తెలుగు, సంస్కృతం, పారసీ, అరబ్బీ, ఉర్దూ, ఆంగ్ల భాషల్లో చక్కని పాండిత్యం కలిగినవాడు, పద్యం, గేయం, వచనం, పాట, గజల్, రుబాయీ ఏదైనా ఆకర్షణీయంగా, సమర్థవంతంగా రాయగలిగే సత్తా ఉన్నవాడు, ఎవ్వరితోనైనా నిర్మొహమాటంగా మాట్లాడే మనస్తత్వం కలిగినవాడు, చిన్నప్పుడే వేదాలను, ఉపనిషత్తులను క్షుణ్ణంగా అధ్యయనం చేసినవాడు, సంస్కృత భాషారీతుల లోతులను తరచిచూసిన ఒక విలక్షణమైన కవితా ప్రవాహం అనుముల కృష్ణమూర్తి.
కృష్ణమూర్తి ఉమ్మడి వరంగల్ జిల్లా మడికొండలో 1923, డిసెంబర్ 6న శ్యామలాదేవి-పండరినాథ శాస్త్రి దంపతులకు జన్మించాడు. విద్యార్థి దశలోనే తెలుగు, సంస్కృత కావ్యాలను, వేదాలను బాగా అధ్యయనం చేశాడు. వ్యాకరణ, అలంకార శాస్ర్తాలనూ చదివాడు. బాల్యంలోనే పద్యాలు, పాటలు రాశాడు. నిత్య వ్యవహారంలోని మాండలికాలు, తెలుగు పలుకుబడులు ఆయన కవిత్వంలో నిండుగా కనిపిస్తాయి. ఆయన పద్యాలలో ఒక విలక్షణమైన పద విన్యాసం ఉంటుంది.
హనుమకొండలో పాఠశాల విద్యనభ్యసించి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ, బీఈడీ పట్టాలను పొంది, 1948, డిసెంబర్ 16న ఉపాధ్యాయ ఉద్యోగంలో చేరాడు. అనేకచోట్ల పనిచేసినప్పటికీ హన్మకొండ మల్టీపర్పస్ హైస్కూల్లో చాలాకాలం పనిచేశాడు. ఆయన పాఠం బోధిస్తుంటే ఒక సాహిత్య సభ నిర్వహించినట్టుగా ఉండేది. తెలుగు భాషను ఎంత కమనీయంగా, ఎంత రమణీయంగా బోధించేవాడో అంతే రసవత్తరంగా ఆంగ్లభాషను కూడా బోధించి విద్యార్థి లోకాన్ని ఉర్రూతలూగించేవాడు. సరస్వతీ సాక్షాత్కారం, శబరి, అంజలి, సీతా కళ్యాణం, సహస్ర చంద్ర దర్శనం, ఉదయ భాండం మొదలైన కావ్యాలతో తెలుగు సరస్వతిని అలంకరించాడు. కృష్ణమూర్తి మిక్కిలి భావావేశం కలవాడు. కవిత్వాన్ని అత్యంత వేగంగా పరుగులు పెట్టిస్తాడు. ఆయన లయాత్మక కవితా ధార రసజ్ఞుల హృదయాలను తట్టి లేపుతుంది.
కృష్ణమూర్తి నిజాం కాలేజీలో డిగ్రీ చదువుతున్న రోజుల్లో మహాకవి రాయప్రోలు సుబ్బారావు ప్రొఫెసర్గా ఉన్నాడు. ఆయన పాఠం చెప్పే విధానం కృష్ణమూర్తికి నచ్చలేదు. అందుకే తరచుగా క్లాసులు ఎగ్గొట్టేవాడు. జువ్వాడి గౌతంరావు, గుంటూరు శేషేంద్ర శర్మ, డాక్టర్ సి.నారాయణరెడ్డి, కాళోజీ, పేర్వారం జగన్నాథం, బాపురెడ్డి వంటి మహానుభావులందరికీ కృష్ణమూర్తి ఆరాధ్యుడు. యూనివర్సిటీలో తెలుగు భాషా సమితి ఉండేది. అందులో జరిగే సాహిత్య గోష్టిలో ఆయన తరచుగా పాల్గొనేవాడు. ఆయన పద్యాలు చదువుతుంటే అందరూ మంత్రముగ్ధులై వినేవారు. ఆయనది చక్కని కంఠస్వరం.
తన మాటలతో అందరినీ ఇట్టే ఆకర్షించేవాడు. ప్రముఖ విద్వత్కవి కోవెల సంపత్కుమారాచార్యకు ఆయన సాహిత్య గురువు. గుంటూరు శేషేంద్ర శర్మను అన్నా! అని సంబోధించినందుకు కృష్ణమూర్తిపై శేషేంద్ర శర్మ ఈ పద్యం రాశాడు. ‘అన్నా! నీ నాలుకపై/ ఎన్నో వేదంబులున్న వెన్నో కావ్యా/ లున్నవి నన్నల్పజ్ఞుని/ అన్నా యని పిల్తువెట్టి అంభోనిధివో’.. అల్పజ్ఞుడనైన నన్ను అన్నా! యని పిలిచెదవా అని శేషేంద్ర అంతటివాడు అన్నాడంటే కృష్ణమూర్తి విరాట్ స్వరూపం గురించి వేరే చెప్పనవసరం లేదు.
‘కిలకిలా నవ్వేటి/ చిరుబోసి నోటిలో/ ప్రాణమ్ములన్ బెట్టి/ జోపాట పాడేటి/ అమృతమ్ము కంటె/ కమ్మని యమ్మ కంఠాన/ గంధమ్ము కంటె/ చల్లని తల్లి పాటలో/ నే వింటినే నిన్ను/ నే కంటినే నిన్ను’ అని సరస్వతీ సాక్షాత్కారం కావ్యం లో ఆయన రాసిన గేయం మన హృదయాల్లో అమృత వర్షం కురిపిస్తుంది. తెలుగు విశ్వవిద్యాలయం వారి ప్రతిభా పురస్కారం, యువభారతి వారి ‘రసబ్రహ్మ’ బిరుదు వంటి అనేక గౌరవ సత్కారాలు అందుకొని తెలుగు భాషను, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన అనుముల కృష్ణమూర్తి 1996, మార్చి 31న స్వర్గస్థులైనప్పటికీ తెలుగు సాహిత్య వనంలో ఎల్లప్పుడూ కవితా సుగంధాలు వెదజల్లుతూనే ఉంటాడు.
– తిరునగరి శ్రీనివాసస్వామి, 94403 69939