భార్యాభర్తల మధ్య అనుబంధం చాలా ప్రత్యేకమైనది. వివాహ బంధంతో ఒక్కటైన జంట జీవితమంతా కలిసి గడపాలి. ఒకరి గురించి మరొకరు ఆలోచించాలి. ఒకరి సంతోషం మరొకరు చూసుకోవాలి. ఇలా మరెన్నో! పెండ్లితో మొదలయ్యే రిలేషన్ బలంగా వర్కవుట్కావాలంటే.. ఈతరం అనుసరించాల్సిన సూత్రాలు ఇవి.
ఒకప్పుడు ప్రేమ అంటే త్యాగం మాత్రమే! భార్య కోసం భర్త తన ఇష్టాలను వదులుకోవడం, భర్త మనసు నొప్పించొద్దని భార్య తన సిద్ధాంతాలకు నీళ్లొదలడం.. ఇలా భార్యాభర్తలు త్యాగమూర్తులుగా ఉండేవాళ్లు! ఈ ఫార్ములా ఈతరానికి చెల్లదు. ఇప్పటివాళ్లు త్యాగాలు కోరుకోవడం లేదు. పైగా అలా చేస్తే.. బంధం పెరగకపోగా, తిరస్కారం ఎదురయ్యే ప్రమాదమూ ఉంది. ఇద్దరికీ కామన్ ఇష్టాలేంటో తెలుసుకొని వాటి విషయంలో ఒక్కతాటిపై ఉండటమే నవీన ప్రేమసూత్రం.
ఎంత భార్యాభర్తలైనా ఎవరి స్పేస్ వారిదే అనే రోజులకు వచ్చేశాం. స్వతంత్ర భావాలు పెరగడం వల్ల ఇలాంటి ధోరణి వచ్చింది. అలా అనుకోవడమూ, ఉండటమూ తప్పు కాదు! అయితే, ఒకరి స్పేస్‌లో మరొకరు తలదూర్చకూడదన్న మొండి పట్టుదల కూడదు. మీరు కోరుకునే ప్రైవసీ మీ భాగస్వామికి సీక్రెసీ అనిపిస్తే ప్రమాదం. అలాంటి అవకాశం ఇవ్వకుండా మీ స్పేస్‌లోకి మీ పార్ట్నర్ని ఆహ్వానించి చూడండి! అప్పుడు మరింత రంజుగా ఉంటుందేమో!!
అభిప్రాయభేదాలు తలెత్తినప్పుడు ముభావంగా ఉండి.. పరిస్థితిని మరింత జటిలం చేసుకోవద్దు. మీ ఆలోచనలను స్వేచ్ఛగా పంచుకోండి. మీ భాగస్వామి నుంచి సలహాలు కోరండి. ఆర్థిక విషయాలైనా, కుటుంబ వ్యవహారాలైనా ఇద్దరూ చర్చించుకున్నప్పుడే సరైన పరిష్కారం వస్తుంది.
విమర్శను పాజిటివ్‌గా తీసుకునే స్వభావాన్ని భార్యాభర్తలు ఇద్దరూ పెంపొందించుకోవాలి. కాంప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు మురిసిపోయేవారు… ఒక్క విమర్శకు అతలాకుతలం అయిపోతుంటారు! జీవితం పంచుకున్న వ్యక్తి విమర్శించారంటే.. అయితే, మీరు చేసింది తప్పయినా అయి ఉండాలి! లేదంటే మీ భాగస్వామి ఆ విషయంలో మిమ్మల్ని అపార్థం చేసుకునైనా ఉండాలి! తప్పు జరిగి ఉంటే ఒప్పుకొని దిద్దుకునే ప్రయత్నం చేయాలి. అపార్థం చేసుకుంటే అర్థమయ్యేలా చెప్పాలి! అంతేకానీ, ‘నన్నంత మాట అంటావా’ అని అగ్గి మీద గుగ్గిలం అయితే.. వైవాహిక బంధం పలుచన అవుతుందని గుర్తుంచుకోండి.
పనిచేసే చోటో, చుట్టాల దగ్గరో మొహమాటాలకు పోతే పోయేదేం ఉండదు! కానీ, జీవితాన్ని పంచుకున్న వారి దగ్గర బిగుసుకుపోతేనే ఇబ్బంది!! మీకు నచ్చని విషయాన్ని ప్రస్తావిస్తే ‘నో’ చెప్పడానికి వెనుకాడొద్దు. మీరు నో చెబుతున్నది ఆ సమయంలో లేవనెత్తిన అంశానికే కానీ, మీ భాగస్వామికి కాదు కదా! అలాగే, పార్ట్నర్ ‘నో’ అన్నప్పుడు చిన్నబుచ్చుకోకుండా.. కారణాలు అడిగి తెలుసుకోండి. సహేతుకమైనవి అయితే, పునరాలోచించండి. హేతుబద్ధంగా అనిపించకపోతే.. మీ అభిప్రాయాన్ని సున్నితంగా వివరించే ప్రయత్నం చేయండి.