ఈ వార్ధక్య ఋతువుల్లో.. ఈ మిత్తవ క్షణాల్లో …
కన్నబిడ్డల మమకారం చుట్టం చూపైన పొద్దుపొడుపు దారుల్లో
చుక్కలు, చందమామ కానరాని చిమ్మచీకటి ఆకాశంలాగ
శత్రుమూకల దాడుల్లో శిథిలమవుతున్న పాలస్తీనా దేశంలాగ
మృత్యువు బార్డర్లో బతుకీడుస్తున్న ముసలితల్లి
అనివార్యమైన అవస్థల ఈ అవసానదశలో
సత్తువగానీ, సహనంగానీ ఎవరికైనా ఎందుకుంటాయ్!
అష్టదిక్కుల్లో ఆఖరుక్షణాల పహరాలో ఆమె
అనురాగం ఎండమావులైన సహారా…ఆమె
జరా కుహరంలో ఒంటరితనపు మరుపాకారం ఆమె
చూపుల ధారలు ఇంకిపోయిన నయాగరం ఆమె
అంపశయ్యపై ముసలమ్మ కల్లోల ఎదకడలిలో
అల్లాడే ఆశల కెరటాలు
ఎగిసిపడే నిరాశా లావా లహరులు ఊహకందవు
అశ్రుకణంగా మారి మృత్యు సముద్రాన్ని
చేరే ముందు చివరిమాటలు…
మహావృక్షం నేల కూలే ముందు
తల్లి వేరు తండ్లాటలు…ఊహకందవు
శ్వాస ఏ క్షణం శెలవిస్తుందో తెలియని చరమ మజిలీలో
మానవత్వపు కలుగుల్లో మసకసంధ్య వెలుగుల్లో
నేనున్నానంటూ మిణుకుమంటున్న నెలవంక కేర్ టేకర్
బంధాలు గడ్డకట్టి ఫోను పలకరింపులైన
గడ్డుకాలానికి సైతం కరిగి
తోడునీడ నదిలా పారుతున్నది కేర్ టేకర్
నిశ్శబ్దపు ఆ గదిలో మాటల శబ్దమై ముప్పూటలా
మందూమాకవటాలు, డైపర్లను మార్చటాలు
ఎంత దయనీయమో, ఎంత విషాదకరమో ఊహకందవు
ఏ వెలుగు కిరణాలు పారాడని దిగులు చీకటి గుహలో
వేసారిన మలిసంధ్య జీవితాన కాంతిరేఖ కేర్ టేకర్
ఎండుటాకుల శిశిరాన్ని శిశువులా లాలిస్తున్న మహాతల్లి కేర్ టేకర్
ముదిమి వయసు కాగితంమీద ‘ప్రేమ’ సంతకం కేర్ టేకర్
ఆ కోమలమైన కరస్పర్శలో ఏ ప్రేమ మృధుత్వమున్నదో
ఆ కండ్లలో ఏ మానవత్వ పరిమళపు చెమ్మదనమున్నదో
ఆ హృదయంలో ఏ దయాపారావారం దాగున్నదో ఊహకందవు
వృద్ధాప్యంలో మైళ్ల దూరం నుండే మమతలల్లుతున్న
నవలోకంలో మనిషంతా వెలుగుకదా కేర్ టేకర్.
-రమేశ్ నల్లగొండ
8309452179