బతుకమ్మ సహజ సౌందర్యానికి ప్రతీక. ప్రకృతి మాత ఒడిలో ఒదిగే పూ బాలిక. విశిష్టమైన సంస్కృతి సంప్రదాయాలకు పీఠిక. బతుకమ్మ పండుగ వెనుక ఎన్నో గాథలు. ఆ పాటల్లో దాగినవెన్నో చైతన్య గీతికలు. మనిషి ప్రవర్తనను తీర్చిదిద్దే నీతి ప్రబోధాలు. మానవ జీవితానికి అవసరమైన ధర్మాలను, నీతులను, నీతి కథలను, ఆరోగ్య సూత్రాలను, ఆచార వ్యవహారాలను జానపదులు గేయ రూపంలో అందించేవారు. అవి అక్షరబద్ధం కాకపోయినా ప్రజల నాలుకలపై నాట్యం చేసేవి. బతుకమ్మ పాటలలోని నీతి కథలను మనం ప్రస్తావించుకుందాం. ఆపదలోఉన్నా ఆడిన మాట తప్పకూడదన్న నీతిని తెలిపే ‘ఆవు పులి’ కథను బతుకమ్మ పాట
బ్రాహ్మనిట్లా పుట్టే పసిపిల్ల గోవు
పుట్టుతా ఆగోవు పురుడుగోరింది
పెరుగుతా ఆగోవు పెళ్లిగోరింది
గట్లల్ల నున్చోచ్చే బోట్ల పులి రాజు
తింటావా పులిరాజా తింటావా నన్ను
తింటే తిన్టివి గాని కొడుకు బసవన్నకూ పాలిచ్చి వస్తా
అంటూ ప్రాధేయపడటం…
అంతే కాదు అత్త గారిం ట్లో పెళ్ళయ్యాక వెళ్ళే పడు చు నడుచుకోవాల్సిన విధా నాన్ని గురించి..
‘వాడలోని ఆడవాళ్ళు కో ల్
వదినా మరదళ్ళు కోల్
వాడలోని మగవాళ్ళు కోల్
అన్నాదమ్ముల్లు కోల్
వాకిట్లో కురులిప్పి కోల్-
ముడువ బోకమ్మా కోల్
అంటూ కొత్తగా అత్తవారింటికి వెళ్లే వారికి తెలి య జెప్పుతారు. అందుకే తల్లి మెట్టినింటికిచేరేతమ బిడ్డను ముత్తైదువుగా, గృహిణిగా,కోడలుగా ఎలా మెలగాలో వివరిస్తుంది.
నొసట కుంకుమ పెట్టఉయ్యాలో
ఏ పొద్దు మరువకు ఉయ్యాలో
ధరణి పొద్దున లేచి ఉయ్యాలో
తడి బట్ట పిండకూ ఉయ్యాలో
అంటూ చెప్పే సుద్దులు హృదయానికి హత్తుకుంటాయి. ఇవన్నీ ఇప్పటికీ ఆచరించదగ్గవే. బతుకమ్మ పాటల లో స్త్రీలు పాటించవలసిన పతివ్రతా ధర్మాలు సవివరంగా వివరించబడ్డాయి.
శ్రీ కంఠం బైనట్టి ఉయ్యాలో
స్త్రీ ధర్మంబులుగొన్ని ఉయ్యాలో
చెప్పబూనితి నమ్మ ఉయ్యాలో
చిత్తగించండి మీరు ఉయ్యాలో
ఇది స్త్రీ ధర్మంబులే గాదు పిల్లలు మసలుకోవలసిన రీతులు గూడా ఇమిడి ఉన్నాయి. కుటుంబమే తప్ప ఏ ఇతర వ్యవహారాల పట్ల అవకాశం లేని జానపద స్త్రీల కు పతివ్రత ధర్మాలు ప్రాణప్రదమైనవి. స్త్రీలకు సంబంధించిన బ్రతుకమ్మ పండగలో స్త్రీలు పాటించాల్చిన ధర్మాలను గానం చేయడం జరుగుతుంది. స్త్రీ కి అణుకు వ వినయం సహనం ఉత్తమ గుణాలు .అందుకే తల్లిదండ్రులు తమకు అవకాశం దొరికిన పలు సం దర్భాల్లో నీతిని బోధిస్తుంటారు. వాటిలో కొన్నింటినికథా గేయాలుగా పాడుకుంటే .మరికొన్ని నీతులను గేయ రూపంలో పాడుకొంటారు.
సీతమ్మకు వడి బియ్యం పోసి సాగనంపే సమయంలో… సీతాదేవి తల్లిదండ్రులు స్త్రీలు పాటించవలసిన ధర్మాలను మెట్టినింటిలో ఆమె నడుచుకోవాల్సిన రీతులను ఇలా తెలిపారు.
మీ అత్త కౌసల్య ఉయ్యాలో
ఎన్ని మాట్లాడినా ఉయ్యాలో
మారుత్రమీయక ఉయ్యాలో
నీవు సీతమ్మ ఉయ్యాలో
మీ వదిన శాంతమ్మ ఉయ్యాలో
ఒక్కతేఉన్నది ఉయ్యాలో
అంతేకాదు ఆనాడు స్త్రీలు పుట్టింటికి వెళ్లాలన్నా పెద్దలందరి అనుమతిని తీసుకునే విధానాన్ని తెలియజెప్పే ఈ పాటలు చూడండి.
కలవారి కోడలు ఉయ్యాలో
కనక మహాలక్ష్మి ఉయ్యాలో
కాళ్లకు నీళ్లిచ్చి ఉయ్యాలో
కన్నీళ్లు తీసింది ఉయ్యాలో
పురాణాలలో ఉన్న నీతి గాథలను కూడా తమ పాటల్లో తెలియజేశారు. తల్లిదండ్రులను బిడ్డలు ఎలా చూసుకోవాలి అని తెలియచెప్పే శ్రవణ కుమారుడికథ..ఈ పాటలో
కోసలాధీశుండు ఉయ్యాలో
కోసలాధీశుండు ఉయ్యాలో
దశరథ నాముండు ఉయ్యాలో
లోక కల్యాణమాయె ఉయ్యాలో లోకమే మెచ్చెను ఉయ్యాలో అంటూ సాగుతుంది. ఇలా ఎన్నో నీతులు,తాత్విక అంశాలు, బతుకమ్మ గేయాల్లో గోచరిస్తాయి. నింగిలోని సింగిడిని ముంగిటకు తెచ్చే ముద్దుగుమ్మలపండుగ.కులమతాలకతీతమై చేయిచేయి కలిపిపదాలుపాడే బతుకమ్మ పండుగ మన సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం.
(అక్షరయాన్ సౌజన్యంతో)
-ఘాలి లలిత ప్రవల్లిక