తెలుగు కథానికకు ఆద్యురాలు భండారు అచ్చమాంబ
కథ-కథానిక-గల్పిక, నవల-నవలిక, నాటకం-నాటిక, పాట-పద్యం -వచన కవిత, ఆత్మకథలు-జ్ఞాపక కథలు, దేశ చరిత్రలు- సాహిత్య చరిత్రలు, పరిచయం-సమీక్ష-విమర్శ తదితర సాహిత్య ప్రక్రియల పేర్లు విననివాళ్లు ఉండరేమో!ప్రాచీన నాగరిక దేశాలన్నింటా ఈ తరహా ప్రక్రియలు,వేర్వేరు పేర్లతో భిన్న భిన్న భాషల్లో – సొంతమట్టి వాసనతో-రూపుదిద్దుకున్న విషయం చదువుకున్న వాళ్లందరికీ తెలుసు. అంచేత, ఆయా ప్రక్రియలు ఫలానా చోట, ఫలానా సమయంలో పుట్టాయని చెప్పుకోవడం ‘మాట వరసకు’ మాత్రమే! కథానికకు సైతం ఇదే సూత్రం వర్తిస్తుంది.
ఉదాహరణకు, సామాన్య శకం మొదలు కావడానికి మూడు నాలుగు వందల ఏండ్ల ముందే వెలువడిన గుణాఢ్యుడి ‘బృహత్కథ’, విష్ణుశర్మ ‘పంచతంత్రం’లను తీసుకోండి. ఈ రచనలు రెండూ భారతదేశంలో ప్రాచీన కథన రీతుల తీరుతెన్నులను మనకు రుచి చూపిస్తున్నాయి. భిన్న దేశకాలాల్లో, విభిన్న రచయితలు వేర్వేరు భాషల్లో, అనేక సాహిత్య రూపాల్లో ఈ మౌలిక కృతులకు అనుకృతులనూ, అనునాదాలనూ సృష్టిస్తూ పోయారు. ఆ క్రమంలో, కథా సాహిత్యంలోంచి గేయకథలు-వీరగాథలు-జానపద కథల్లాంటి నిర్దిష్టమైన రూపురేఖలతో కూడిన కథన ప్రక్రియలను మనకు పరిచయం చేశారు.
ఈ మౌలిక కృతుల్లోని కథలన్నింటినీ గుణాఢ్యుడో-విష్ణుశర్మో మాత్రమే కల్పించి రాశారని ఢంకా బజాయించి చెప్పిన పండితులెవ్వరూ కానరారు. అలాగే, పైన చెప్పుకొన్న కథన రీతులను కూడా ఫలానా రచయిత, ఫలానా దేశకాలాల్లో సృష్టించాడని చెప్పడం కూడా చూడం!
ఎందుకంటే- ఇదంతా, సంస్కృతం, (మహారాష్ట్రీ, శౌరసేనీ, మాగధి, పైశాచి, అపభ్రంశం తదితర) ప్రాకృతాలు- తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, హిందీ, ఇంగ్లిష్ లాంటి దేశ భాషలకు కచ్చితమైన చరిత్ర రూపుదిద్దుకోని కాలం సంగతి. ఒక అంచనా ప్రకారం సామాన్య శకానికి పూర్వం 24వ శతాబ్దం నాటికే సాహిత్యం ఉన్నదని రుజువుచేసే భౌతిక ఆధారాలున్నాయి. కానీ, అప్పటి నుంచీ సాహిత్య చరిత్రలు నమోదు కాలేదు. సామాన్యశకం 19-20 శతాబ్దాల్లోనే సాహిత్య చరిత్ర పరిశోధన- రచన వైజ్ఞానిక పద్ధతుల్లో రూపొందిన సంగతి అందరికీ తెలిసిందేగా! మన ముందుతరాల పరిశోధక పండితులు, కథానిక చరిత్రలోని చిక్కుముడుల్లాంటి వివరాలపై మొదలుపెట్టిన వాదోపవాదాలు, క్రమంగా చర్చోప చర్చలుగా పరిణమించి మనకు స్పష్టతనిచ్చాయి. ‘వాద వివాదాలు ఎక్కడికీ పోవు- చర్చోప చర్చలు స్పష్టతకు దారితీస్తా’యన్నాడో పెద్దాయన! కథానిక విషయంలో ఇది మరోసారి రుజువైంది.
ఈ తరహా సాహిత్య చర్చల పుణ్యమాని తేలిన విషయాల్లో ఒకటి ‘ప్రపంచ సాహిత్యంలో అత్యధిక ప్రమాణంలో ఆదరణకు పాత్రమైన ప్రక్రియ- బహుశా- కథానికే’ అనే విషయం!
కథానికకు అంత ఆదరణ దక్కడానికి కారణమేమిటో వివరించడానికి ప్రయత్నించిన వాళ్లెందరో ఉన్నారు; కొందరు చమత్కారభరితంగానూ, హాస్యస్ఫోరకంగానూ ఇదే విషయాన్ని వివరించగా మరికొందరు తాత్త్విక ధోరణిలో అదే విషయాన్ని వివరించారు.
ఆంద్రె దూబాయిజ్ అనే అమెరికన్ కథకుడు ఇందులో రెండో రకం బాపతు. ‘మన జీవనం కథానికలనే పోలి ఉంటుంది; మధ్యలో మొదలై, మధ్యలోనే ముగిసిపోయే కథానిక లాంటిదే ప్రతిరోజు! బహుశా అందుకేనేమో ఆ ప్రక్రియకు అంత ఆదరణ!’ అన్నాడు దూబాయిజ్. లారీ మూర్ అనే రచయిత్రి కించిత్ హాస్యం చిలికిస్తూ… ‘కథానిక ప్రేమ కలాపం లాంటిదైతే, నవల వివాహ బంధం లాంటిది; బహుశా అందుకేనేమో, ఎక్కువ మంది పాఠకులు కథానికలనే అభిమానిస్తా’రని తేల్చిచెప్పింది. (ఆమె చెప్పకుండా చెప్తున్న మాట, మీరంతా – అరచెవితోనైనా- వినే ఉంటారనుకుంటా!)
కథానిక జీవితంపై ప్రసరించే ఓ పిట్టచూపైతే, దాని మీదకు విసిరే విహంగ వీక్షణం కథానిక చరిత్ర! అసలిదంతా, ఎందుకని అడిగే గడుగ్గాయిలూ ఉంటారు!! ఎందుకంటే, అలాంటి పిట్టచూపు మనకు వాస్తవ పరిస్థితిపై సరైన అంచనా వేసుకునేందుకు అవకాశమిస్తుంది. ఈ చెట్టు మీంచి ఆ చెట్టు మీదికి లేదా ఓ కొమ్మ మీంచి మరో కొమ్మ మీదికి మారి అదే పిట్టచూపు విస్తరించి చూడండి; అంతెందుకు, ఒక్కడుగు వెనక్కివేసి, లేదా ఒక్క క్షణం ఉన్నచోటే నిలబడి మీ పిట్టచూపు మళ్లీ ప్రసరించి చూడండి! దాంతో మొత్తం దృశ్యమే మారిపోతుంది;
నిజానికది దృశ్యంలో వచ్చిన మార్పు కాదు, మీ దృష్టిలో వచ్చిన మార్పు!! ఇలాంటి అనుభవం కథానికలు రాసేవాళ్లలో చాలామందికి బహుశా, ప్రతి ఒక్కరికీ ఎదురయ్యేదేనేమో. దీన్నిబట్టి, ప్రతి ఒక్క కథానికా, జీవితంపై రచయిత ప్రసరింపచేసే పిట్టచూపు మాత్రమేనని అర్థమవుతోంది కదూ! అలాంటి పిట్టచూపుపై విహంగ వీక్షణం ప్రసరించకపోతే ఎలా?
ఇంగ్లిష్లో రాసే భారతీయ రచయిత డేవిడ్ డేవిడర్ మనలో చాలామందికి తెలిసే ఉంటారు. మన పక్క రాష్ట్రం తమిళనాడులో 67 ఏళ్ల కిందట పుట్టిన డేవిడర్ మూడు నవలలు రాశారు. దాదాపు రెండు దశాబ్దాలు జర్నలిస్టుగా పనిచేసిన డేవిడర్ 1985లో ప్రచురణకర్త అవతారమెత్తారు. ఇప్పటికీ అదే పాత్ర పోషిస్తున్నారు. డేవిడ్ డేవిడర్ లెక్క ప్రకారం, ‘ప్రపంచం నలుమూలలా కథానిక, కొంచెం అటూ ఇటూగా, సామాన్య శకం పందొమ్మిదో శతాబ్దిలో వెలువడింది’. అంతకుముందు, ఒకరో ఇద్దరో ‘కథానికల లాంటివి’ రాసిఉన్న విషయం రేపో మాపో పరిశోధనల్లో బయటపడవచ్చు. అయినప్పటికీ, డేవిడర్ లెక్క తప్పుకాబోదు! ఎందుకంటే, పందొమ్మిదో శతాబ్దికి ముందు కథానిక స్వతంత్ర సాహిత్య ప్రక్రియగా గుర్తింపు, ప్రాచుర్యం పొందలేదన్నదే డేవిడర్ లెక్క సారాంశం!!
(మన అభిమాన ప్రక్రియ కథానిక కమామిషు గురించి ఈ కాలమ్లో మాట్లాడుకుందాం!)
అచ్చమాంబతో ఆరంభమైన కథానిక ప్రస్థానం
ఇంగ్లిష్లో ‘షార్ట్ స్టోరీ’ అనే ప్రక్రియ, భారతీయ భాషల్లో వెలువడిన పాతిక ముప్ఫయేళ్ల తర్వాతనే తెలుగులో ‘కథానిక’ రూపుదిద్దుకున్నది. ఈ ప్రక్రియ తెలుగులో స్పష్టమైన రూపం తీసుకున్నది ఇరవయ్యో శతాబ్ది తొలినాళ్లలోనే. దాదాపు ఎనభయ్యేళ్ల పాటు పురిటినొప్పులు పడిన తెలుగు సాహితీ, ‘సహనఫలం అతిమధురం’ అని నిరూపించింది. ‘ధన త్రయోదశి’- ‘స్త్రీ విద్య’ (భండారు అచ్చమాంబ), ‘దిద్దుబాటు’- ‘మీ పేరేమిటి?’ (గురజాడ), ‘హృదయశల్యము’ మాడపాటి, ‘కలుపు మొక్కలు’- ‘అరికాళ్ల కింద మంటలు’ (శ్రీపాద), ‘మంత్రపుష్పం’ (మల్లాది), ‘వింత విడాకులు’ (సురవరం), ‘డిప్రెషన్ చెంబు’ (వేలూరి), ‘చార్మినార్’- ‘పసిడిబొమ్మ’ (నెల్లూరి కేశవస్వామి తదితర కథానికలు ప్రపంచంలోనే అత్యుత్తమ కథానికల శ్రేణిలో సుస్థిరస్థానం సంపాదించుకున్నాయి.
-మందలపర్తి కిషోర్
81796 91822