కాలం, అభిరుచులు, ప్రాధాన్యాలు మారుతున్న కొద్దీ బంధాల్లోనూ మార్పులు రావడం సహజం. కొన్ని పనుల్ని ప్రధానమైనవిగా భావించి మనం ఎక్కువ సమయం కేటాయిస్తున్నప్పుడు మన భాగస్వామి తన ప్రాధాన్యం కోల్పోయినట్టుగా అనుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో అవతలి వాళ్ల మీద ప్రేమను వ్యక్తపరచడానికి ప్రత్యేక సందర్భం కావాలా? యానివర్సరీయో, పుట్టిన రోజో వచ్చేవరకూ వేచి చూడకుండా, ఎప్పటికప్పుడు చిన్న చిన్న పనుల ద్వారా అవతలి వాళ్లతో బలమైన బంధాన్ని ఏర్పరచుకునే ప్రక్రియే ‘మైక్రోమాన్సింగ్’! మైక్రో, రొమాన్సింగ్ అనే రెండు పదాల కలయిక ఇది. మైక్రో అంటే సూక్ష్మమైన అని తెలుసు కదూ! అంటే చిన్నచిన్న పనుల ద్వారా ప్రేమపూర్వక బంధాన్ని కొనసాగించడం అన్నమాట. ఉదాహరణకు అవతలి వాళ్లు బాగా ఎంజాయ్ చేసే మీమ్స్ పంపడం, ఇష్టమైన చాకొలెట్ కొనివ్వడం, ఓ చిట్టి కవితను పంపడం, నచ్చిన పాటను షేర్ చేసుకోవడం… అవతలి వ్యక్తితో కలిసి ఒక పూట కాఫీ తాగి, కాసేపు హాయిగా నడవడం లాంటివన్నీ చిన్ని రొమాన్స్‌లో భాగాలే. రోజువారీ పనుల్లో కూడా తాము గుర్తున్నాం అన్న ఆలోచన కలిగించడానికే ఇదంతా. ముఖ్యంగా జెన్‌జెడ్ ఈ తరహా ప్రేమను ఎక్కువగా పంచుకుంటున్నారట.