హైదరాబాద్ రాష్ట్రం సర్వమతాలు, విభిన్న భాషలు, సంస్కృతుల నిలయం. నాడు హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న పదహారు జిల్లాల్లో ఐదింటిలో మరాఠా భాష మాట్లాడేవారు. కన్నడ భాష మూడు జిల్లాల్లో, తెలుగు భాష మాట్లాడేవారు ఎనిమిది జిల్లాల్లో ఉండేవారు.
హైదరాబాద్ రాష్ట్రంలో ఉర్దూ అధికార భాషగా ఉండి ఆచార వ్యవహారాల్లోనూ, సాంప్రదాయాల్లోనూ, అధికార కార్యకలాపాల్లోనూ ఉర్దూ ప్రాధాన్యం ఎక్కువ. అలాంటి పరిస్థితుల్లో భాష నిలయాల పేరిట తెలంగాణ వ్యాప్తంగా గ్రంథాలయాలు స్థాపించడం జరిగింది.
మరాఠీ ప్రజలు కూడా తమ భాషను, ఆచార వ్యవహారాలను, సంప్రదాయాలను పరిరక్షించుకోవడానికి ఒక సమావేశ స్థలం ఏర్పాటుచేసే ప్రయత్నం చేశారు. భారత గుణవర్ధక సంస్థ గ్రంథాలయం శాలిబండలో 1894లో నెలకొల్పారు. ఆ తర్వాత ఇసామియా బజార్ నందు మరొక గ్రంథాలయాన్ని నెలకొల్పారు. సరిగ్గా వందేండ్ల కిందట అలాంటి విజ్ఞాన కోవెలను 1922లో దీపావళి పర్వదినాన ‘మరాఠా గ్రంథ సంగ్రహాలయం’ను సుల్తాన్ బజార్‌లోని ‘జోషి భవనం’ నందు ఏర్పాటుచేశారు.
నాటి మరాఠా బుద్ధిజీవులు డాక్టర్ శ్రీధర్‌రావు, హరే రామ కృష్ణ గోప్టే, మోహన్‌రావు నాయక్, లక్ష్మణరావు పాటక్ లాంటి పెద్దలందరూ కలిసి చందాలేసుకొని గ్రంథాలయాన్ని స్థాపించారు. ఈ గ్రంథాలయానికి కావాల్సిన పుస్తకాలను, జర్నల్స్‌ను మహారాష్ట్ర నుంచి తెప్పించేవారు. దీన్ని స్థాపించినప్పటి నుంచి 1951దాకా ఇసామియా బజార్, కోఠీలోని వివిధ భవనాల్లో నడిపారు. తదుపరి 1952 ప్రాంతంలో గోపాల్‌రావు ఎక్బోటే కృషి వల్ల ప్రస్తుతం ఉన్న స్థలాన్ని ప్రభుత్వం నుంచి 99 ఏండ్లపాటు లీజుకు తీసుకున్నారు. 1952లో హార్థిక్ హాల్‌ను నాటి కేంద్రమంత్రి ఎన్.గాడ్గిల్ ప్రారంభించారు.
తొలుత ఈ గ్రంథాలయాన్ని మరాఠా ప్రజలే ఉపయోగించుకునేవారు. రానురాను దాన్ని ఎవరైనా ఉపయోగించుకునే అవకాశం కల్పించారు. 250 పుస్తకాలతో ప్రారంభమై నేడు 40 వేల పైచిలుకు గ్రంథాలున్నా యి. వాటిలో మరాఠా కథలు పద్య, గద్య, సాహిత్యం, సామాజిక, రాజకీయ, ఆర్థిక విషయాలకు సంబంధించిన పుస్తకాలు ఆధ్యాత్మిక, పురాణేతిహాసాలు, విజ్ఞానసర్వస్వం మరాఠా, ఆంగ్ల భాషలో అందుబాటులో ఉన్నాయి. మూడు వేలకు పైగా తెలుగు పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.
2018 వరకు ఈ గ్రంథాలయానికి తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ నుంచి ఏడాదికి రూ.10 వేల ఆర్థిక సాయం అందేది. ప్రస్తుతం ఎలాంటి సాయం అందడం లేదు. ఈ గ్రంథాలయాన్ని చారిత్రక వారసత్వ సంపదగా గుర్తించి తగిన సదుపాయాలు, సహాయ సహకారాలు అందించాలి. మారుతున్న కాలంతో పాటు నేటి పాఠకుల అవసరాలకు అనుగుణంగా ఈ గ్రంథాలయాన్ని డిజిటలైజ్ చేయవలసిన అవసరం ఉన్నది. దీంట్లో దాదాపు 1500 పురాతన పుస్తకాలున్నాయి. వాటిని డిజిటలైజ్ చేసి భవిష్యత్తరాలకు అందజేయాల్సిన బాధ్యత మనపై ఉన్నది. అదేవిధంగా నాటి మరాఠీ జర్నల్స్ , మరాఠీ డిక్షనరీలను, జీవిత చరిత్రలను డిజిటలైజ్ చేసి భద్రపరిచే ప్రయత్నం చేయాలి.
డాక్టర్ రవికుమార్ చేగొని
(వ్యాసకర్త: తెలంగాణ గ్రంథాలయ సంఘం ప్రధాన కార్యదర్శి)