిన తిక్కన’ అన్న అంశంపై ప్రసంగిస్తూ తిక్కన తమ స్వస్థలం వరంగల్‌కు వచ్చిన సందర్భాన్ని స్మరించుకుంటూ చాలా సంవత్సరాల క్రితం తాను కవిత్వం రాసే రోజుల్లో రాసుకున్న మాటలను..
‘తిక్కనా మాత్యుండు తెలుగు దేశపు రాజు
కలసి మాటాడిన కొలువిదేమో’
‘అల్లుని స్వేచ్ఛకై నెల్లూరి నెరజాణ
పఠియించెనిచటనే భారతంబు’
అని ఈ సందర్భంగా ఆత్మీయంగా గుర్తుచేసుకుంటారు రామానుజరావు. నెల్లూరు ప్రాంతాన్ని పరిపాలించిన మనుమసిద్ధికి ముఖ్యమంత్రిగా ఉన్న తిక్కన సోమయాజి ఆయనకు ఆంతరంగికుడు, ఆప్తుడు కూడా. తిక్కన తన ‘నిర్వచనోత్తర రామాయణం’ను మనుమసిద్ధికి అంకితమిచ్చాడు. అప్పటికే కాకతీయ రాజులు దాదాపుగా తెలుగు దేశాన్నంతా తమ అధీనంలోకి తీసుకున్నారు. ముఖ్యంగా, కాకతీయ ప్రభువు గణపతి దేవుని పరిపాలన తెలుగు వారిలో జాతీయాభిమానాన్ని పాదుకొల్పింది. ఆయన రాజధాని ‘ఏకశిలా నగరం’గా ప్రసిద్ధి పొందింది. ఈ పరిస్థితులలో తిక్కన – బయ్యనలు దండయాత్ర గావించి తిరిగి మనుమసిద్ధికి పట్టంగట్టారు. మనుమసిద్ధి రాజ్యాన్ని తిరిగి అతనికి ఇప్పించడానికి సహాయం అర్థిస్తూ తిక్కన సోమయాజి గణపతిదేవుని వద్దకు ఓరుగల్లు వచ్చాడట. ఓరుగల్లులో ఆయనకు బ్రహ్మాండమైన స్వాగతం లభించినట్టు ‘సిద్ధేశ్వర చరిత్ర’ ద్వారా తెలుస్తుంది.
తన జ్ఞాన సంపదతో, వాగ్ధాటితో ఓరుగల్లులో బౌద్ధ పండితులతో చర్చలు గావించి వారిని ఓడించి గణపతి దేవుని ప్రశంసలు పొంది ఆయన సహాయంతో తిరిగి నెల్లూరుకు వచ్చి మనుమసిద్ధిని పట్టాభిషిక్తుని గావిస్తాడట తిక్కన సోమయాజి. ఇదిలా ఉంటే, వేంగీ దేశమును పాలించిన రాజ రాజనరేంద్రుని ఆస్థాన కవి నన్నయ, రాజు ప్రేరణ చేత భారత రచన ప్రారంభించాడు. అయితే సుమారు రెండున్నర పర్వాలు రాసి ఆయన మరణించాడు. తర్వాత ఈ భారతాన్ని రచించడానికి ఎవ్వరూ ముందుకురాలేదు. ఈ బాధ్యతను తిక్కనా మాత్యుడు చేపట్టి విజయవంతంగా పూర్తిచేసి సారస్వత ప్రపంచంలో కవిరాజుగా నిలిచాడని రామానుజరావు వివరిస్తారు. ఇంతటి మహత్తర కార్యాన్ని నిర్వహించిన తిక్కన తనను గూర్చి ఎంత వినయపూర్వకంగా చెప్పుకున్నప్పటికీ ఆనాటి సమాజంలో ఆయనకు లభించిన గౌరవం అపూర్వం అని అభిప్రాయపడుతారు ఉపన్యాసకులు. (ఇంకా ఉంది..)
– డాక్టర్ వాణీ దేవులపల్లి 98669 62414