ఒకప్పుడు సోలో ట్రావెలింగ్, సాహస యాత్రలంటే.. యువతే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేది. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. సోలో ట్రావెలింగ్‌లో యూత్ వెనకబడి పోయింది. ఈ కేటగిరీలో 45 ఏండ్లు పైబడిన వారిదే పైచేయిగా ఉన్నట్టు 2025 ఉమెన్స్ ట్రావెలర్స్ సర్వే నివేదిక తేల్చింది. మనదేశంలో ఒంటరిగా ప్రయాణం చేస్తున్న మహిళల్లో.. 45-55 ఏండ్లవారే అధిక సంఖ్యలో ఉన్నట్లు వెల్లడించింది.
మొత్తం మహిళా సాహస యాత్రికుల్లో 50% మంది పెద్దవాళ్లే ఉండగా.. 25-35 ఏండ్ల వయసున్నవారిలో కేవలం 5% మంది మాత్రమే సోలో ట్రావెలింగ్కు ఆసక్తి చూపుతున్నట్లు సర్వేలో తేలింది. 45 ఏండ్లు పైబడినవారిలో చాలామంది ఎక్కువ ఆదాయం, తక్కువ కుటుంబ బాధ్యతలు కలిగి ఉంటారు. కాబట్టి, వారు ప్రయాణాలకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారట.
వీరు ఇండ్లలో పర్మిషన్లు తీసుకోవాల్సిన అవసరం కూడా తక్కువే! దాంతో అనుకున్నదే తడవుగా పెట్టేబేడా సర్దేస్తున్నారు. ఒంటరిగానో, సన్నిహితులతో కలిసో.. ట్రావెలింగ్ ఎంజాయ్ చేస్తున్నారు. సురక్షితమైన పరిస్థితుల్లో.. చిన్నచిన్న సమూహాలతో కలిసి ప్రయాణాలను ఆస్వాదిస్తున్నారు. అదే సమయంలో.. 25-35 ఏండ్ల యువతులు చదువులు, కెరీర్‌పై దృష్టిపెట్టడం వల్ల ట్రావెలింగ్కు దూరంగా ఉంటున్నారు.
అందులోనూ సోలోగా ప్రయాణించడానికి ఇంట్లో పెద్దవాళ్లు కూడా అంగీకారం తెలపడం లేదట. భద్రతే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. జీవితంలో అన్నిరకాల ఎత్తుపల్లాలు చూసిన పెద్దవాళ్లు.. ఈ సాహస యాత్రలను స్వీయ వ్యక్తీకరణ రూపంగా చూస్తున్నారు. నచ్చిన ప్రాంతాన్ని సందర్శిస్తూ.. ఎంజాయ్ చేస్తున్నారు.