‘రచన అనేది కేవలం కలంతో చేసే పనికాదు. అది, హృదయంతో చేసే ప్రయత్నం’
– బాను ముష్తాక్
బుకర్ ప్రైజ్ విజేతగా బాను ముష్తాక్ ఎంపికయ్యారు. ఆమె రచించిన ‘హార్ట్ ల్యాంప్’, పుస్తకాన్ని ఇంగ్లీష్‌లోకి ‘దీపా భాస్తి’ అనువదించారు. 2025అంతర్జాతీయ కన్నడ కథల సంకలన రచయితగా బాను ముష్తాక్ నిలవడం అభినందనీయం. ఆ సందర్భంగానే ఈ వ్యాసం…
1948లో ముస్లిం కుటుంబంలో జన్మించిన బాను ముష్తాక్ 1970లో రచనా జీవితాన్ని ప్రారంభించారు. దళితులు, ముస్లింల స్వరాలు సాహిత్యంలోకి వచ్చిన కాలంలో, బం డాయ (తిరుగుబాటు) సాహిత్య ఉద్యమంలో ఆమె వనితా స్వరంగా నిలిచారు. ఆమె కథలు జాతి, వర్గ, లింగ వ్యవస్థలపై ప్రశ్నల వర్షం కురిపిస్తాయి. బానుకు చిన్నతనం నుంచే చదువుపై, సమాజంలోని అన్యాయాలపై ఆసక్తి ఉండేది. ముస్లిం మహిళగా ఎదగడం, తన చుట్టూ ఉన్న లైంగిక, సామాజిక వివక్షను గమనించడం ఆమెలో రాజకీయ స్పష్టతను పెంచింది. న్యాయవాదిగా సేవలందించిన బాను ముష్తాక్, ఎంతోమంది సామాన్యుల తరఫున న్యాయపోరాటం చేశారు. అది ఆమె కథల్లోనూ ప్రతిఫలించింది. ఆమె రచనల్లోని పాత్రలు తర చుగా చట్టం, న్యాయం, సామాజిక ఒత్తిళ్ల మధ్య జీవించినవే. ఇప్పటికే ఆమె ఆరు కథా సంపు టాలు, ఒక నవల, వ్యాస సంపుటి, కవితా సం కలనం వెలువరించారు. ఆమెకు కర్ణాటక సాహిత్య అకాడమీ అవార్డు, దానా చింతామణి అట్టి మబ్బే అవార్డు వంటి గౌరవాలు లభించాయి.
‘హార్ట్ లాంప్’ అనేది 1990 నుంచి రాసిన 50కి పైగా కథలలోంచి ఎంపికైన అత్యుత్తమ 12 కథల సమాహారం. బాను రచనలు మొదట 1990లో వెలుగులోకి వచ్చాయి. ఆమె మొదటి కథే మహిళా మానసిక స్థితిని గుండెను కలచివేసేలా ఆవిష్కరించింది. ఆమె రచనల్లో స్త్రీల అంతర్మథన పోరాటాలు, మత రాజకీయాలు, పట్టణ గ్రామీణ జీవితాల నడుమ కనిపించే విభజనలు, సామాజిక న్యాయం, విద్య, స్వేచ్ఛ కోసం పోరాటం ప్రధాన అంశాలు గా ఉంటాయి. ఆమె కథల్లో ఉన్న భావోద్వేగాలు లోతుగా ఉన్నా, భాష అతి సాధారణంగా ఉంటుంది.
‘హార్ట్ లాంప్’ పన్నెండు కథల సంకలనమే కాదు, అదొక రచయిత జీవిత ప్రయాణం. ప్రతి కథలో వ్యక్తుల మధ్య సంబంధాలు, పరిసరాలు, నిశ్శబ్దంగా ఉండే వేదనలు, జీవితపు సందిగ్ధతలు ప్రధానంగా కనిపిస్తాయి. దీపా భాస్తి ఇంగ్లీష్ అను వాదం గొప్పగా ఉంది. ‘అనువాద రచన ఒక కళ’ అని ఈ పుస్తకం నిరూపించింది. ఇంటర్నేష నల్ బుకర్ బహుమతి సాధనతో బాను ముష్తాక్ తనకు మాత్రమే గౌరవం తెచ్చుకోలేదు, కన్నడ భాషకు, భారతీయ ప్రాంతీయ భాషల సాహి త్యానికి విశ్వస్థాయిలో గుర్తింపు తెచ్చారు.
నిజాని కి బాను జీవితం సాధారణంగా ప్రారంభమైంది. వైద్య విద్యను చదివి మంచి డాక్టర్ కావాలని ఆమె భావించారు. కానీ, చదువుతో పాటు ఆమె హృదయంలో ఇంకొక తలంపు మెదిలింది. కథలు రాయాలని, మనుషుల అనుభవాలను తన మాటల్లో చిత్రీకరించాలనే ఆలోచన మొదలైంది. ఈ లోపలి పిలుపు ఆమెను వైద్య విద్యను వదిలి రచనా ప్రపంచంలోకి తీసుకువెళ్లింది. ఆ నిర్ణయం ఇప్పుడు చరిత్ర సృష్టించిన నేపథ్యంగా నిలిచింది.
బహుమతిని అందుకున్న అనంతరం బాను ముష్తాక్ మాట్లాడుతూ… ‘ఈ గొప్ప రచయితల మధ్య నిలబడి ఉండటమే గౌరవం. మనం భిన్నతను ఆమోదించేటప్పుడు, ఒకరినొకరం పొగిడేటప్పుడు ఆ యూనిటీ కలిసికట్టుగా జీవించే మార్గాన్ని సూచిస్తుంది. ప్రతి కథకు ఓ వెలుగు ఉంది. దీని విజయం ఇంకా ఎన్నో మూలాల్లో దాగిన గళాలకు వెలుగుదారి’ కావాలి అన్నారు. అలాగే, కన్నడ భాష గురించి మాట్లాడుతూ… ‘కన్నడ అనేది ప్రతిఘటనను, లోతైన భావనను పాడే భాష. ఇందులో రాయడ మనేది విశ్వాసమూ, ఆత్మీయతల కలయిక’ అని చెప్పారు. ప్రతి కథ చిన్నదే అనుకునేవారికి ఇది సమాధానం. ఏ కథా చిన్నది కాదు. భవిష్యత్తుకు మార్గం చూపే ‘దీపం’. ఈ కథలు దక్షిణ భారతదేశంలో ముస్లిం సముదాయాల్లోని మహిళలు, బాలికల జీవితాలపై ఆధారపడి రాశారు.
ఇందులో లింగవివక్ష, కులవ్యవస్థ, మతపరమైన ఒత్తిడులు, శక్తి సంబంధాలు వంటి అంశాలు కీలకంగా ఉన్నాయి. ఆమె జీవితం తీరుగా సాగిన కథల శైలీ, అంతర్జాతీయంగా అందుకున్న గౌరవం ఇవన్నీ కలిపి ఆమెను ఈ తరం గొప్ప కథా రచయితల్లో ఒకరిగా నిలిపాయి. ఇవి ముప్పై ఏండ్లుగా మహిళల హక్కుల కోసం పోరాడిన రచయిత్రి రాసిన కథలు, అనుభూతితో, చాతుర్యంతో అనువదించబడి పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకం మన కాలానికి, గొంతు లేని వ్యక్తుల అనుభవాలకు ప్రతినిధిగా నిలుస్తుంది. ‘నా రచనా శైలి అనేది ప్రజలతో ముఖాముఖి సంభాషణలా ఉంటుంది. అది వారి పక్కనే బల్లపై కూర్చొని, కుటుంబ జీవిత ఆనందాలు, బాధలు, ప్రపంచంలో జరుగుతున్న విషయాలను మనస్ఫూర్తిగా చర్చించడం లాంటిది.’ అన్నారు బాను ఒకచోట.
బహుమతిని ప్రకటించినప్పుడు, జడ్జింగ్ ప్యానెల్ ఇలా అన్నది… ‘బాను ముష్తాక్ కథలు ప్రాంతీయమైనవే అయినా, అవి చెప్పే భావనలు సార్వత్రికమైనవి. ఆమె కథలు మనిషి మనసును ఎంతగా అర్థం చేసుకోవచ్చో చూపిస్తాయి. బాను ముష్తాక్ విజయంతో కన్నడ సాహిత్యానికి గౌరవం పెరిగింది. అంతేగాక, ఇది భారతీయ ప్రాంతీయ భాషల రచయితలకు ఒక స్ఫూర్తిగా మారింది. వారి రచనలు, అనువాదాల ద్వారా ప్రపంచ వేదికలపై నిలవవచ్చన్న నమ్మకా న్నిచ్చింది. హృదయ దీప (‘హార్ట్ లాంప్’) రచయిత్రికి మనసారా అభినందనలు.
– వారాల ఆనంద్ 94405 01281