చాళుక్యరాజులు తెలంగాణలో కొన్ని ప్రాంతాలను పరిపాలించారు. వారు వేయించిన శాసనాలు చాలావరకు కన్నడ, సం స్కృత, కొన్ని తెలుగు భాషల్లో ఉన్నాయి. వీరు జైనమతాన్ని కూడా ఆదరించి జినాలయాలకు, జైన బసదులకు దానాదులు చేసి శాసనాలు వేయించారు. అందులో ఒకటి హైదరాబాద్ చిలుకూరులో ఉన్నది. శాసన కాలం శ.సం.934=క్రీ.శ. 1012, పరీధావి సంవత్సర ఆశ్వీజ శుద్ధ అష్టమి.
మొత్తం 101 వరుసలలో కన్నడ భాషలో, చివరగా కొంత సంస్కృత భాషలో ఉన్న ఈ శాసనం చాళుక్య త్రిభువనమల్ల ఐదవ విక్రమాదిత్యుని కాలంలో అతని సామంతాధిపతి పద్మనాభయ్య అరసర్ వేయించాడు. కల్యాణి చాళుక్యులకు ప్రత్యేకమైన సమస్త భువనాశ్రయ, శ్రీపృథివీ వల్లభ, మహారాజాధిరాజ, పరమేశ్వర, పరమ భట్టారక, సత్యాశ్రయ కులతిలక, చాళుక్యాభరణ అనే బిరుదులున్నాయి.
త్రిభువనమల్ల చాళుక్య ఐదవ విక్రమాదిత్యుడు రాజ్యం చేస్తుండగా మాళవకు చెందిన పారమార భోజదేవుని ఓడించి ఉత్తరం వైపు ఆధిపత్యం సాధించే క్రమంలో పాయని నదీపరీవాహంలో బస చేసి ఉన్నాడు. ఆ సమయంలో అతని మహా సామంతాధిపతి శ్రీ పద్మనాభయ్య లొంబుళికె 70 ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు. అతడు చిలుకూరు గ్రామంలో ఉన్న జినాలయానికి, పార్శ్వనాథ దేవునికి ధారాపూర్వకంగా సమర్పించి శాసనం వేయించినాడు.
శాసనం వేయించిన పద్మనాభయ్య ‘పాద పద్మోపజీవి, సమధిగత పంచమహాశబ్ద, మహా సామంతాధిపతి, మహా ప్రచండ దండనాయక, శిష్ట జనాశ్రయ, ఆశ్రిత జన చింతామణి, వివేక సామంత గుణనిలయ, నిజకులతిలక, నన్నియమేరు, రూప నారాయణ, విక్రమాంక కార, వైరిభ కంఠీరవ’ వంటి బిరుదులతో పేర్కొనబడినాడు.
– భిన్నూరి మనోహరి