మట్టి పరిమళాన్ని తన గుండెలనిండా శ్వాసిస్తాడాయన. ‘భూమి స్వప్నా’న్ని గాంచి, ‘దివిటీ’ పట్టుకొని ‘నాగేటిచాలల్ల’ తిరుగుతూ పరవశించి పాటలు పాడుకుంటాడు. సాకారం పొందిన తెలంగాణ అస్తిత్వాన్ని తన గుండెలనిండా నింపుకొని ఆనందడోలికల్లో తేలిపోతాడు. తెలంగాణ తల్లి మురిపెంపు బిడ్డడైన ఆయన పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. ఆయనే బందారం కవి మందారం నందిని సిధారెడ్డి. పుట్టి పెరిగిన మట్టిని, కలబోసుకున్న అనుభూతులను, జ్ఞాన సంపదను అందించిన అనుభవాలను మననం చేసుకుంటూ వాటిని ‘బందారం కథలు’గా పుస్తకాన్ని వెలువరించారు.
‘మూసీ’ సాహిత్య మాసపత్రికలో గత రెండు సంవత్సరాలు ధారావాహికంగా వచ్చిన 24 కథల సమాహారం ఈ పుస్తకం. ఇందులో సంఘటనలు, సన్నివేశాలు, పాత్రలు అన్నీ ‘బందారం’ గ్రామ కేంద్రబిందువుగా సాగుతాయి. మొదటి కథ ‘మా వూరి తీరు’లో ఊరి దేవత అయిన సారగమ్మను మీసాల మల్లయ్య అడవి నుంచి తీసుకొచ్చే వైనం చూపరులకు వెన్నులో వణుకు పుట్టిస్తుంది. సారగమ్మ కోసం తెచ్చే సండ్రకర్రను బండి మీద పెట్టుకొని ఎడ్ల స్థానంలో పులులను, పగ్గాల స్థానంలో పాములను పట్టి తీసుకొచ్చిన మీసాల మల్లయ్య వీరత్వం వర్ణించడానికి వీలులేనిది.
‘చెడ్డగడియ’ అనే కథలో పాపయ్యను మంత్రగాడిగా భావించి, జయమ్మను చంపింది అతడేనని నిర్ధారించి, ఈడ్చుకొచ్చి ఊరిసాక్షిగా కొట్టి చంపడం ఆనాటి మూఢవిశ్వాసాలకు అద్దం పడుతుంది. ‘నా తప్పు జెప్పకుంట ఈ జులుమేందయ్యా? ఈ తన్నుడేందయ్యా’ అని కాళ్లావేళ్లా బతిమాలిన పాపయ్య మాటలు పాఠకులకు కన్నీళ్లు తెప్పిస్తాయి.
ఆ ఊళ్లో వజ్రక్క తొమ్మిదవ యేట పెళ్లయి, పదవయేట వైధవ్యాన్ని పొందిన దురదృష్టవంతురాలు. సంసారసుఖం ఎరుగని అమాయకురాలు. నిష్కల్మష మనస్కురాలై ఊరందరి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ, అందరినీ అక్కున చేర్చుకుంటూ, పరమేశ్వరుని చింతనలో జీవితాన్ని గడుపుతున్న అమృతమూర్తి. ‘మనసు పాడుగాను… మనసు’ కథ ఆమెలో ఉన్నతత్వాన్ని తేటతెల్లం చేస్తుంది. ఒకనాడు కలలో పరమశివుని మగస్పర్శ తాకిన భావన ఆమెను ఆందోళనకు గురిచేస్తుంది. అపరాధభావన ఆమెను వెంటాడుతుంది. బాలునిగా ఉన్న సిధారెడ్డిని పిలిచి అతని ఎడమ కాలుతో తన గుండెమీద మూడుసార్లు తన్నించుకొని పరిహారం చేసుకున్నట్టుగా ఆమె భావించింది. పవిత్ర హృదయాంతరంగురాలైన ఆమె జీవితం ఆదర్శప్రాయం.
ఇంకా… ఇందులో తల్లి చెప్పిన మాట జవదాటక భార్యను కాపురానికి తీసుకెళ్లని అసమర్థుడైన భర్త గురించి చెప్పే ‘కుంజీ’, చనిపోయిన లేగదూడకు మనుషులకు చేసినట్టు అంతిమసంస్కారాలు చేసిన ‘ఋణానుబంధాలు’, ఆనాటి కరణీకపు దొరతనాల గురించి చెప్పే ‘గడీవాసం’, ‘జాయిజాదు’, ‘నన్నె జీవులు’, ‘ఒక చీకటి రాత్రి’ వంటి కథలు పాఠకులను ఊపిరిబిగబట్టి చదివిస్తాయి. నిలువరించకుండా చదివించే గుణం ఈ కథల్లో పుష్కలంగా ఉంది.
ఇవి కేవలం బందారం కథలు కావు, తెలంగాణ భాషా సంస్కృతులకు ప్రతీకలుగా నిలుస్తూ, ప్రజల్లోని అమాయకత్వానికి, అంధవిశ్వాసాలకు, మానవీయ అమానవీయ కోణాలకు, రాగద్వేషాలకు, ఆవేశాలకు, ఆదర్శాలకు, పట్టుబిగువులకు ప్రతిబింబాలుగా తెలంగాణ పల్లీయుల జీవన వైవిధ్యాలను అందించే చరిత్రలు. సందర్భాన్ని బట్టి వేమన, శేషప్ప కవుల పద్యాలను, వీరబ్రహ్మంగారి తత్త్వాలను ఉటంకించడం సిధారెడ్డి రచనాశిల్పానికి మచ్చుతునక. తెలంగాణ భాషాసౌందర్య విన్యాసం ఈ కథలకు మరింత వన్నె తెచ్చింది.
చినుకై కురిసి, చెరువై నిండి, రచ్చబండ ముచ్చట్లతో, ఇంటింటి కలతలకు కన్నీరు పెట్టే సిధారెడ్డి తన కథలతో ప్రతి ఎదను ఆర్ద్రంగా స్పృశిస్తారు. ‘మా ఊరే నాకు మరపురాని ప్రపంచం. తవ్వినంత సంపద. తోడినంత సారం’ అని చెప్పుకొన్న ఆయన కలం నుంచి ఇంకా అనేక రచనలు వెలువడి తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింపజేయాలని కోరుకుందాం.
– ధూళిపాళ అరుణ