బాల సాహిత్య ప్రక్రియల్లో బాల గేయాలకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది. పిల్లల వ్యక్తిత్వ వికాసానికి, నైతిక విలువలు పెంపొందడానికి తెలుగులో బాల గేయాలు దోహదపడతాయి. సరళ భాషలో వినోదం, విజ్ఞానాన్ని పంచుతాయి. చిన్నపిల్లలకు హాయినిచ్చే అలతి, అలతి పదాలతో కూడిన గేయాలు శైశవ దశ నుంచి మానసిక వికాసానికి, సద్గుణాలు నేర్చుకోవడానికి ఎంతగానో తోడ్పడతాయి.
గేయం అంటే.. గేయం అంటే పదాలు, వాక్యాలను రాగయుక్తంగా, లయబద్ధంగా, ఆనందంగా పాడుకునేవి. ఇది గాన యోగ్యమైన కవితా ప్రక్రియ. ఇది మినీ కవితా రూపం. దీనిని గేయ కవిత అని కూడా అంటారు. గేయాలు, పాటలకు పెద్దగా తేడా ఉండదు. కానీ, గేయంలో మాత్రా చందస్సుకు ప్రాధాన్యత ఉంటుంది. అంటే మాత్రా గణాలకు అనుగుణంగా పదాల అమరిక ఉంటుంది. దాశరథి కృష్ణమాచార్య, గురజాడ వెంకట అప్పారావు వంటివారు రాసిన గేయాలు ఉదాహరణలుగా పేర్కొనవచ్చు.
గేయాలను చిన్నపిల్లలు అభినయంగా ఎంతో ఇష్టంగా పాడుకుంటారు. గేయాలను ఇష్టపడని పిల్లలు ఉండరంటే అతిశయోక్తి కాదు. మౌలికంగా గేయానికి, పాటకు పెద్దగా తేడాలు వెతకలేం. కానీ, గేయానికి, పాటకు ఉన్నట్లు ప్రత్యేకంగా పల్లవి అంటూ ఉండదు. చరణాలు ఎన్నైనా ఉండవచ్చు. చిన్నగా ఉన్న గేయాలనే విద్యార్థులు ఇష్టంగా పాడుకోవటానికి అవకాశం ఉంటుంది. అన్ని చరణాల్లో పాదాలు సమానంగా ఉండాలి. కొన్ని గేయాలు వచన రూపంలో కూడా ఉంటాయి. ఏ గేయాలైతే పాడుకోవడానికి సులువుగా, లయబద్ధంగా ఉంటాయో ఆ గేయాలు చిరకాలం మనసుల్లో పదిలంగా నిలబడతాయి.
ఉదాహరణకు..బాల్యంలో నేర్చుకున్న ‘చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ’, ‘చిట్టి చిలకమ్మా అమ్మ కొట్టిందా’ వంటి గేయాలు ఇప్పటికీ మర్చిపోలేం. గేయాలు పలు రకాలుగా ఉంటాయి. అందులో కొన్నింటిని పరిశీలిద్దాం&జానపద, ఆధ్యాత్మిక, దేశభక్తి, ప్రేమ, శ్రామిక, కథా గేయాలు అని వివిధ రూపాల్లో ఉంటాయి. కొన్ని కథలను గేయ రూపంలో చెప్పడానికి ఉపయోగించే పాటలనే కథా గేయాలు అంటారు. బుజ్జి బుజ్జి కథలను గేయ రూపంలో రాసి పాడితే వినసొంపుగా విద్యార్థులను ఆకర్షిస్తుంది. ఎక్కువకాలం జ్ఞాపకం కూడా ఉంటుంది.
ఉదాహరణకు.. కోబురె రాసిన..
‘అనగనగా ఒక ఊరుండె
ఊరు పక్కన చెరువుంది
చెరువుగట్టున చెట్టుంది
చెట్టుకొమ్మన కాకి ఒకటి
గూడు కట్టి గుడ్లు పెట్టె
చెట్టు కిందనే పుట్టుంది
పుట్టలోన ఓ పాముండె ..’.
‘కాకి పాము’ కథను గేయ రూపంలో చెప్తే పిల్లలు శ్రద్ధగా విని నేర్చుకుంటారు. అలాగే ‘కొంగ-తాబేలు’ కథను గేయరూపంలో ఇలా చెప్పవచ్చు.
‘ఊరికి ఉత్తరాన ఉందొక చెరువు
చెరువు గట్టున ఊడలమర్రి
కొమ్మల మీదనే కొంగల వాసం
చెరువు చేపలే వాటికి గ్రాసం’
అనే గేయాన్ని పిల్లలు లయబద్ధంగా ఆనందంగా పాడుకుంటారు. అలాగే ‘చిలుక-నక్క’ కథను గేయ రూపంలో ఇలా కూడా చెప్పవచ్చు.
‘చింతచెట్టు మీద ఉయ్యాలో
చిలుకొకటి కూసుంది ఉయ్యాలో
రామ రామ అంటూ ఉయ్యాలో
నామమే పలికింది ఉయ్యాలో…
ఈ గేయంలో చివరకు చిలుకను నక్క ఎలా మోసం చేసిందో రచయిత కోబురె గేయ రూపంలో చెప్పారు. బాల సాహిత్యంలో బాల గేయాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. ‘వృత్తం గేయం, వచన గేయం-చందస్సుల పరిణామక్రమమని ఏ భాషలోనైనా అక్షర గణ వృత్తాల కంటే ముందుగా మాత్రా చంద్రస్సే పుడుతుందని, ఏ కవితలకైనా పురుడు పూసుకునేది పాటతోనేనని, పాట గేయం ఒకటేనని, గానయోగ్యమైనదే గేయం అని డాక్టర్ సీ నారాయణరెడ్డి అన్నారు. గేయం అంటే మాత్రా చందస్సని తాత్పర్యం. ‘కేవలం గతిని అనుసరించి లయబద్ధంగా పాడుకోవడమే గేయ లక్షణం. దానికి రాగ, తాళాదులు జోడించి పాడుకుంటే పాటవుతుందని గురజాడ పేర్కొన్నారు. విద్యార్థులు గేయాలు నేర్చుకోవడం వల్ల పదాలపై, వాక్యాలపై పట్టు సాధిస్తారు. ఉద్యమ గేయాలు లేదా సమాజంలో ఏదైనా మార్పునకు సంబంధించి చెప్పే గేయాలు చెప్తే లేదా పాడితే విద్యార్థుల మనసులను రంజింపజేయవచ్చు. ఉదాహరణకు ఈ కింది గేయాలు చూడండి..
వందనాలు వందనాలు
అభినందన చందనాలు
మా అభినందన చందనాలు
శ్రమదాచని హాలికులకు
తలవంచని సైనికులకు
భరతమాత పురోగతికి
పాటుపడే యోగ్యులందరికీ…’
ఈ గేయం చదువుతుంటే, వింటుంటే సమాజంలోని స్వార్థ్ధపరుల వల్ల కులవృత్తులవారు చెడిపోతున్నారనే బాధతో చెరబండ రాజు (బద్దం భాస్కర్‌రెడ్డి) రాశారు.
‘స్త్రీలు పొంగిన జీవగడ్డయి
పాలు పారిన భాగ్యసీమయి
వరలినది యీ భరతఖండము
భక్తి పాడరా తమ్ముడా!’
పై గేయంలో రాయప్రోలు సుబ్బారావు భారత భూమి గొప్పతనం, గౌరవాన్ని చాటిచెప్పేవిధంగా కీర్తించారు. దాశరథి కృష్ణమాచార్య రాసిన ‘మన జెండా’ గేయం.
‘మూడు రంగుల జెండా
మురిసిపోయే ఊరినిండ
జాతి గౌరవం నింపగ
జనులకున్న పెద్ద అండ
ఈ జెండా నీడలోనే
పోరాడిరి మన వీరులు
గాంధీ తాత చేతులలో
కదలాడిన మేటి జెండా
ఈ జెండా నీడలోనే
పోరాడిరి మన వీరులు
ఈ జెండా నిలుపుటకే
చనిపోయిరి మనవారలు’
ఈ గేయం పాడుతున్నంతసేపూ మన దేశాభిమానం ఉప్పొంగిపోతుంది. ఈ గేయం ‘మన జెండా’ గురించి, మన దేశ స్వాతంత్య్రం గురించి చెప్తుంది. తెలుగు బాలసాహిత్యంలో ఇంకా పలు బాల గేయాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని పరిశీలిద్దాం.
‘చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే కోటి పూలు తేవే
బండిమీద రావే బంతిపూలు తేవే’
అంటూ తల్లి జోల పాట పాడుతూ గోరుముద్దులు తినిపించి బిడ్డలను నిద్రపుచ్చుతుంది. ఇది ఇప్పటికీ చిరస్మరణీయం.
‘ఏనుగమ్మ ఏనుగు
ఎంతో మంచి ఏనుగు…’
గేయం 1-5 తరగతుల ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఎంతో ఉపకరిస్తుంది. ‘చిట్టి చిలకమ్మా?/అమ్మ కొట్టిందా?/తోటకెళ్లావా?, పండు తెచ్చావా?/గూట్లో పెట్టావా?/గుటుక్కున మింగావా?’ బాలబాట రమణమ్మ రాసిన ఈ గేయం విద్యార్థులను ఎంతో బాగా ఆకర్షిస్తుంది. ‘ఉయ్యాలండి ఉయ్యాలా/ఊగుదమండి రారండి/ఎల్లన్నో మల్లన్న/హాయిగా ఊగుదాం రారండి’.
‘ఉడుతా ఉడుతా ఊచ్/ఎక్కడికెళ్లావోచ్/ఉసిరి చెట్టు మీది కోచ్…’ఈ గేయంలో ప్రశ్న-జవాబులు కలిగి విద్యార్థులు తమ నిత్యజీవితానికి అన్వయించుకునే విధంగా ఉంటుంది.
‘తారంగం తారంగం/తాండవకృష్ణ తారంగం/వేణునాద తారంగం. ‘అదిగో అదిగో మా బడి/నేర్పును చక్కని నడవడి/శ్రద్ధగా చదువులు చదివెదం/చక్కగా కలిసి ఉంటాము/పాఠాలెన్నో చదివెదము/పంచతంత్రము వినెదము. ‘తప్పెట్లోయ్ తాళాలోయ్/దేవుడి గుళ్లో బాజాలోయ్/పప్పు బెల్లం దేవుడికోయ్. పాలు, నెయ్యి నాకే నోయ్…’. ‘బుజ్జిమేక బుజ్జిమేక యాడికెళ్తివి?/రాజు గారి తోటలోన మేతకెల్తిని/రాజుగారు నిన్ను చూసి ఊరుకుండిరా? భటులు వచ్చి నాలుగేసి వెళ్లమనిరి’. ‘వాన వాన వల్లప్ప/చేతులు చాచు చెల్లప్ప/తిరుగు తిరుగు తిమ్మప్ప/తిరగా లేను నరసప్ప…’
‘బుర్రు పిట్ట బుర్రు పిట్ట తుర్రుమన్నది
పడమటింటి కాపురం చేయనన్నది
అత్త తెచ్చిన కొత్త చీర కట్టనన్నది’
‘చుక్ చుక్ రైలు వచ్చింది
దూరం దూరం జరగండి
ఆగినాక ఎక్కండి
జో జో పాపాయి ఏడవకు
లడ్డూ మిఠాయి తినిపిస్తా
కమ్మని పాలు తాగిస్తా..’
‘దాగుడుమూతలు దండాకోర్
పిల్లి వచ్చి ఎలుకా భద్రం
ఎక్కడి దొంగలు అక్కడే
గప్ చుప్ గప్ చుప్..
‘చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ
బంగారు మొలతాడు పట్టుదట్టి…’
‘జేజేలమ్మ! జేజేలు!
అమ్మ నాన్నకు జేజేలు!
గురువులందరికి జేజేలు!
అన్నం పెట్టే రైతుకు జేజేలు
దేశాన్ని కాపాడే జవాన్లకు జేజేలు
బంగరు భూమికి జేజేలు
భారతమాతకు జేజేలు…’
వంటి విభిన్న రకాల బాల గేయాలు ఇప్పటికీ ఆచరణలో కనిపిస్తున్నాయి. ఇలాంటి బాల గేయాలు నీతి, నైతిక విలువలు, విద్యార్థుల్లో దేశభక్తి కలిగించడమే కాకుండా ప్రకృతిని ప్రేమించడం, చిన్నవయసు నుంచే సోదరభావం, పెంపొందిస్తాయి. చిట్టి చిట్టి పదాలతో, పిల్లలు మాట్లాడుకునే సరళమైన భాషలో తక్కువ నిడివిగల గేయాలు బాల సాహితీ రచయితలు రాయడం, పిల్లలతో రాయించి, పాడించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. భాషపై పట్టు సాధిస్తారు. అభ్యసనం, బడి పట్ల ఆసక్తి కలుగుతుంది. అందుకే బాలగేయాలను విద్యార్థుల సన్నిధికి చేర్చవలసిన ఆవశ్యకత అందరి మీద ఎంతో ఉన్నది.
– కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి 9441561655