సునిశిత విమర్శకు పేరున్న వంశీకృష్ణ వర్తమాన విమర్శ చుట్టూ వ్యాసాన్ని నడిపి సినిమా హీరోలకి మల్లే కవులకి ఇమేజి సమస్యలున్నాయేమో అని వాపోవడం (చెలిమె 20.01.25) ఆశ్చర్యం వేసింది. ఆ పోలికే అసమంజసంగా ఉంది. ఇమేజులు అభూత కల్పన కాదా ? పైగా అతనెవరో (?) వర్ధమాన విమర్శకురాలు నీలిమ సదరు విమర్శను కూడా దూకుడు తగ్గించమన్నందుకు ఏకంగా తెలుగు సాహిత్య ప్రతిబింబంలా కనిపించాడన్నారు. ఇది మరీ దారుణమైన మాట. ఏ రకమైన చూపు ఇది ? విమర్శ మీద ప్రేమకొద్దీ ఆ అనామక మిత్రుడలాంటి మాట అని ఉండడు.
ముందుమాటలు, బ్లర్బులు ఇలానే ఉండాలని ఏ సూత్రీకరణ లేదని చెప్తూనే వంశీ ఒక చోట పరిమితులుంటాయంటారు, మరొక చోట విమర్శ చేయకూడదని ఎక్కడా లేదు అంటారు. కొంతమంది కొత్త తరం రచయతల్ని ఉటంకిస్తూ వాళ్ళందరూ ఏ నెగిటివ్ విమర్శ (?) చేయడం లేదంటారు. వంశీకృష్ణ మాత్రం ఏ నెగెటివ్ విమర్శ చేసినట్టు భావించాలి? ’తెలుగు సాహిత్యం ఏమి కోరుకుంటున్నదో అదే నేను ఇస్తున్నాను’ అన్న ప్రసేన్ వైపు సానుకూల ధోరణినే ఆయనా ప్రదర్శించాడు. పైగా వర్తమాన విమర్శకులు సేఫ్ గేమ్ ఆడుతున్నారంటాడు. ఆ ఆటకారితనం మనకి కొత్తదేం కాదు. ఎప్పుడూ ఉన్నది. దాన్ని పరిహరించాకే ఇన్నే ళ్ళూ తెలుగు సాహిత్యం అసలు విమర్శ సామర్థ్యాన్ని అంచనా వేస్తూ వస్తున్నది. లేకపోతే రారాలు, చేరాలని ఒకే గాటన కట్టేసినా తేడా తెలియకుండాపోను.
ఆ శేషం లక్ష్మీపతిరావు గారెవరో గానీ, ఆయన ప్రతిపాదించిన సాహిత్యంలో రిజర్వేషన్ తోడ్పాటు ఇప్పటికే కాదు, ఎప్పటికీ అవసరమే. అసమానతలు కొనసాగిన ప్రతి సమాజానికీ ఆ కాస్త సహేతుకత్వం ఉండతగినది. అదేమీ సానుభూతి కాదే? అయితే ఏదీ మరీ కళ్ళు మూసుకుపోయేట్టు ఉండకూడదు. గుంటూరు లక్ష్మీనరసయ్య గారు అణగారిన వర్గాల సాహిత్యం పట్ల ఎంతో ఔదార్యం చూపిస్తాడు. అతని సమర్థింపు ఒక తరం దళిత బహుజన రచయితలకు ఎనలేని ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్నిచ్చిందనడంలో అతిశయోక్తి లేదు. ప్రాంతీయ విబేధాలు వచ్చినప్పుడు కూడా ఆయన మార్జినలైజ్డ్ ప్రజల పక్షాన్నే మాట్లాడాడు. కానీ ఆయన దళిత బహుజనేతరుల్ని ట్రీట్ చేసే పద్ధతిని మాత్రం సమర్థించకూడదు. పక్షపాతానికీ ఒక న్యాయం ముఖ్యం. విమర్శలోనూ అంతర్గత సమతుల్యత ఉంటుంది. వంశీకృష్ణబహుజన, స్త్రీవాద, దళిత, ముస్లిం మైనారిటీ, ఆదివాసీ కవిత్వంపై ఇప్పటిదాకా వచ్చిన విమర్శని సరి అయిన విమర్శ కాదని భావిస్తున్నట్టు తోస్తున్నది.
వంశీకృష్ణ నీలిమను సమర్థించడానికే ఈ వ్యాసం రాసుకుంటే ఇబ్బంది లేదు. ఆ క్రమంలో అనిల్ డ్యానీ, లండ సాంబమూర్తి, నాంపల్లి సుజాత వంటి వారిని పరోక్షంగా తక్కువచేసి మాట్లాడారు. ఇప్పుడు వస్తున్న సాహిత్యంలో ప్రగతి కాముక రచనలతో బాటు నీతి ప్రవచనాలు, మితిమీరిన ఆధ్యాత్మిక భావజాలము, ఆచరణ లేని ఆదర్శ ప్రభోదాలు, హేతుబద్ధతలేని ప్రణయ ప్రస్తావనల వెల్లువ మనం అందరమూ గమనిస్తూనే ఉన్నాము. ఎవరి విమర్శ ఎలా ఉందో ఏ ఒక్కరి వకాల్తా అన్నింటినీ తేల్చేయదు. మిగతా ప్రక్రియలకున్నట్టే సద్విమర్శకీ విలువ ఉంది. తిట్టడమే విమర్శ అన్నట్టు తయారైన పరిస్థితిని వంశీకృష్ణ వంటివారు తులనాత్మక వివేచన చేయాలి.
ఆయన ఈ వ్యాసం రాశాక సామాజిక మాధ్యమాల్లో ఒకరెవరో కొత్తగా రాస్తున్న వాళ్ళని గాయపరిచేట్టు ‘చెత్తని చెత్త అంటే చిన్నబుచ్చుకుంటే ఎలా’ అని వ్యాఖ్యానించడం బాధాకరం. నీలిమ తన విమర్శను సరైన అర్థంలోనే చేసినట్టు యావత్ తెలుగు సాహిత్య సమాజం గుర్తించాలని వంశీకృష్ణ తాపత్రయపడుతున్నారు. అందుకు తన అనుభవజ్ఞ సమ్మోహ వాక్యం గట్టి ప్రయత్నమే చేసింది. తప్పు లేనే లేదు. ఆ మాత్రానికి విమర్శా రంగాన్ని శుభ్రపరుస్తున్న వ్యాఖ్యలు చేయనక్కర్లేదు. ఇమేజీ చట్రంలో చిక్కుకున్నారని కవుల్ని నిందించనక్కర్లేదు.
– శ్రీరామ్ పుప్పాల 9963482597