‘సృజనకారుడికి భావనా శక్తి ఎంతో ముఖ్యం. అది ఎంత బలంగా ఉంటే సృజనాత్మకత అంత విలక్షణంగా రూపొందుతుంది’ అన్న కేవీఆర్ మాటలు డాక్టర్ గిన్నారపు ఆదినారాయణ రచనలకు సజీవ సాక్ష్యాలు. ఆది నారాయణ రచనలు చదివినప్పుడు ఈ భావనా శక్తి ప్రాముఖ్యం మనకు మరింత బాగా అవగతమవుతుంది. ఆది నారాయణ రాసిన నానీలు, కవిత్వం, వ్యాసం.. ఇలా ఏది చదివినా ఆయన రచనాసాహిత్యంలోని బలమైన భావనా శక్తి, ఆకట్టుకునే అభివ్యక్తి మనల్ని ఎంతగానో కదిలిస్తాయి.
తెలుగు సాహిత్యంలో యువ కవిగా గుర్తింపుపొందిన ఆదినారాయణ కవిత్వం, నానీలు, వ్యాససాహిత్యం ద్వారా సామాజిక చైతన్యాన్ని రగిలించే ప్రత్యేకశైలిని ఏర్పరచుకున్నారు. భావసాంద్రత, సామాజిక పరిశీలనాదృష్టి, మానవీయ విలువల పట్ల అంకితభావం ఆయన రచనల్లో ప్రతిబింబిస్తాయి. సరిగ్గా ఏడాదిన్నర కిందట వెలువడిన ‘నానీల సుగంధం’ సంపుటి తెలుగు సాహిత్యపు విమర్శకుల ప్రశంసలందుకున్నది. ఇటీవల ఆదినారాయణ ‘భారతీయ భాషా సమ్మాన్’ యువ పురస్కారానికి ఎంపికవడం విశేషం
ఈ ‘నానీల సుగంధం’కు రాసిన ముందుమాటలో ప్రముఖ రచయిత, కవి డాక్టర్ ఎన్.గోపి ఇలా అన్నారు. ‘ఆది నారాయణ… నానీల సింహద్వారం గుండా కవిత్వంలోకి ప్రవేశిస్తున్నాడు. కవితాత్మకత, దేశీయత, మానవతలు ముప్పేటగా అల్లుకున్న నానీలివి. కవి విలక్షణ సంవేదనకు నిలువుటద్దాలు.’
‘ఈ దేహాలన్ని మట్టి ముద్దలే/ కులమతాల తూకమెందుకు’.. సమానత్వ సమాజాన్ని ఈ నానీ ద్వారా కవి ప్రతిపాదిస్తున్నారు. ఈ నానీ మానవతావాది దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది. మరణానంతరం మట్టిలో కలిసిపోయే ఈ శరీరాలకు కులం, మతం వంటి సామాజిక రుగ్మతలు అర్థరహితమైనవని, ఈ విభజనలు సామాజికంగా సమర్థనీయమైనవేనా? అని కవి ఈ నానీ ద్వారా ప్రశ్నించారు.
‘అంబేద్కర్ను ప్రతి పల్లెకు మోసుకెళ్లారు/ వాదాన్ని చౌరస్తాలో వదిలేశారు’.. అంబేద్కర్వాదుల వైఖరిని ఈ నానీ ఎండగడుతుంది. నేడు అంబేద్కర్ విగ్రహం లేని ఊరూవాడా లేదు. కానీ, ఆయన భావజాలాన్ని, సమానత్వ, సామాజిక, న్యాయ సిద్ధాంతాలను మరిచిపోయారని, వాటిని సైతం ప్రజల్లోకి, మారుమూల గ్రామాల్లోకి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకతను కవి ఈ నానీ ద్వారా గుర్తుచేస్తున్నారు.
‘ఎన్నికల టైం ఇది/ ప్రజలు దేవుళ్లని ప్రతి లీడర్ మొక్కుతాడు’.. ఎన్నికలకు ముందు, ఆ తర్వాత ఓటర్ల పట్ల రాజకీయ నాయకులు వ్యవహరించే తీరును ఈ నానీ ఎండగడుతుంది. ఎన్నికల వేళ ప్రజలకు పొర్లు దండాలు పెట్టి, అలవిగాని వాగ్దానాలు చేసి, ఓట్లు దండుకొని ఆ తర్వాత మొఖం చాటేసే నేతల ధోరణిని వ్యంగ్యంగా ఇందులో విమర్శించారు.
‘మనుష్యులు కలిస్తే ఐక్యత/ మనసులు కలిస్తే సఖ్యత’.. సామాజిక ఏకత్వం గురించిన భావన మనకు ఈ నానీలో కనిపిస్తుంది. కుల, మత, లింగ, వయోభేదం లేకుండా మనుషులంతా ఐకమత్యంతో ఉండాల్సిన అవసరాన్ని కవి నొక్కి చెప్పారు.
‘పిల్లలకు సంస్కృతి జ్ఞానం శూన్యం/ మార్కుల కోసం మాతృభాషకు మధుర మంగళం’ ఇంటర్లో తెలుగు భాష, సాహిత్యం స్థానంలో సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలన్న చర్చ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో వెలువడిన నానీ ఇది.
తెలుగు భాషపై జరుగుతున్న కుట్రలను కవి తిప్పికొట్టారు. అంతేకాకుండా పరీక్షలు, మార్కులకు మాత్రమే ప్రాధాన్యమిస్తూ మాతృభాషకు మంగళం పాడటమనేది అత్యంత హేయమైన చర్య. తెలుగు రచయితలు, బోధకులు, పరిశోధకులు మాత్రమే కాదు, తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరూ దీన్ని ఖండించాలి.
ఇలా… సమాజాన్ని చైతన్యం చేయడానికి, సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యల పట్ల అవగాహన కల్పించడానికి, సామాజిక మార్పు కోసం ప్రజల్లో ఒక స్పృహను ఆది నారాయణ రచనలు కలిగిస్తాయి. ఒక వ్యక్తి సామాజిక జీవితమే అతని చైతన్యాన్ని నిర్ణయిస్తుందని కారల్ మార్క్స్ అన్నట్టుగా ఆది నారాయణ సామాజిక జీవితానుభవాలే ఈ ‘నానీల సుగంధం’.
(డాక్టర్ గిన్నారపు ఆదినారాయణ ఇటీవల ‘భారతీయ భాషా సమ్మాన్’ యువ పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా..)
– (వ్యాసకర్త: హైదరాబాద్ యూనివర్సిటీలో పరిశోధక విద్యార్థి)
సిలపాక వెంకటాద్రి 91334 95362