నరం లేని నాలుక మాటలు విని
మాటలే సచ్చుబడుతున్నాయి
పరి పరి రూపాలు మార్చుకునే
ఈ మనుషుల్ని చూసి
ఊసరవెల్లులే ఉలిక్కి పడుతున్నాయి
మాట మీద నిలబడాలన్నమాటనే
పొడిచి పొడిచి చంపేస్తున్నారు
మాటంటే వాగ్భూషణం కాదు
మాటంటే మహాద్రోహం అని చాటుతున్నారు
వీళ్ళు ఎక్కడున్నా కాడి ఎత్తేసిపోయే రకమే
గుడినీ, గుడిలో బొమ్మనీ మింగేసే వైనమే
నిలబెట్టినోళ్ళు
జెండాలు పట్టి గెలిపించినోళ్లే
వీళ్లు మా వాళ్లు కాదని చెప్తుంటే
మీరున్నా లేనట్లే
ఏ రోటికి ఆ పాటే చెప్పి
మాయం చేసే రకాలను చూసి
రోకళ్లు లేస్తున్నాయి
సామెతలు సోమసిల్లుతున్నాయి
విలువలు బోరునా విలపిస్తున్నాయి
ఎన్నుకున్న నేతలను చూసి ప్రజల పశ్చాత్తాపం
ఎన్నికైన నేతలను చూసి రాజ్యాంగం కంట నీటి మంట
చెప్పిందే మాట అని, చేసిందే వేదమని
గెలుపును నోట్లతో ఎన్నిసాైర్లెనా కొనుక్కుంటామని
విర్రవీగే వీళ్లను చూస్తూ వదిలేస్తే
ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తారు
చట్టసభలు తమని తాము కాపాడుకోకపోతే
నేరగాళ్లదే, వేటగాళ్లదే అధికారం అవుతాది
ఎక్కడపడితే అక్కడ, ఏ ఆట పడితే ఆ ఆట
ఆడగలమనే వారి ఆటలు కట్టించాలి
రెండు రోజులు అయితే జనం మర్చిపోతారు
అనుకుంటారు కదూ
జనం దేన్నీ మరువరు
వాళ్ల చేతుల్లో ఓటు అనే
వజ్రాయుధాలున్నాయి మరువకండి
కంచెలు చేనులను మేస్తుంటే
రాయకుండా ఉండలేను
ప్రమాద హెచ్చరికలు రేవు దాటుతుంటే
సామాన్యుడు చూస్తూ ఊరుకోడు
పౌర సమాజం చూస్తూ ఊరుకోదు
జనం మేల్కొనే ఉన్నారు
కళ్ళు ఎర్రబడుతున్నాయి ఖబర్దార్
– జూలూరు గౌరీ శంకర్