ఎల్లలు దాటిన ఈ పల్లెతల్లికి ఘనమైన గతమేం లేదు. మూడు నెలల పసిపాపగా ఉన్నప్పుడే పోలియో ఆమెను కుదేలుచేసింది. కాళ్లు కదల్చలేని దయనీయస్థితి. అడుగులు వేయలేని ఆ చిన్నారిని తమభుజాలపై ఎత్తుకొని మోశారు తల్లిదండ్రులు.తమ ఆశల రెక్కలను బిడ్డకు తొడిగి ఆశయ సాధనకు పురిగొల్పారు. తనకున్న లోపాన్ని విస్మరించేలా వెన్నుతట్టి ప్రోత్సహించారు. అమ్మానాన్నల తోడ్పాటుతో ఆ చిన్నారి.. పట్టుదలతోచదివింది. పీహెచ్డీ చేసింది. ఆటల్లోనూ ఆణి ముత్యం అనిపించుకున్నది. దేశాలు దాటి పారా త్రోలోవిజయం సాధించి బంగారు పతకం సాధించింది వరంగల్ జిల్లా సంగెం మండలం చింతలపల్లి గ్రామానికిచెందిన దామెర్పుల రమాదేవి. వైకల్యాన్ని త్రోసి రాణించిన విజేత కథ ఇది..
తొలిచూలు ఆడపిల్ల పుట్టిందని ఆ ఇంట ఆనందం వెల్లివిరిసింది. లక్ష్మీదేవే తమ ఇంటికి వచ్చిందని రమాదేవి అని పేరుపెట్టుకున్నారు తల్లిదండ్రులు వరలక్ష్మి, వీరమల్లు. అతను సామాన్య రైతు. ఆమె సాధారణ గృహిణి. బుజ్జాయి నవ్వులు చూస్తూ పొంగిపోయారు. చిన్నారికి మూడు నెలలు వచ్చాక పోలియో సోకింది. విషయం తెలిసి కుదేలయ్యారు వీరమల్లు దంపతులు. తమ బిడ్డకు విధి ద్రోహం చేసినా.. తాము మాత్రం అండగా ఉండాలని నిర్ణయించుకున్నారు. చాలీచాలని సంపాదనే అయినా.. కూతురుకు లోటు రాకుండా పెంచాలనుకున్నారు. కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. చక్కగా చదివించారు. ఆటల్లోకి వెళ్తానంటే.. ‘ఎందుకు బిడ్డా?’ అనకుండా పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఆ ప్రోత్సాహమే రమాదేవిని తాను దివ్యాంగురాలనే విషయాన్ని మర్చిపోయేలా చేసింది. అందరిలా తానూ ఏదైనా సాధించగలననే నమ్మకాన్ని ఆమెలో పెంచింది.
అటు చదువు.. ఇటు ఆటలు..
రమాదేవి చిన్నప్పటి నుంచి చదువులో చురుకు. ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు చింతలపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదివింది.సంగెం జడ్పీ ఉన్నత పాఠశాలలో హైస్కూల్ విద్య, అక్కడి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివింది. డిగ్రీ తర్వాత వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో పీజీతోపాటు పీహెచ్డీ చేసింది. ఆటలన్నా రమాదేవికి ఆసక్తి. చిన్నప్పుడు ఇంటిపక్కన ఉండే పిల్లలతో కలిసి ఆటలాడేది. ఇద్దరు చెల్లెళ్లు, తమ్ముడితో చక్కగా ఆడుకునేది. వైకల్యాన్ని నిందిస్తూ కూర్చునే తత్వం కాదామెది. బడిలో ఆటలపోటీల్లోనూ చురుగ్గా పాల్గొనేది. పారా క్రీడల్లో ముందుండేది.
అలా 2016లో పారా త్రో బాల్ సాధన ప్రారంభించింది. అదే ఏడాది జాతీయస్థాయి టోర్నీలో పాల్గొన్నది. త్రోబాల్‌తో పాటు షార్ట్‌పుట్, జావెలిన్ త్రో కూడా ప్రాక్టీస్ చేసేది. జాతీయ స్థాయి ఈవెంట్లలో పాల్గొంటూ సత్తా చాటేది. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ 2024 డిసెంబర్లో కాంబోడియాలో జరిగిన పారా త్రోబాల్ ఈవెంట్లో పాల్గొని బంగారు పతకం సాధించింది. గతేడాది డిసెంబర్లో శ్రీలంకలో జరిగిన సౌత్ ఏషియన్ పారా త్రో బాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నది రమాదేవి. ఈ పోటీలోనూ బంగారు పతకం సాధించి.. వైకల్యంపై మరోసారి విజయం సాధించింది. చిన్నప్పటి నుంచి తమ ముందు పెరిగిన బిడ్డ.. అంతర్జాతీయంగా ఊరికి పేరు తీసుకువచ్చిందని చింతలపల్లివాసులు రమాదేవికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. తన ప్రతిభతో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.

అలుపెరుగని సాధన
రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి ఈవెంట్లలో పతకాలు సాధించిన రమాదేవి.. అంతర్జాతీయ ఈవెంట్లలో సత్తా చాటడానికి ప్రత్యేక శిక్షణ అవసరమైంది. ఇందుకోసం కొన్నాళ్లు వరంగల్ నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చింది. తన స్నేహితురాలి ఇంట్లో ఉంటూ తన విజయానికి బాటలు పరుచుకుంది. రోజూ ట్రై సైకిల్‌పై మెట్రో స్టేషన్‌కు వచ్చి.. రాయదుర్గం దాకా ట్రైన్లో వెళ్లేది. ఆరు నెలల పాటు దీక్షగా సాధన చేస్తూ జావెలిన్ త్రో, షార్ట్పుట్లో రాటుదేలింది. త్రోబాల్ టోర్నమెంట్స్ కోసం దేశంలోని వివిధ నగరాలకు వెళ్లేది. పాల్గొన్న ప్రతి ఈవెంట్లో పతకం గెలుచుకునేది. త్రో బాల్ టోర్నమెంట్ ఉన్న సమయాల్లో నెల రోజులు ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేస్తుంటుంది రమాదేవి. ఇందుకోసం చెన్నై, హైదరాబాద్‌కు వెళ్తుంటుంది. మొత్తంగా విధిని ఎదిరించి తనకు తిరుగు లేదని నిరూపించుకుంది. తనకు అండగా నిలిచిన తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలిచింది. ఒకవైపు క్రీడల్లో సత్తా చాటుతూనే, మరోవైపు ప్రభుత్వోద్యోగం సాధించడమే లక్ష్యంగా అహరహం కృషి చేస్తున్న రమాదేవి ఉన్నతస్థాయికి చేరుకోవాలని మనమూ ఆకాంక్షిద్దాం!
..? తీగారపు సుధాకర్
సంగెం