వీడియో గేమింగ్ పరిశ్రమలో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉన్నది. ఈ రంగంలో మొత్తం శ్రామికశక్తిలో.. ఆడవాళ్ల వాటా కేవలం 12-14% మాత్రమే ఉన్నట్టు తేలింది. అందులోనూ సాంకేతిక నిపుణుల్లో 6-9% ఉండగా, నిర్ణయాత్మక స్థానాల్లో 10% కంటే తక్కువగా ఉండటం.. ఈ పరిశ్రమలో మహిళలపై వివక్షను కళ్లకు కడుతున్నది.
గేమింగ్ పరిశ్రమలో మహిళల ప్రాతినిధ్యంపై ఆల్ ఇండియా గేమ్ డెవలపర్స్ ఫోరం, కోరల్ రిక్రూట్తోపాటు ఎమ్-లీగ్ తాజాగా ఒక సర్వే నిర్వహించింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. దేశంలో గేమింగ్ ఆడేవాళ్లలో 44% మంది మహిళలు ఉన్నప్పటికీ, పరిశ్రమలో మాత్రం వారి ప్రాతినిధ్యం తక్కువగా ఉన్నది. ఈ నివేదిక దేశ గేమింగ్ రంగంలో లింగ అసమతుల్యతను హైలైట్ చేస్తున్నది. ఈ రంగంలోని శ్రామిక శక్తిలో ప్రపంచవ్యాప్తంగా మహిళలు 22-24% ఉండగా.. అందుకు భిన్నంగా మనదేశంలో కేవలం 12-14% మాత్రమే ఉన్నారు.
భారతీయ గేమింగ్ పరిశ్రమ.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒకటి. అయినప్పటికీ ఇక్కడ పురుషాధిక్యత కొనసాగుతున్నదని సర్వే ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లింగ అసమానతను పరిష్కరించాల్సిన అవసరం ఉన్నదనీ, అప్పుడే సరికొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయని వారు అంటున్నారు. ‘గేమింగ్ రంగంలో రాణించాలంటే సృజనాత్మకత ఎక్కువగా ఉండాలి. విభిన్నంగా ఆలోచించేవారే.. విభిన్నమైన గేమ్స్‌ను డిజైన్ చేయగలుగుతారు. ప్రేక్షకులను మెప్పించే ఆటలను సృష్టిస్తారు. కాబట్టి, మనదేశంలో గేమింగ్ భవిష్యత్తు బాగుండాలంటే.. మహిళలు కేవలం ఆటలు ఆడటానికే కాదు, వాటిని రూపొందించడంలోనూ కీలక పాత్ర పోషించేలా చూసుకోవాలి’ అని చెబుతున్నారు. అంతేకాకుండా.. ఈ రంగంలో నియామకాలు, ప్రమోషన్లలో లింగ పక్షపాతం, సాంకేతిక, నాయకత్వ పాత్రల్లో మహిళలు ముందుకు సాగకుండా నిరోధించే వ్యవస్థాగత అడ్డంకులను తొలగించాలని కోరుతున్నారు.
నియామకాల్లో పక్షపాతాన్ని తొలగించడానికి కంపెనీలు నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకోవాలనీ, అదనంగా మెంటర్షిప్ కార్యక్రమాలు, నాయకత్వ శిక్షణ, వేధింపుల నిరోధానికి బలమైన విధానాలు అవలంబించాలని సూచిస్తున్నారు. మహిళలకు సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించడంతోపాటు మరింతమంది మహిళలు గేమింగ్ పరిశ్రమలో ప్రవేశించేలా చర్యలు తీసుకున్నప్పుడే వారి ప్రాతినిధ్యం పెరుగుతుందని అంటున్నారు.