గంటల కొద్దీ చేసే పనులను నిమిషాల్లో ముగించేస్తున్నాం.. ఒక్క క్లిక్‌తో ప్రపంచాన్ని చుట్టేస్తున్నాం. ఇదంతా స్మార్ట్‌ఫోన్ పుణ్యమే! అయితే మన పనులను సులభతరం చేసే ఈ మొబైల్ యాప్‌లు ఒక పక్కన సేవలను అందిస్తూనే, మరో పక్క సైలెంట్‌గా మన వ్యక్తిగత డేటాను దొంగలించే ముప్పునూ మోసుకొస్తున్నాయి. అందుకే మన ఫోన్లో ఉన్న ప్రతి యాప్ సురక్షితమే అని నమ్మడానికి లేదు. ఏమరుపాటుగా ఉంటే మన బ్యాంక్ వివరాల నుంచి ప్రైవేట్ ఫొటోల వరకు అన్నీ సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లే అవకాశం ఉంది.
ఫోన్లోని యాప్‌లు సురక్షితంగా ఉన్నాయో లేదో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. ఏదైనా యాప్‌ను ఇన్స్టాల్ చేయగానే అది మనల్ని కొన్ని పర్మిషన్లు అడుగుతుంది. ఇక్కడ అస్సలు ఏమరుపాటుగా ఉండొద్దు. ఎందుకంటే.. సాధారణ టార్చ్‌లైట్ యాప్ మీ కాంటాక్ట్స్ లేదా గ్యాలరీ యాక్సెస్ అడుగుతుందంటే అది కచ్చితంగా అనుమానించాల్సిన విషయమే. యాప్ పనితీరుకు సంబంధం లేని అనుమతులను కోరుతుందంటే మీ డేటాపై ఆ యాప్ కన్నేసిందని అర్థం.
ఒకవేళ మీరు ఇప్పటికే తెలియక అన్నింటికీ ‘ఎలో’ నొక్కేసి ఉంటే.. వెంటనే సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆయా యాప్‌లకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయండి. ఇలా చేయడం వల్ల అనవసరమైన డేటా యాక్సెస్‌ను అడ్డుకోవచ్చు. అంతేకాదు… యాప్‌లను ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేస్తున్నామనేది మీ ఫోన్ భద్రతను డిసైడ్ చేస్తుంది. అందుకే థర్డ్ పార్టీ యాప్స్ జోలికి పోవద్దు.