ఆంగ్ల సాహిత్య విమర్శలో అలెగరి(allegory)కి ప్రముఖ స్థానం ఉన్నది. ఆ భాషలో ఉన్న వందకుపైగా సాహిత్య సాధనాలలో (literary devices) ఇదొకటి. తెలుగులో దీనిని ధ్వన్యాత్మక రచన లేదా నిగూఢార్థ రచన అనవచ్చు. బాగా సరిపోయే సమానార్థకమైన అచ్చ తెలుగు మాట దొరికేదాకా సంస్కృత పదాలనే వాడక తప్పదు! అలెగరికి రెండు, మూడు నిర్వచనాలున్నాయి. వివరించగలిగే నిగూఢార్థం ఉన్న కథ, కవిత, లేదా చిత్రం అన్నది సాదా నిర్వచనం. విషయాలతో, వ్యక్తులతో, చర్యలతో సమానంగా పరిగణించపదగినదీ, వివరణకు బయట ఉన్న అర్థాలను కలిగినదీ అయిన అలంకార విశేషం, అనేది కొంచెం పైస్థాయి నిర్వచనం. అలెగరిలో ధ్వని (suggestion) ఉంటుంది. అంటే బయటకు కనిపించే అర్థం వేరు, వెనకాల నిగూఢంగా ఉండే అర్థం వేరు అన్నమాట.
జాన్ బన్యన్ (1628-1688) రచించిన The Pilgrims Progress అనే నవలను అలెగరికి ప్రామాణికమైన ఉదాహరణగా చూపుతారు ఆంగ్ల విమర్శకులు. జార్జ్ ఆర్వెల్ రాసిన Animal Farm, 1984.. రెండూ రాజకీయ అలెగరి కిందికి వస్తాయి. జోనతన్ స్విఫ్ట్ రచన అయిన గలివర్స్ ట్రావెల్స్ అలెగరియే. అందులో నాయకుడు దర్శించే ప్రదేశాలు మనుషుల మూర్ఖత్వానికీ, సమాజంలోని లోపాలకూ ప్రతీకలుగా నిలుస్తాయి. ఈ రకానికి చెందిన అలెగరిలో సుగుణాలు, దుర్గుణాలు, మనస్తత్వాలు, జీవన విధానాలు, పాత్రలు-వీటిని ప్రతినిధులు చేస్తూ పరోక్షంగా వర్ణించడం ఉంటుంది. జాన్ కీట్స్ రాసిన కవిత Autumn (1820) అలెగరికి మరొక ఉదాహరణ. ఈ రచనలన్నింటిలో ‘ధ్వని’ దాదాపు ఆసాంతం కొనసాగుతుంది. ఈ లక్షణం అలెగరి, అల్యూజన్ (allusion) అనే రెండు సాహిత్య సాధనాల మధ్య ఉన్న భేదాన్ని వివరించేందుకు తోడ్పడుతుంది. ఆ భేదాన్ని ఈ వ్యాసంలోనే తర్వాత తెలుసుకుందాం.
తెలుగు సాహిత్య రచనల విషయానికి వస్తే, పంచతంత్రంను అలెగరి కింద జమ కట్టవచ్చు. అందులోని జంతువుల పాత్రలు సమాజంలో మానవుల తత్వాలకు ప్రతీకలు. నక్కజిత్తుల మారితనానికి, సింహం శక్తికీ, తాబేలు వివేకానికి విధేయతకు.. ఇలా రామాయణంలో కూడా అలెగరి లక్షణాలున్నాయి. రాముడు ధర్మానికి, సీత జీవాత్మకు, రావణుడు అహంకారానికీ, కామానికీ, హనుమంతుడు భక్తికీ, వనవాసం అంతరంగంలోకి చేసే ప్రయాణానికి ప్రతీకలు. అదేవిధంగా వేయి పడగలు నవల కూడా అలెగరి. ఆ పండగలు పూర్వం ధర్మాన్ని సంరక్షించాయి, ఆ నవలలోని గ్రామాన్ని రక్షించాయనే సూచన ఉంది అందులో.
ఎస్.టి.కోలరిడ్జ్ తన Statemans Manual అనే పుస్తకంలో అలెగరి అమూర్త భావనలకు చిత్రమయి భాషా రూపంలో అనువాదం కాగా, ప్రతీక ఎప్పుడూ వాస్తవికతతో పాలు పంచుకుంటుంది అంటాడు. కానీ, వాల్టర్ బెంజమిన్, పాల్ డి మ్యాన్లు ఈ వాదంతో విభేదించారు. ప్రతీక తాదాత్మ్య అవకాశాన్ని నిర్ణయిస్తుందనీ, అలెగరి దూరాన్ని సూచిస్తుందని వీరి అభిప్రాయం.
అలెగరి ఏర్పడటంలో తరచుగా ప్రతీక పాత్ర ఉంటుంది. కానీ, ఆ రెండూ ఒకటి కావు. అదేవిధంగా అలెగరి, అల్యూజన్ (అన్యాపదేశం) రెండూ ఒకటి కావు. మొదటిదానిలో సూచన నిలకడగా, దాదాపు నిరంతరంగా కొనసాగుతుంది. అన్యాపదేశంలో ఉండేది passing reference (క్షణికమైన ప్రస్తావన) మాత్రమే. అంటే కేవలం ఒకటి రెండు లేదా కొన్ని కవితా పంక్తులతోనో, పారాగ్రాఫ్‌లోని ఒకటి రెండు వ్యాక్యాలలోనో మాత్రమే ఉంటుంది. అన్యాపదేశాన్ని వివరించేందుకు ఇస్తున్న ఈ మూడు ఉదాహరణలను పరిశీలించండి.
బక్క ప్రపంచపు పక్కటెముకల్ని ఆరగించిబలిసిన
ఏకధ్రువ ప్రపంచం/ తోక చుక్కలా రాలిపడింది
(మహోగ్ర ప్రతిఘటన/ జె.గౌతమ్)
ఇందులో బక్క ప్రపంచం, బలిసిన ఏకధ్రువం వరుసగా బీద దేశాలకు, అమెరికాకు సంకేతాలు. కాబట్టి, ఇది అన్యాపదేశం. అయితే, తోక చుక్కలా రాలిందన్నది ఉపమాలంకారం (simile). ఉపమ కూడా సాహిత్య ఉపకరణమే.
మూడో కాలు ఎక్కడ పడుతుందో తెలుసు నాకు
నీ యుద్ధ వ్యూహాలన్నీ కంఠోపాఠమే నాకు
కుప్పకూలినచోటే లేచి నిలబడుతున్నాను
ముసుగు కప్పుకుంటే సూర్యుణ్నయినా నిలదీస్తాను
(అనుమానితుడి ఆత్మకథనం / డాక్టర్ అఫ్సర్)
ఇక్కడ మూడో కాలు అంటే వామనుని మూడో పాదం. ముసుగు కప్పుకోవడం అసలు స్వరూపాన్ని దాచడాన్ని సూచిస్తుంది.
సింహాన్ని బోనులో నెట్టారు
బోను చుట్టంతా ఫెన్సింగ్
ఫెన్సింగ్‌కు కుక్కలు కాపలా
కుక్కల్ని ఉసిగొల్పుతున్న తోడేళ్లు
తోడేళ్లకు తోడుగా ఏనుగులు
ఏనుగుల మీద మొసలి
ఆసనమ్మీద పిరికి కోతి
(కరవాల హేల/ కందుకూరి శ్రీరాములు)
ఇందులోని జంతువులన్నీ వివిధ రకాల మనుషులకు ప్రతీకలు. వీటిని ఉపయోగించుకొని అన్యాపదేశాన్ని సాధించాడు కవి. ఆసక్తి ఉన్న కవులు, రచయితలు తమ రచనలలో అలెగరిని అన్యాపదేశాన్ని చేర్చి మెరుగుదలను సాధించవచ్చు.
– ఎలనాగ