బయటికి వెళ్తుంటే వెనకాలే తోక ఊపుకొంటూ వచ్చేస్తాయి బుజ్జి ప్రాణులు. షికారుకెళ్లడమంటే పప్పీలకెంత ఇష్టమో. అందుకే మార్నింగ్ వాక్‌లు, ఈవెనింగ్ వాక్‌లకు ఉత్సాహంగా సిద్ధమవుతాయి. ఎవరు అడుగు బయట పెట్టినా ‘నన్నూ తీసుకుపోవా’.. అంటూ వెంటపడతాయి. కానీ, వచ్చింది వానకాలం. మనమంటే గొడుగు, రెయిన్‌కోటు తగిలించుకుని తిరుగుతాం. టామీలు బయటికొస్తే తడిసిపోతాయి. అందుకే, వాటి కోసమూ ఇప్పుడు రెయిన్కోట్లు తయారవుతున్నాయి. ‘డాగ్ రెయిన్ కోట్’ పేరిట రకరకాల రంగులు, డిజైన్లలో వీటిని రూపొందిస్తున్నారు.
నీళ్లను లోపలికి వెళ్లనివ్వని థెర్మోప్లాస్టిక్ పాలీయురెథీన్లాంటి మెటీరియల్ (టీపీయూ)తో తయారు చేస్తారు. కాళ్లు, పొట్ట కింది భాగాన్ని కూడా కప్పి ఉంచుతుంది ఈ కోటు. కాలి చివర ఉండే ఎలాస్టిక్.. టామీ పరిగెత్తేప్పుడు కూడా కాళ్లు తడవకుండా కాపాడుతుంది. ముఖం దగ్గర పారదర్శకమైన టోపీలాంటి ఏర్పాటు ఉంటుంది. బటన్లు, వెల్క్రో సాయంతో ఈ డ్రెస్ తొడగొచ్చు. శుభ్రంగా ఉతకొచ్చు కూడా. షిజు, జర్మన్ షెపర్డ్, లాబ్.. ఇలా వివిధ బ్రీడ్లు, సైజుల శునకాలకు సరిపోయేలానూ తయారు చేస్తున్నారు. మొత్తానికి డాగ్ రెయిన్ కోటు ఉందంటే పప్పీ ఎంత వానలో, ఎక్కడికి వెళ్లినా తడిసిపోతుందనే బెంగ అక్కర్లేదు!