ఆధార్ కార్డు.. బ్యాంకు లావాదేవీలు.. పాన్‌కార్డులో మార్పులు.. ఏది చేయాలన్నా ముందుగా అడిగేది.. ‘ఓటీపీ వచ్చిందా?’ అని! అయితే, ఈ వన్ టైమ్ పాస్‌వర్డ్‌తో వస్తున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఆన్లైన్ లావాదేవీల్లో ఓటీపీ మోసాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. డిజిటల్ డెన్‌లో సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్న తరుణంలో.. ఈ ఓటీపీలు ఎంతవరకు సురక్షితం? అన్న సందేశం తలెత్తకమానదు. సిమ్ స్వాపింగ్, సెక్యూరిటీ ప్రోటోకాల్ లోపాలు ఓటీపీ భద్రతపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరింత పటిష్ఠమైన, ఆధునికమైన భద్రత కల్పించే ఆథెంటికేషన్ పద్ధతులు బయోమెట్రిక్ వెరిఫికేషన్, పాస్‌వర్డ్‌లెస్ ఆథెంటికేషన్ అవసరమని నిపుణుల అభిప్రాయం.
పాస్‌వర్డ్‌లెస్ అథెంటికేషన్ పద్ధతిలో.. వినియోగదారులు పాస్వర్డ్ గానీ, ఓటీపీ గానీ ఉపయోగించనక్కర్లేదు. భద్రత పరికరాలతోగానీ, బయోమెట్రిక్ డేటాను ఉపయోగించి గానీ లాగిన్ అవుతారు. ఇది ఫిషింగ్ సమస్యలను నివారిస్తుంది. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలు భద్రతాపరమైన సమస్యలను దృష్టిలో ఉంచుకోవాలి. తద్వారా బయోమెట్రిక్, పాస్‌వర్డ్‌లెస్ పద్ధతులను అమలు చేయడం ద్వారా వినియోగదారుల డేటాను రక్షించవచ్చు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించవచ్చు.
One-Time Password (OTP) అంటే ఒకేసారి మాత్రమే ఉపయోగించగల సాంకేతిక పాస్వర్డ్. దీన్ని మన ఆన్లైన్ లావాదేవీలు, బ్యాంకింగ్ కార్యకలాపాలు, ఇతర డిజిటల్ వ్యవహారాలకు ఉపయోగిస్తుంటాం. 1990 దశకంలో మొదటిసారి ఈ పద్ధతి పరిచయం అయింది. అప్పటికి ఉన్న పరిస్థితుల్లో డిజిటల్ భద్రతను పటిష్ఠం చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. 2000 సంవత్సరం నుంచి ఈ విధానం మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆన్లైన్ లావాదేవీలను ధ్రువీకరించడానికి పాస్‌కోడ్ ఓ సురక్షితమైన విధానంగా అమల్లోకి వచ్చింది. టెక్నాలజీ అప్డేట్ అవుతున్న కొద్దీ.. ఈ ఓటీపీలు హ్యాకర్ల చేతికి చిక్కుతున్నాయి. తెలివిమీరిన స్కామర్లు ఓటీపీలు జనరేట్ చేసి మరీ.. నిండా ముంచుతున్నారు. సిమ్ స్వాపింగ్, ఫిషింగ్ దాడుల కారణంగా ఎస్సెమ్మెస్ ఆధారిత ఓటీపీల భద్రతపై సందేహానికి తావిస్తున్నది.
సైబర్ నేరగాళ్లు ఇంటరప్ట్ చేయడం ఎస్సెమ్మెస్ ఓటీపీ భద్రతకు ముప్పుగా మారుతున్నది. ‘సిమ్ స్వాప్” మోసాల ద్వారా నేరగాళ్లు నేరుగా వినియోగదారుడి ఫోన్‌నెంబర్‌ను క్లోన్ చేస్తారు. తద్వారా వాళ్లు ఓటీపీ పొందే అవకాశం ఉంది. అలాగే ఫిషింగ్ మెసేజ్‌లు, కాల్స్ ద్వారా ఓటీపీని రాబడతారు. బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామనో, క్రెడిట్ కార్డు డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నామనో నమ్మబలుకుతారు. ‘ఇప్పుడు మీ ఫోన్‌కు వచ్చిన ఓటీపీ చెప్పమ’ని అడుగుతారు. అది వాళ్లకు షేర్ చేస్తే చాలు.. అకౌంట్ ఖాళీ అవ్వడం ఖాయం! ‘ఫోన్ నెట్‌వర్క్‌ను హ్యాక్ చేయడం ద్వారా వినియోగదారులకు వచ్చే ఓటీపీలను పొందడం నేరగాళ్లకు పెద్ద కష్టమేమీ కాదు. అందుకే ఈ వ్యవస్థను అప్డేట్ చేయాలి.
అంతేకాదు అపరిచితులకు ఓటీపీ షేర్ చేయరాదన్న స్పృహ అందరికీ కలిగేలా ప్రచారం చేయాల’ని సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. ఇక ఇ-మెయిల్ ఆధారిత ఓటీపీలు ఇన్‌బాక్స్‌కి చేరతాయి. ఇవి కూడా వినియోగదారుడి ఇ-మెయిల్ ఖాతా భద్రతపై ఆధారపడి ఉంటాయి. హ్యాకర్లు మెయిల్‌ని హ్యాక్ చేస్తే.. ఓటీపీలను ఇంటరప్ట్ చేయడం పెద్ద కష్టమేం కాదు. ఇక యాప్ ఆధారిత ఓటీపీ విషయానికి వస్తే.. కాస్త సురక్షితమే అనొచ్చు. Google Authenticator, Microsoft Authenticator లాంటి మొబైల్ అప్లికేషన్ల ద్వారా ఈ ఓటీపీలు జనరేట్ అవుతాయి. అయితే, ఈ పద్ధతిలో వినియోగదారులు ఆయా అప్లికేషన్లను ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవాళ్లు దీన్ని ఎంపిక చేసుకోవడం మంచిది.
సైబర్ నేరాల నుంచి రక్షించుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఫిషింగ్ లింక్‌లను క్లిక్ చేయకుండా ఉండాలి. ఓటీపీలను అధికారిక యాప్‌లో మాత్రమే ఉపయోగించడం అవసరం. అలాగే డ్యూయల్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA)తో భద్రతను మరింత పటిష్ఠం చేయవచ్చు. సైబర్ నిపుణులు TOTPs (Time-Based OTPs) లాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇది ప్రతి 30 సెకండ్లకు కోడ్‌ను మారుస్తుంది. దీంతో సైబర్ మోసగాళ్ల నుంచి రక్షణ పొందవచ్చు. ప్రస్తుతం దాదాపు అన్ని డిజిటల్ వ్యవస్థలూ ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాయి. అయినప్పటికీ.. ఎవరైనా ఓటీపీ అడిగితే చెప్పకుండా ఉన్నంత వరకే ఈ భద్రత ఉంటుందని గుర్తుంచుకోండి.
బయోమెట్రిక్ అథెంటికేషన్ ఇప్పుడు అందుబాటులో ఉన్నది. ఫింగర్ ప్రింట్, వాయిస్ ప్యాట్రన్స్, ఫేస్ రికగ్నిషన్‌తో అథెంటికేషన్ జరుగుతుంది. లైవ్‌నెస్ డిటెక్షన్ మరో పద్ధతి. ఈ టెక్నాలజీతో ఫొటోలు, వీడియోల ద్వారా హ్యాకింగ్‌కు అవకాశం లేకుండా చేయవచ్చు. పాస్వర్డ్, ఓటీపీతో పోలిస్తే ఈ బయోమెట్రిక్, లైవ్‌నెస్ డిటెక్షన్ పద్ధతులు సురక్షితం. సాంకేతిక అంశాలు పక్కనపెడితే, ఆన్లైన్ లావాదేవీల్లో వినియోగదారులు అప్రమత్తంగా ఉండటమే ప్రధానం. కాస్త ఏమరుపాటుగా ఉన్నా.. అసలుకే ఎసరొస్తుందని మర్చిపోవద్దు.