e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home సాహిత్యం పోతన, మొల్ల మొదట శైవులే..!

పోతన, మొల్ల మొదట శైవులే..!

రేచర్ల రాజుల కాలంలోని గొప్ప సంస్కృత పండితుడు ప్రసిద్ధ వ్యాఖ్యాత అయిన మల్లినాథుని తమ్ముడు పెద్దిభట్టు, కొడుకు కుమారస్వామి కూడా సంస్కృత పండితులు. వీళ్లు మొదట జైనులుగా ఉండి హైందవంలోకి మారినారేమో. అందుకే ‘మళ్లినాథుడు’ అని పేరు. ‘సూరి’ అన్నది కూడా జైనులు పండితులకు ఉపయోగించే బిరుదం.
మల్లినాథసూరి సంస్కృత పంచ మహాకావ్యాలకు వ్యాఖ్యానాలు రచించాడు. ఈ వ్యాఖ్యానాలు ప్రపంచ ప్రఖ్యాత మైనవి. ఆధునిక కాలంలో పాశ్చాత్య పండితులు ఈ వ్యాఖ్యానాలను ఆధారంగా చేసుకొని సంస్కృత కావ్యాలను అర్థం చేసుకున్నారు.
మల్లినాథుడు వ్యాకరణ, అలంకారాది శాస్ర్తాల్లో గొప్ప పాండిత్యం కలవాడు. రేచర్ల రాజుల కాలంలోనే బొమ్మకంటి హరిహరుడు ‘అనర్ఘరాఘవం’ అనే నాటకానికి వ్యాఖ్యానం రాశాడు. నాగనాథుడు అనే మరోకవి ‘మదన విలాసం’ అనే సంస్కృతంలో ‘బాణం’ నాటక భేదం రచించాడు.

పోతన, మొల్ల మొదట శైవులే..!

ఓరుగల్లును జయించటానికి పూర్వం ఢిల్లీ సుల్తానులు దక్షిణాన ఉన్న కంపిలి రాజ్యాన్ని జయించి అక్కడ ఒక ముస్లిం రాజప్రతినిధిని నియమించారు. అతను క్రూరుడు కావటంతో ప్రజలు తిరుగుబాటు చేశారు. ఢిల్లీ సుల్తాన్‌ ఓరుగల్లును జయించినప్పుడు అక్కడ సేనాధిపతులుగా ఉన్న హరిహర రాయలు, బుక్కరాయలు అనే సోదరులను బంధించి ఢిల్లీకి పట్టుకుపోయారు. ఎప్పుడైతే కంపిలిలో ప్రజల తిరుగుబాటు జరిగిందో అప్పుడు హరిహర, బుక్కరాయలకు ముస్లిం మతాన్నిప్పించి కంపిలికి రాజ ప్రతినిధులుగా పంపారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వారికి పంపానదీ తీరంలో విద్యారణ్యస్వామితో పరిచయం అయ్యింది. విద్యారణ్యుడు వారికి తిరిగి హిందూమతాన్నిప్పించి పంపానదీ తీరంలో నగరాన్ని నిర్మించి దానికి ‘విజయనగరము’ అని పేరుపెట్టి, దానికి పట్టాభిషిక్తులను చేశాడు. విజయనగరము విద్యారణ్యుల చేత నిర్మించబడింది కాబట్టి దానికి ‘విద్యానగరం’ అనే పేరు కూడా ఉంది. విజయనగర రాజ్యం హరిహరబుక్కరాయల విజయంతో గొప్ప రాజ్యం గా విలసిల్లింది. ఆ విధంగా కాకతీయ సామ్రాజ్యం విధ్వంసం నుంచి నాలుగు రాజ్యాలు ఉద్భవించాయి.

- Advertisement -

విద్యారణ్యునికి ఇద్దరు సోదరులున్నారు. వారు మాధవుడు, సాయణుడు. వీరిది ఇప్పటి తెలంగాణలోని ధర్మపురి జన్మస్థలం అంటారు. మాధవుడు హరిహర బుక్కరాయలకు మంత్రిగా ఉన్నాడు. సాయణుడు గొప్ప పండితుడు. ఆయన నాలుగు వేదాలకు వ్యాఖ్యానాలు రచించాడు. ఆ వ్యాఖ్యానాలకు ‘సాయణ వ్యాఖ్యానాల’ని పేరు. క్రమంగా వేదాలు అర్థం కాకుండా పోవటం ముస్లింల దండయాత్రలతో వేదాలు మూలపడటంతో వేదాలను పునరుద్ధరించాలనే ఉద్దేశ్యంతో ధర్మపురి వాస్తవ్యుడైన సాయణుడు వేదాలు అర్థమయ్యేటట్లుగా వ్యాఖ్యానాలు రచించాడు. ఎప్పుడైతే పాశ్చాత్య పండితులకు వేదాలు పరిచయమయ్యాయో వాళ్లు సంస్కృత భాషకు వాళ్ల ప్రాచీణ గ్రీకు, లాటిన్‌ భాషలతో సామ్యం ఉండటం గమనించి అధ్యయనాలు చేశారు. వేదా లను అర్థం చేసుకోవటానికి వాళ్లకు సాయణుడి భాష్యాలే తోడ్పడ్డాయి. లేకపోతే వేదాలు అర్థం కాకుండా పోయేవి.

రేచర్ల పద్మనాయక రాజుల కాలంలో తెలుగు సాహిత్య వికాసం ఎంతో జరిగింది. ఈ కాలంలోనే ప్రసిద్ధమైన కవి భాగవతాన్ని రచించిన పోతన ఉన్నాడు. అతని కాలం క్రీ.శ.1420-1480. అతడు సర్వజ్ఞ సింగభూపాలుని ఆస్థానంలో కొంతకాలం ఉన్నాడు. అక్కడ ఉన్నప్పుడే ‘భోగినీ దండకం’ రచించాడు. గోపాలదేవుని ఉత్సవంలో సింగభూపాలున్ని భోగిని అనే వేశ్య చూసి ప్రేమించి తెగించి వచ్చి ఆ రాజు కాళ్లమీద పడ్తుంది. రాజు ఆమెను మన్నించి ప్రియురాలుగా గ్రహించి ఏనుగు మీద ఎక్కించుకొని ఊరేగిస్తూ తీసుకుపోతాడు. ‘భోగినీ దండకం’ అనే ఈ లఘుకావ్యంలో చిన్న ఇతివృత్తం ఉన్నది. వేశ్యను గురించి ఇటువంటి కృతిని పోతన రాసి ఉండడని కొందరు పండితుల అభిప్రాయం. కానీ దీనిలోని శైలిని పరిశీలిస్తే అది పోతన భాగవత శైలిని పోలి ఉన్నది. పోతన రామభక్తుడు కాకపూర్వం రాజాస్థానంలో ఉన్నప్పుడు దీన్ని రాసి ఉంటాడు. చాలా మంది భక్త కవులు మొదట భోగులుగా ఉండి తర్వా త విరాగులుగా మారిన వృత్తాంతాలు మనకు కన్పిస్తాయి. రాజును సంతోష పెట్టేందుకే పోతన ఈ లఘు కావ్యాన్ని రాసి ఉంటాడు. ఆ తర్వాత పోతన రామభక్తుడై భాగవతాన్ని రచించాడు. సింగభూపాలుడు ఆ భాగవతాన్ని తనకు అంకితమీయమని అడిగాడని, పోతన నిరాకరించి రామునికి అంకితం చేశాడనేది ప్రచారంలో ఉన్నదే.

సర్వజ్ఞ సింగభూపాలుని (క్రీ.శ. 1482) తోనే రేచర్ల పద్మనాయకుల వంశం ముగిసింది. బహమనీ సుల్తానైన మహ్మద్‌షా ఓరుగల్లు, రామగిరి మొదలైన దుర్గాలను ఆక్రమించుకొని రాచకొండను కూడా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. సర్వజ్ఞుడైన సింగమ నాయకుని పరిపాలన ఆ విధంగా అంతరించింది. దాంతో పద్మనాయక రాజ్యం అస్తమించి తెలంగాణ పూర్తిగా బహమనీల వశం అయ్యింది. అటువంటి సమయంలోనే పోతన ఓరుగల్లులో నివసించి ఉంటాడు. దక్షిణదేశం నుంచి రామానుజుల ప్రియశిష్యుల్లో ఒకడైన రామానందుడు ఉత్తరభారతానికి పోతూ మధ్యలో తెలంగాణలో రామభక్తిని ప్రచారం చేశాడు. అప్పుడే పోతన, మొల్ల వంటి వారెందరో రామభక్తులయ్యారు. ఉత్తర భారతదేశంలో రామానందుని వల్లనే రామభక్తి సాంప్రదాయం ప్రవేశించి తులసీదాస్‌, కబీరు మొదలైన భక్తకవులు రచనలు చేశారు. తెలంగాణలో శైవులైన వారెందరో రామభక్తులైనారు. పోతన, మొల్ల మొదట శైవులుగా ఉండి తర్వాత రామభక్తితో రచనలు చేశారు.

పోతన భాగవతాన్ని సంస్కృతం నుంచి ఆంధ్రీకరిస్తూ దాన్ని రామునికి అంకితం చేశాడు. ‘నన్నయ, తిక్కనలు.. ఈ భాగవతాన్ని నా పూర్వపుణ్య వశం చేత అను వదించకుండా విడిచిపెట్టారు. దాన్ని నేను తెనుగిస్తా’నన్నాడు. పోతన మొదట రాజాశ్రయంలో ఉండి తర్వాత కాలంలో రాజాశ్రయాన్ని నిరసిస్తూ తన కావ్యాన్ని రామునికి అంకితంగా ఇచ్చాడు.

తెలుగునాట తిక్కన కాలంనాటికి వైదిక కర్మల ప్రాధాన్యం నశించి శివ, విష్ణు భక్తితో కూడిన అర్చనాదులతో, వ్రత విధులు గల పౌరాణిక మతం క్రమంగా వ్యాపించసాగింది. దాంతో పాటే అర్చనాదులలో ఉన్న మూఢభక్తిని నిరసిస్తూ భక్తిమతం ఆవిర్భవించి వ్యాపించింది. ఆ విధంగా పోతన, మొల్ల మూఢనమ్మకాలను విడిచిపెట్టి భక్తిని ఆశ్రయించారు. పోతన.. ‘మన్నామాంకితంబుగా శ్రీమహాభాగవతంబు తెనుగు సేయుము నీకు భవబంధంబులు తెగు’నని రామచంద్రుడు ప్రత్యక్షమై ఆదేశించినట్లుగా చెప్పుకొన్నాడు.

ముదిగంటి ,సుజాతారెడ్డి
99634 31606

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పోతన, మొల్ల మొదట శైవులే..!
పోతన, మొల్ల మొదట శైవులే..!
పోతన, మొల్ల మొదట శైవులే..!

ట్రెండింగ్‌

Advertisement