బంగారం అనగానే పచ్చని పసుపు రంగులో మెరిసిపోయే అందమైన నగలు స్ఫురిస్తాయి. కానీ పసుపు రంగులోనే కాదు బంగారం రకరకాల రంగుల్లో కూడా తళుకులీనుతుంది. రోజ్ గోల్డ్, బ్లాక్ గోల్డ్, వైట్ గోల్డ్, రెడ్ గోల్డ్.. ఇలా రకరకాల వన్నెల్లో పసిడి అందుబాటులో ఉంది. వీటితో తయారు చేసే ఆభరణాలు వేటికవే ప్రత్యేకంగా అలరిస్తాయి. ఈ వెరైటీల్లో వైట్ గోల్డ్ ఆధునిక మహిళలను తెగ ఆకర్షిస్తున్నది. సిల్వర్, ప్లాటినమ్ జువెలరీని పోలి ఉండే వైట్ గోల్డ్ నగలు ట్రెండీ లుక్‌తో కట్టిపడేస్తున్నాయి.
స్వచ్ఛమైన బంగారానికి ఇతర లోహాలను జతచేసి వైట్ గోల్డ్‌ని తయారుచేస్తారు. సాధారణంగా వైట్ గోల్డ్ 14, 18 క్యారెట్లలో అందుబాటులో ఉంది. వైట్ గోల్డ్‌తో ముఖ్యంగా వజ్రాభరణాలు డిజైన్ చేస్తున్నారు తయారీదారులు. కంఠాభరణాలు, బ్రేస్లెట్లు, చెవి కమ్మలు, నెక్లెస్‌లు, ఉంగరాలు ఇలా మ్యాచింగ్ సెట్లు అందుబాటులోకి తెస్తున్నారు.
ఇవి సంప్రదాయ బంగారం కంటే ట్రెండీ లుక్‌తో నేటి యువతను ఆకర్షిస్తున్నాయి. అంతేకాదు రోజువారీ వాడకానికి కూడా వైట్ గోల్డ్ జువెలరీ చక్కని ఎంపిక. ఈ ఆభరణాలపై రేడియం పూత వేస్తారు. వీటిని జాగ్రత్తగా భద్రపరచాలి. వైట్‌గోల్డ్ తయారీలో నికెల్, పల్లాడియం వాడుతుంటారు. నికెల్ కొందరికి అలర్జీ కలిగించవచ్చు. అందుకే పల్లాడియం వాడిన వైట్ గోల్డ్ ఆభరణాలు ఎంచుకోవడం ఉత్తమం. ఇంకెందుకు ఆలస్యం, మీరూ ఒకసారి ట్రై చేయండి!