నిన్నటి రోజు హైవేకి కిలోమీటర్ దూరంలో ఉన్న. నీరు లేక ఎండిన మా వరి చేను కోసి పశువులకు మేత వేద్దామని సైకిల్ తీసుకొని బయల్దేరిన. కొద్ది దూరం పోయినంక దారంతా ఎర్ర మందారం కలిపి కల్లాపి జల్లినట్టు ఉంది తారు రోడ్డు. కాస్త దూరంలో నడి రోడ్డు మీద నడి వయస్కుడు ఒకరు, వచ్చే పోయే బండ్లకు దారి చూపిస్తూ ఉసురుమంటూ ఏడుస్తున్నాడు. రోడ్డుకు అడ్డంగా పుచ్చకాయల బండి బోర్లాపడి పచ్చెలు పచ్చెలుగా పగిలి ఉన్నాయి. ఆ వ్యక్తి పగలని పుచ్చకాయలు చేతిలోకి తీసుకొని ‘వీని తలపండు పలుగ, నా తల పలిగినా బాగుండు ఈ పుచ్చ పండు లెక్క..’ అని మిగిలిన కాయలు తీసి నేలకేసి కొడుతున్నాడు. నాకర్థమైంది. నేను సాగు చేసేవాణ్ని. మద్దతు ధర రాక మండుటెండలో తనలో మంటను పగులుతున్న పుచ్చ నీళ్లతో కడుక్కుంటున్నాడు.
మార్కెట్లో ఆరు రూపాయలకు ఒక కాయ. అదే బయట అరువై రూపాయలు. పండించిన కాయలకు ప్రతిఫలం ఇవ్వలేని చేతకాని ప్రభుత్వాలు ఉన్నంతవరకు ఇలా వ్యవసాయం చేసేవాడు నడిరోడ్డు మీద తలలు బాదుకొని చావాల్సిందేనా? కడుపునకు అన్నం పెట్టేవాడిని అన్నిరకాలుగా ఆదుకోండి. వాడు దేశ ప్రజల కడుపు నింపుతాడు. కోట్లు కూడబెట్టడానికి వ్యవసాయం ఎవడూ చేయడు. వాడో బుక్క తిని మిగిలింది పది మందికి పెట్టాలని కోరుకుంటాడు. అందులో వాని శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తే సంతోషిస్తాడు. అయినా ఎవుసం అంటే ప్రతిఫలం ఆశించని ఉద్యోగం. పిల్లలను సాకడం భూమిని సాగు చేయడం రెండూ ఒకటే.
ఏ టైముకి ఏం జరుగుతుందో తెలియదు. అన్నీ బాగుండి పంటతో మార్కెట్లోకి అడుగుపెట్టిన తర్వాత, పండబెట్టి పంచనామా చేసి మళ్లీ జీవితంలో పొలంలో అడుగుపెట్టకుండా చేసే డాక్టర్లు ఎదురుచూస్తుంటారు. నా రాతలో ఈ కోత తప్పదని భరించి శవం మాదిరి లేచి నడ్సుకుంటూ ఇలా నడిరోడ్డు మీద వాని తలను పగలకొట్టుకుంటూ శవయాత్ర పయనాన్నీ మహాప్రస్థానం వరకు గొప్పగా తీసుకువెళ్లే ప్రభుత్వాలకు ఆశీర్వచనాలు ఇస్తూ కనుమరుగైపోతాడు… ‘వీని తలపండు పలుగ’ అనుకుంటూ…
-వ్యాట్ల యాకయ్య, 9701201014