భారత ఉపఖండంలోని ఎక్కువ భూభాగాన్ని పరిపాలించిన మొదటి రాజవంశం మౌర్యవంశం (క్రీ.పూ.322-185). ఈ వంశ తొలి రాజైన చంద్రగుప్త మౌర్యుడిని మహా పరాక్రమవంతుడైన రాజుగా తీర్చిదిద్దినవాడు చాణక్యుడు (క్రీ.పూ.350-275). చాణక్యుడనగానే చాలామందికి వెంటనే అర్థశాస్త్రం గుర్తొస్తుంది. కానీ, రాజ్య పాలన ఎలా ఉండాలో చెప్తూ రాజనీతి సూత్రాలను కూడా ఆయన రచించాడు.
ఈ చాణక్యుడు తన శిష్యుడైన చంద్రగుప్త మౌర్యుడి కోసం రాజ్యాన్ని ఎట్లా పరిపాలించాలో, ఎట్లా కాపాడుకోవాలో తెలియజెప్పడానికి ఆరు వేల శ్లోకాలతో ‘అర్ధశాస్త్రమ్’ (రాజకీయ దండనీతి) అనే ఉద్గ్రంథాన్ని రచించాడు. ఆనాటి రాచరిక వ్యవస్థ, సమాజం కోసం వివిధ శాస్ర్తాల నుంచి సేకరించిన 332 శ్లోకాలతో ఒక సంకలనం గ్రంథం వెలువరించాడు. అది ‘చాణక్యుని నీతిశాస్త్రమ్’గా ప్రసిద్ధి పొందింది.
‘ఏకాకి నా తపో ద్వాభ్యాం పఠనం..’/ ఒంటరిగా తపస్సు, చదువు ఇద్దరు కలిసి, గానం ముగ్గరు కలిసి, ప్రయాణం నలుగురు కలిసి చేయాలి అనీ ‘అత్యాసన్నా వినాశాయ… రాజా వహ్ని ర్గురుః స్త్రియః’/ రాజుఅధికారికీ, నిప్పుకూ, స్త్రీకి దగ్గరగా ఉండకూడదు. అట్లాగని మరీ దూరంగా ఉండకూడదు. మధ్యస్థంగా ఉండి వారిని సేవించాలి. లేకుంటే నష్టపోతాము. అంటూ హితనీతి బోధలూ, జాగ్రత్తలూ అనేకం చెప్పినాడు.
చాణక్య విరచితాలుగా ‘అర్ధశాస్త్రమ్’ చాణక్యుని నీతిశాస్త్రంతో పాటుగా ‘చాణక్య రాజనీతి సూత్రాణి’ (చాణక్య రాజనీతి సూత్రాలు) అనే గ్రంథమూ ఉంది. ‘ఈ చాణక్య రాజనీతి సూత్రాలు’ అనే చిరు గ్రంథంలో ఎనిమిది అధ్యాయాలూ, 562 సూత్రాలూ కనిపిస్తున్నాయి.
‘సుఖస్య మూలం ధర్మః’/ ధర్మమే సుఖానికి మూలం అంటూ ప్రారంభమయ్యే ఈ చాణక్య గ్రంథంలోని ప్రథమాధ్యాయంలో ‘అర్ధ సంపత్ ప్రకృతి సంపదం కరోతి’ అర్ధ సంపదే ప్రకృతి సంపదను ఇస్తుందంటూ- అమాత్యులు, మిత్రులు, కోశాగారం, రాష్ట్రం, దుర్గం, సైన్యం ఈ ఆరింటినీ రాజ్య ప్రకృతులని పేర్కొన్నాడు. అమ్యాతులను, మిత్రులనూ పరీక్షించి చేరదీసుకోవాలనీ, రాజు దుర్వ్యసనాలకు లొంగకూడదనీ, దండనాన్ని వివేకంగా ప్రయోగించాలని చెప్తాడు.
రెండవ అధ్యాయంలో ‘అర్థమూలం సర్వకార్యం’/అన్ని పనులూ కావాలంటే ధనమే మూలమంటూ, అది ఉంటే స్వల్ప ప్రయత్నంతోనే పనులు జరిగిపోతాయంటాడు. రాజైనవాడు మంచి నడవడికను ఏనాడూ విడవవద్దని ‘ప్రాణాదపి ప్రత్యయో రక్షితవ్యః’ రాజు తన ప్రాణాల కన్న మిన్నగా ప్రజా విశ్వాసాన్ని రక్షించుకోవాలని హితవు చెప్తాడు.
మూడవ అధ్యాయంలో ‘బాలాదపి యుక్తమార్గం శృణుయాత్’/ అర్థవంతమైన మాటను బాలుడు చెప్పినా వినాలి అంటాడు. సత్పరుషుల అభిప్రాయాన్ని దాటకూడదనీ, రాజులకు పరాక్రమమే ధనమనీ, శత్రువు చేతికి చిక్కినా అతడిని నమ్మకూడదనీ, ధన సేకరణలో శత్రు ప్రమేయమం ఉండొద్దనీ, ఎవరినీ, ఎప్పుడూ… అవమానించకూడదంటాడు. చాలా పనులున్నప్పుడు ఎక్కువ ఫలాన్నిచ్చే పనినీ, భవిష్యత్తులో లాభించే పనిని చేయమని చెప్తాడు.
నాలుగవ అధ్యాయంలో ‘ధర్మేణ కార్యతే లోకః’/ధర్మమే లోకాన్ని నిలబెడుతుందనీ, పరుల సంపద మీద ఆసక్తి చూపవద్దనీ, పరద్రవ్యమైన గింజలేని పొట్టును కూడా హర్షించవద్దనీ, ధాన్యమే ధనమనీ, ఆకలి వంటి శత్రువు లేడంటూ ‘సంసది శత్రుం న పరిక్రోశేత్’/ శత్రువుని సభలో గానీ, పది మందిలో గానీ, నిందిస్తూ అవమానించకూడదని నీతి బోధ చేస్తాడు.
ఐదవ అధ్యాయంలో ‘విద్యా ధన మధనానామ్’ నిర్ధనులకు విద్యయే ధనమనీ ‘ఇంద్రియాణాం ప్రశమం శాస్త్రమ్’/ ఇంద్రియాలకు శాంతిని ప్రసాదించేది శాస్త్రమనీ, ఇతరులలోని సద్గుణాలకు అసూయ చెందకూడదనీ, ‘శత్రోరసీ సుగుణోగ్రాహ్యః’/ శత్రువు నుంచి కూడా మంచి గుణం గ్రహింపతగినదంటాడు. జ్యోతిష్య శాస్త్రం కంటే శకునశాస్త్రం నమ్మతగినదనీ, పూజనీయుల్లో తల్లియే గొప్పదని చెప్తాడు.
ఆరవ అధ్యాయంలో ‘అనుపద్రవం దేశమావసేత్ ఏ ఉపద్రవం లేని దేశంలో నివసించాలని, ఎప్పుడూ ప్రజలు రాజుకు భయపడాలనీ, రాజును మించి దేవుడు లేడనీ, ‘రాజదాసీ నసేవితవ్య’ రాజ్యాంతఃపురంలోని దాసితో సంబంధం పెట్టుకోకూడదనీ హెచ్చరిస్తాడు. ‘కథంచి దపి ధర్మం నిసేవేత్’ ఎంత కష్టపడైనా ధర్మబద్ధంగా బ్రతకాలని చెప్తాడు. ‘నాస్తి సత్యాత్ పరం తపః’ సత్యం కన్నా మించిన తపస్సు లేదంటాడు.
ఏడవ అధ్యాయంలో.. ‘తపస్సార ఇంద్రియ నిగ్రహః’/ అని తపస్సుల్లో శ్రేష్ఠమైనది ఇంద్రియ నిగ్రహమనీ, చేయవలసిన పనులను తెల్లవారు జామున ఆలోచించాలని సూచిస్తాడు. ‘ఆత్మాన స్తోతవ్యః’ / తమకు తామే ఎప్పుడూ పొగుడుకోకూడదని అంటూ, పగలు నిద్రపోకూడదనీ హితవు చెబుతాడు. ఎండమావులు నీరు వలె కనబడినట్లుగా ‘శత్రుర్మిత్ర వద్భాతి’ / శత్రువు కూడా మిత్రుడి వలె కనబడతాడు సుమా అని హెచ్చరిస్తాడు.
ఇక చివరిదైన 8వ అధ్యాయంలో ‘ధుర్మేధసో సచ్ఛాస్త్రం మోహయతీ’ మంచి శాస్త్రం చెడు మేధస్సు కలవాళ్లకు భ్రాంతి కలిగిస్తుందంటాడు. సత్పరుషులతో చేసే స్నేహం స్వర్గవాసం అనీ, దైవాధీనంగా ఉన్నదాని గురించి చింతించకూడదనీ, ‘పుత్రో న స్తోతద్య’ పుత్రుడిని స్తుతించకూడదనీ, ‘ఆత్మచ్ఛిద్రం న ప్రకాశయేత్’ తన లోపాన్ని లోకానికి తెలియనీయవద్దనీ చెప్తాడు ‘వ్యవహారానులోమో ధర్మః’ లోక వ్యవహారానికి అనుకూలంగా ఉండేదే ధర్మం అని సెలివిస్తాడు. యధార్థ స్థితిని తెలుసుకోవడమే శాస్ర్తానికి ప్రయోజనమని అంటాడు. రహస్యంగా పాపాలు చేసేవాళ్లకు పంచభూతాలే సాక్షులు అనీ, సృష్టిలో ప్రతిదీ అనిత్యమైనదనీ, ‘జన్మ మరణాదిషు తు దుఃఖమేవ’/ జనన మరణాలతో దుఃఖమే గానీ సుఖం లేదనే చేదు నిజాన్ని గుర్తుచేస్తాడు. ఈ విధంగా చాణక్యుడి ఈ ‘రాజనీతి సూత్రాలు’లో రాచరికానికి పనికివచ్చే సూత్రాలతో పాటు, సామాన్య ప్రజలకు ఉపయోగపడే నీతిసూత్రాలూ ఉన్నాయి. ‘అహింసా లక్షణో ధర్మః’ (మనో వాక్కాయకర్మలతో ఇతరులెవరినీ హింసించకుండా ఉండటమే ధర్మానికి లక్షణం) అనే చాణక్యుని నీతి సూత్రంలో ఈ పరిచయ వ్యాసాన్ని ముగిస్తున్నాను.
– రఘువర్మ (టీయల్యన్) 92900 93933