మనిషి పుట్టుక పుడితే ఏం గొప్ప !
మూడు పూటలా మరపు లేకుండా భోజనాలు !
భోజనాంతరం ఠంచన్‌గా తాంబూలం
మధ్య మధ్య పండ్లు తిని ఒళ్లు పెంచితే సరా!
ఎవరికి గొప్పా? ఊరికి గొప్పా? దేశానికి గొప్పా?
మనిషి పుట్టుక పుడితే ఏం గొప్ప పేరు!
పుట్టినరోజు నాడో పెండ్లిరోజు నాడో
షష్టిపూర్తికో మొక్క నాటి
చుట్టూ కంచె వేసి
మొక్కను చెట్టంతగా పెంచితేనే
మనిషి పుట్టుకకు చెట్టంత సార్థకత!
మన తాతా ముత్తాతలు పోయినా
వాళ్లు పెంచిన తోటలు
అంగడి అంగడిగా అందరి నోటిముందు
విందు విందుగా తీపి తీపి రసాలే మరి!
ఈ రసాలు మనకు మార్గదర్శనమే మరి!
పొడుగ్గా చెట్టంతగా కనిపించే మనిషి
తనకన్నా ఎత్తు పెరిగి ఆకాశాన్ని అందుకునే
చెట్లను పెంచితేనే మనిషి జ్ఞాపకం
చెట్టున్నంతగా వందల ఏండ్లు మరి!
బోడ బోడ గుట్ట మీద
ఊరంతా ఉమ్మడిగా చెట్లు నాటితే
గుట్టంత అడివి పెరిగి ఊరికి శ్రీ రామరక్ష!
ఊరి పక్కన అడివి ఉంటే వాన ఏ పక్కకూ పోదు
ఊరి మీదే ఉత్సవంగా కురుస్తుంది!
మనిషికి చెట్టు బంధం కన్నా గొప్ప బంధం లేదు
నిస్వార్థంగా వీడని నేస్తం చెట్టే మరి!
ఇప్పుడే చెట్టును నాటు నీతో పాటే పెరుగుతుంది
నీకు నీడవుతుంది అలసి సొలసి వస్తే
గాలిగాలిగా వింజామర అవుతుంది
నీకు గొప్ప చరిత్రనిస్తుంది..!
-కందాళై రాఘవాచార్య
87905 93638