గట్లుంటది..
బాగుంది. కవిత్వం కదా… మన జీవితం కదా… చదవాలనిపిస్తుంది. అనుభవించాలని అనిపిస్తుంది. చలం అన్నారు కదా… అనుభవించి పలవరించు అని. ఇప్పుడు వస్తున్న కవిత్వ గాలి కూడా అనుభవించి పలవరించాల్సిన విధంగానే ఉంటోంది. ఆ సమయంలోనూ, ఈ సందర్భంలోనే శిక్షణ తీసుకుని రాసిన కవిత్వం తెలిసిపోతుంది, తేలిపోతుంది. ఇదిగో ఇలా సహజంగా వచ్చిన, వస్తున్న అక్షరాలే ఓ సువాసనతో మత్తెక్కిస్తాయి. ఇలా ఉంది నరేష్ కుమార్ సూఫీ అనే కవి రాసిన కవిత్వం.
70వ దశకంలో ఇలా కాదు కానీ, పిడికిలి బిగించాలని అనిపించేదట కవిత్వం చదువుతూ ఉంటే. 80ల్లో మా మటుకు మాకు ఓ కొత్తలోకం కనిపించేది. ఇక 90వ దశకం వచ్చేసరికి తూర్పు వైపు చూపులు సారించేలా చేసేది కవిత్వం. అన్నట్లు కథ కూడా ఇలాగే ఉండేది. శుద్ధ కవిత్వం రాసిన వాళ్లని… చెప్పవద్దు కోపగించుకునేలా ఉండేవి ఆ రోజులు. ‘కవిత్వంలో కచ్చితంగా విప్లవ కాంక్ష లేకపోతే అది కవిత్వమే కాదు’ అని అనుకునే అమాయకపు రోజులు అవి. ఇక ఇప్పుడు వీస్తున్న ఈ కవిత్వ గాలి వ్యక్తిగతాన్ని సామూహికం చేస్తున్న దశ. ఒకరూ ఇద్దరూ అని కాదు. కవిత్వాన్ని సుసంపన్నం చేస్తున్న కవులు, కవయిత్రులు చాలామందే ఉన్నారు.
‘పెద్దవీ… పొడవైన గొలుసులతో
ఉన్నవీ అయిన సంకెళ్లు
అందంగా మెరిసిపోయే సంకెళ్లు
తయారు చేస్తారు/ రాత్రంతా నిర్విరామంగా అదే పనిగా’ అని ప్రారంభిస్తాడు నరేష్ కుమార్ సూఫీ అనే కుర్ర కవి. వీడెవడో భలే ఉన్నాడు. సంకెళ్ల మీద కవిత్వం రాశాడని లోలోపల ఓ కొత్తదనాన్ని ఫీలవుతూ ఉంటాం. పద్యం అలా అలా మనల్ని తనలోకి తీసుకుపోతుంది. హఠాత్తుగా ఇలా అంటాడు.
‘అక్కడే తచ్చాడుతున్న యువకుడొక్కడు
ఆకలితో ఇలా అడుగుతున్నాడు అయ్యా…!
మాకు ఆకలిగా ఉంది.. అన్నం కావాలి.. పని కావాలిపోనీ…!
మమ్మల్ని బంధించే సంకెళ్లని చేసే పనైనా సరే మాకు కొంచెం పని చూపించరూ…!!’ అని ముగిస్తాడు.
ఈ పద్యం పూర్తి అయిన వెంటనే నా చేతుల్లోంచి పుస్తకం జారిన చప్పుడు. నా చేతులకు సంకెళ్లు వేసిన శబ్దం. ఈ కుర్ర కవి మొత్తం దేశానికే సంకెళ్లు తయారు చేసే పనిలో ఉన్నాడని తెలుసుకుని ఇప్పుడు వీస్తున్న గాలిని గుండెల నిండా పీల్చుకోకుండా ఎలా ఉంటాం. ఉదయం ఈ పద్యం చదివాక పుస్తకం వైపు చూడాలనిపించదు.
కానీ, గదిలో టేబుల్ దగ్గరో, కిటికీకి ఆనుకునో.. పొద్దున చదివిన పద్యం దగ్గరే పుస్తకం రెండు చేతులు చాచినట్లుగా విప్పారి బొర్లాపడుకునో ఉంటుంది కదా… దానికేసి చూసి ఇంకొక్కటి చదువుదాం. ఏం చదువుతామంటే…
‘గుండెలు పగిలి రోదించే తల్లులనీ,
పంటల కోతలని వదిలి చెట్టుకు పూసిన
రైతులనీ పలకరించే కదా వచ్చావు
పూవులని వెతికే వసంతాలనీ,
వెన్నెల వాసన లేని శరత్తులనీ
హత్తుకునే కదా నడిచావు
ఉరి కొయ్యలనీ, రక్త మలిన వధ్యశిలల్నీ
ముద్దాడే కదా వచ్చావు
ఇక ఈ చల్లని రాత్రి నా సమాధి మీద విశ్రమించు’
అని అనిశ్చితంగా చెబుతాడు. మాటిమాటికీ చొక్కాలేం మారుస్తాం. ఉదయపు చొక్కా గుండెలపై ఎండి ఓ మచ్చలా మిగిలిన చోట మళ్లీ తడుపుకుంటాం. అమ్మ లేని వాళ్లం కదా… ఎవరు చెబుతారు… ‘అలా మాటిమాటికీ తడుపుకోకూడదురా’ అని. ఇతగాడికి తెలియదు. ఈ నరేష్ కుమార్ సూఫీ ఏడిపిస్తూనే ఉంటాడు. ఈ కుర్ర కవి పెద్ద ఆరిందాలా మాట్లాడుతూ ఉంటాడు చాలాసార్లు. మూడు పదుల వయసుకే మురిసిపోతూ ఉంటాడు అన్నీ తానే అని. మళ్లీ ఓ వైరాగితనంతో..
‘రాత్రిని చీకటిని వేరు చేయలేక
పగటినీ వెలుతురునీ తిరస్కరించనూ లేక
ఆడుతుంటిని నాయనా.. అనివార్య దుఃఖపు ఆట
జజ్జన్కరి జన్ అని జనం మధ్యలోనే’
ఇతగాడితో మాట్లాడిన తర్వాతో, కలిసిన తర్వాతో ఇతగాడు బ్రహ్మ సృష్టి కాదు గాక కాదు… అలాగని విశ్వామిత్రుడి సృష్టి కూడా కాదని అర్థమవుతుంది. మరి ఈ వృద్ధ కుర్ర కవి ఎవరూ అనే తండ్లాటలోనే కాలమంతా గడిపేస్తాం. ఈ నరేష్ కుమార్ సూఫీ మాత్రం తంబూర మీటుకుంటా ఇరానీ ఛాయ్‌లో పడి తన గానాలను ఆలపిస్తూంటాడు.
– ముక్కామల చక్రధర్ 99120 19929