మనదేశంలోని అనేక కంపెనీల్లో మహిళలపై వివక్ష కొనసాగుతూనే ఉన్నది. ‘సమాన పనికి సమాన వేతనం’ అనే సిద్ధాంతం కాగితాలకే పరిమితమైంది. ఉద్యోగాలు చేస్తున్న మహిళల్లో 23 శాతం మంది తక్కువ జీతాలతో సరిపెట్టుకుంటున్నారనీ, 16 శాతం మంది మహిళా ఉద్యోగులు వివక్షను ఎదుర్కొంటున్నారని ఇటీవలి సర్వేలోనూ వెల్లడైంది. అయితే, కొన్ని సంస్థలు మాత్రం.. అందుకు భిన్నంగా అతివలను అందలం ఎక్కిస్తున్నాయి.
పురుష ఉద్యోగుల కన్నా ఎక్కువ జీతాలిస్తూ.. వారి జీవితాలకు కొత్త బాటలు వేస్తున్నాయి. అలాంటి సంస్థల్లో జొమాటో, పేటీఎం, డెలివరీ, మామాఎర్త్ లాంటి సంస్థలు ముందున్నాయి. ఇక్కడ పురుషుల కన్నా మహిళా ఉద్యోగులకే ఎక్కువ జీతాలు వస్తున్నాయి. ఆయా సంస్థల వార్షిక నివేదికల్లో ఈ విషయం వెల్లడైంది. ఆయా సంస్థల్లో పనిచేస్తున్న పురుష సహచరులకంటే.. మహిళా ఉద్యోగుల సగటు వేతనం 160 శాతం ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది.